కాదనుకున్న హీరోనే కనకవర్షం కురిపించారు !!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala ……………………………………… 

“జే గంటలు” అనే సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి.  నిర్మాతలు విజయబాపినీడు, కాట్రగడ్డ మురారి కలసి సినిమా తీయాలనుకున్నారు. కథ మాటలు పాటలు బాధ్యత ఆత్రేయ మీద పెట్టారు. ఆయన సహజంగానే పట్టించుకోలేదు. దాంతో వేటూరితో పాటలు రాయించారు. పాటలకు అనుగుణంగా కథ రాసుకున్నారు. ఈ సినిమాలో హీరో వేషానికి చిరంజీవి కూడా వెళ్లాడు.

విచిత్రమేమంటే తర్వాత రోజుల్లో చిరంజీవితో గ్యాంగ్ లీడర్, మగమహారాజు లాంటి హిట్స్ తీసిన విజయబాపినీడు హీరోగా చిరంజీవిని కాదన్నారు. దీంతో రామ్ జీ అనే దాసరి కాంపౌండ్ నటుడ్ని తీసుకున్నారు. అతనికి రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పాడు.దర్శకుడుగా సింగీతం శ్రీనివాసరావును తీసుకున్నారు. ఆయన వైఖరి నచ్చక దర్శకత్వం ఎస్. శ్రీనివాసరావు అని టైటిల్స్ లో వేసి తన కసి తీర్చుకున్నాడు మురారి.

భారతీరాజా “కలుక్కుం ఈరమ్” లో నటించిన అరుణను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాకు వంశీ అసిస్టెంటు డైరక్టర్ గా పనిచేశారు. కొన్ని సీన్లు ఆయనే రాశారు కూడా. మహదేవన్ సంగీతం వేటూరి సాహిత్యం పాటలు మాత్రం చాలా పెద్ద హిట్టయ్యాయి. సినిమా మాత్రం అట్టర్ ఫ్లాపయ్యింది. 1981లో విడుదలైన ఈ సినిమా చాలా చేదు అనుభవాలు మిగిల్చిందంటారు సింగీతం.

సత్యానంద్ మాటల్లో మురారి అసలు సింగీతాన్ని డైరక్ట్ చేయనీయలేదు. ఇది ‘ఆమని సాగే చైత్ర రధం ‘ అనే ఓ అద్భుతమైన గీతం ఈ సినిమాలోదే. మురారి ది ఓ బ్యాక్ గ్రౌండు. బాపినీడుది మరో రకం నేపధ్యం. ఈ ఇద్దరూ కలసి జ్యోతి చిత్ర అనే బ్యానర్ పెట్టుకుని తీసిన ఈ సినిమా పాటలు యుట్యూబులో కూడా ఉన్నాయి. 

ఇక బాపినీడు గురించి చెప్పుకోవాలంటే 1976 లో ‘యవ్వనం కాటేసింది’ సినిమాతో నిర్మాతగా మారారు. ఆ చిత్రానికి దాసరి దర్శకత్వం వహించారు.తర్వాత తీసిన జేగంటలు ఫ్లాప్.ఆసినిమాకు హీరోగా వద్దనుకున్న చిరంజీవి దగ్గరకే మళ్ళీ వెళ్లారు.  ఆయనతో ‘మగమహారాజు’ సినిమాను  తీసి సంచలన విజయం అందుకున్నాడు. మధ్యతరగతి నేపథ్యం, సెంటిమెంట్ తో అల్లుకున్న కథ అందరిని ఆకట్టుకుంది.

ఆ తర్వాత చిరు తోనే “హీరో” అనే సినిమా తీశారు.  దీనికి నిర్మాత అల్లు అరవింద్. అది అనుకున్న రేంజ్ లో ఆడలేదు. ఆ వెంటనే “మహానగరం లో మాయగాడు” … “మగధీరుడు ” తీశారు .. ఈ రెండు హిట్ అయ్యాయి. వీటికి నిర్మాత మాగంటి రవీంద్రనాథ్ చౌదరి. చిరుకి వీటితో పాటు ఇతర సినిమాలు హిట్ అదీ వరుస విజయాలు కావడం తో అయన కెరీర్  ఊపందుకుంది.

మరల ఆ ఇద్దరి కాంబినేషన్ లో 1988 లో వచ్చిన ” ఖైదీ నెం 786″ మంచి హిట్ అయింది. ఇక “గ్యాంగ్ లీడర్” గురించి చెప్పనక్కర్లేదు.  బిగ్గెస్ట్ హిట్ … అప్పటివరకు ఉన్న రికార్డులను తిరగ రాసింది. చిరు అప్పటికే పెద్ద హీరో అయ్యారు. ఆ తర్వాత ఐదేళ్లకు  95 లో విజయబాపినీడు చిరు తో తీసిన “బిగ్ బాస్ ” ప్రేక్షకుల అంచనాలను తలక్రిందులు చేసింది. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో సినిమాలు రాలేదు. 

ఈ ఇద్దరి కాంబినేషన్లో ఏడు సినిమాలు తెరకెక్కితే ఆరు సినిమాలకు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాత గా వ్యవహరించారు. బాపినీడు  పట్నం వచ్చిన పతివ్రతలు , జూ లకటక , సీతాపతి చలో తిరుపతి ,మరికొన్ని సినిమాలు కూడా ఇతర హీరోలతో తీశారు.చిరుకి చాలా సన్నిహితమైన వ్యక్తిగా బాపినీడు కి పేరుంది.

ఒక పదేళ్ల పాటు  “చిరంజీవి” పేరు మీద ఒక ప్రత్యేక పత్రిక కూడా నడిపారు, కేవలం అభిమానుల కోసం రంగుల పేజీల్లో ఆ పత్రిక వచ్చేది. అంతకుముందు బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను కూడా బాపినీడు నడిపారు. ఆ   విజయ పత్రికలో సినిమా రివ్యూలు  బాగుండేవి. ఒంగోలు కి చెందిన గౌరీశంకర్ మాస్టారు ఆ రివ్యూలను రాసేవారు . పశ్చిమ గోదావరికి  చెందిన విజయ బాపినీడు 2019 ఫిబ్రవరిలో అనారోగ్యంతో కన్నుమూసారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!