రమణ కొంటికర్ల………………………………………
opposition with in own party ………………….ఈటల.. స్వపక్షంలోనే ప్రతిపక్షం.. ఆది నుంచీ అదే శైలి.. రెండోసారి గులాబీపార్టీ గద్దెనెక్కే క్రమంలో దోబుచులాడిన మంత్రి పదవి.. ఆ తర్వాత చివరి నిమిషంలో దక్కినా.. నిత్యం తెలియని ఏదో అసంతృప్తి.. చాలాచోట్ల ఆయన మాటల్లో ప్రతిబింబించిన ఆ వైఖరే.. ఇవాళ ఉద్యమకాలం నుంచీ అన్నదమ్ముల్లా మెదిలిన కేసీఆర్, ఈటల మధ్య పార్టీ ఓనర్లెవరనే మీమాంసకు తెరలేపి.. కుటుంబం వంటి పార్టీలో తెగతెంపులకు తెచ్చింది.
అయితే ఈటల మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం.. ఆయనపై అప్పటి దాకా తిరిగిన మంత్రులే ప్రెస్ మీట్ పెట్టి మరీ తిరగబడటం.. ఈటల గమ్యమెటనే చర్చకు తెరలేపడం.. ఇంతకాలం ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలుంటాయన్న సోయి కూడా మరిచిన ప్రతిపక్షాలు సైతం ఈటలకు బాసటవ్వడం.. ఈటల అడ్డాలో పోలీసులు, అధికారులందరినీ వెనువెంటనే బదిలీలు చేయడం.. ఈటల ఇలాకాలో ఆయన బొమ్మ లేకుండా జిల్లాలోనే స్వపక్షంలోనే ప్రధాన ప్రత్యర్థిగా మారిన గంగుల ఫ్లెక్సీలు వెలవడం… ఓ బీసీపై, ఉద్యమనేతపై కేసీఆర్ ఈవిధంగా వ్యవహరిస్తారా అన్న చర్చ ఊపందుకుంటున్న దశలో.. వ్యూహాత్మకంగా పుట్టమధు వ్యవహారం తెరపైకి రావడం.. వా.. ఇది కదా ఇప్పటివరకూ సెల్యూలాయిడ్ కూ ఎక్కని తెలంగాణాలో గులాబీ గూట్లో కొనసాగుతున్న రసవత్తర పార్టీ నాటకం..?!!
అయితే మంత్రిగా ఉన్నప్పుడే ఈటెల వంటి మాటలను వదిలిన ఈటల.. ఇప్పుడు గులాబీబాస్ గుడ్ లుక్స్ కు దూరమై.. అదే పార్టీలో ఉంటూ.. అదే పార్టీ పెద్దల పైన మరింత యథేచ్ఛగా వ్యాఖ్యలు చేస్తున్న నాటకీయ పరిణామాలు భవిష్యత్ పొలిటికల్ డ్రామా మూవీకి ఓ మాంచి సబ్జెక్ట్ కూడా!
అయితే ఇప్పటికిప్పుడు పార్టీ ఈటల ను సస్పెండ్ చేస్తే..ఈటల ఎమ్మెల్యే పదవికి గండం తప్పుతుంది. ఈటల గనుక తనంతట తానే పార్టీకి రాజీనామా చేస్తే టెక్నికల్ గా పార్టీ బీఫాంపై గెల్చినందుకాయన పదవి ఊడిపోయి.. మళ్ళీ హుజురాబాద్ స్థానానికి ఎన్నిక తప్పని పరిస్థితి! ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితిలో ఈటల గనుక రాజీనామా చేసినా… అంగబలం, అధికార బలం, ధనబలం.. అన్ని బలాలను తట్టుకుని మళ్ళీ ఈటల నెగ్గాలంటే కూడా నల్లేరు మీద నడకేం కాపోవచ్చు!
ఒకవేళ ఇవన్నీ అధికారపక్షం ఉపయోగించినా.. ఔట్ రేట్ గా నియోజకవర్గ ప్రజలుగనుక ఈటల కు మద్దతు పలికితే గనుక ఆయన విజయమూ అంత పెద్ద కష్టమూ కాకపోవచ్చు!! కానీ ఏం జరుగుతుందో చెప్పలేని ఈ సంధి దశలో.. ఈటల పెంచుతున్న ఘాటువ్యాఖ్యలే.. తెలంగాణాలో చేవ చచ్చిన ప్రతిపక్షాల కంటే వాడివేడిగా అధికార పక్షానికి కనిపిస్తున్న వేళ.. ఈటల ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందీ.. పార్టీలోంచి తాను బయటకు పోక.. తమంతట తాము సస్పెండ్ చేయలేని పరిస్థితిలో.. గులాబీ బాస్ వ్యూహాలెలా ఉండబోతున్నాయి.. అందుకు ప్రతిగా ఆయన్నింతకాలం వెన్నంటి ఉండి ఓ నీడలా ఫాలో అయిన ఈటల ప్రతివ్యూహాలెలా ఉండబోతున్నాయన్నదే ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో కడు ఆసక్తికరం.