Vishnu himself explained to Garuda about the hells ……………………..
మనుష్యులు మరణం అనంతరం అటు స్వర్గానికో ఇటు నరకానికో వెళ్ళక తప్పదని మన పెద్దలు చెబుతుంటారు. అసలు నరకం అంటే ఏమిటి ?అవెలా ఉంటాయో శ్రీమహావిష్ణువు గరుడుడి కి స్వయంగా వివరించాడు. గరుడ పురాణం ప్రకారం నరకాలు చాలానే వున్నాయి. వాటిలో కీలకమైన రౌరవాది నరకాల గురించి తెలుసుకుందాం.
అన్నింట్లో ‘రౌరవ’ మను పేరు గల నరకం ప్రధానమైనది. అబద్ధాలు చెప్పి, అబద్ధ సాక్ష్యాలిచ్చి ప్రజల హింసలకు కారకులైన వారిని ఈ నరకంలో శిక్షిస్తారు. దీని వైశాల్యం రెండు వేల యోజనాలు. దీని చుట్టూ ఒక పెద్ద కందకం ఉంటుంది.అది అగ్నిమయం. మధ్య మధ్యలో పాపులను అందులో పడేసి మరల తీస్తుంటారు. అందులో పడ్డ పాపులు ఆ వేడిని తట్టుకోలేక అటూ ఇటూ పరుగెడతారు.
కాళ్ళు బొబ్బలెక్కి కన్నాలు పడిపోతాయి. వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి అగ్ని జ్వాలల తీవ్రత ఉంటుంది. అలా ఒక వేయి యోజనాల దూరం పరుగు పెట్టాక ఆ పాపి ఆత్మ మరో నరకంలోకి పడిపోతుంది. నరకానికి రాగానే ప్రతి ఆత్మకూ ఒక శరీరాన్నిస్తారు. దానికి అన్ని బాధలు తెలుస్తుంటాయి. ఆ శరీరం భస్మం కాదు. మృతి చెందదు.
ఇక మహా రౌరవ నరకం గురించి చెప్పుకోవాలంటే …. ఈ నరకం అయిదువేల యోజనాల విస్తీర్ణంలో పఱచుకొని ఉంటుంది. అక్కడ నేల రాగిరేకు లాగా ఉంటుంది. దాని క్రింద అగ్ని నిత్యం రగులుతుంటుంది. ఆ భూమి విద్యుత్ ప్రభా సమాన కాంతులీనుతుంటుంది. అది పాపులకి అతి భయంకరంగా దర్శనమిస్తుంది. యమదూతలు పాపుల కాళ్లు చేతులను గట్టిగా కట్టి వేసి ఆ నేలపై దొర్లిస్తారు.
పాపి అలా దొర్లుతూనే వుండగా మార్గంలో కాకులు, కొంగలు, తోడేళ్ళు, గుడ్లగూబలు, మొసళ్ళు, తేళ్ళు వచ్చి పొడుస్తూ, చీల్చుతూ, కరుస్తూ, కుడుతూ అందినంత మేరకు నమిలి తింటూ వుంటాయి.
పాపి కనుల ముందే వాని శరీరం ముక్కలు అవుతుంది. ఏదో జంతువు ఆ ముక్కలను నమిలి వేస్తుంది. పాపులు అరుస్తారు, ఏడుస్తారు, కేకలేస్తారు, అయినా దొర్లించబడుతూనే వుంటారు.
వారి శిక్షా కాలం పూర్తి అయ్యేదాకా తినబడడానికే అన్నట్టు ఆ నారకీయ శరీరం అలా మిగులుతూనే వుంటుంది. పాప తీవ్రతను బట్టి శిక్షాకాలం వుంటుంది. అది పూర్తికాగానే తెలివి తప్పుతుంది. తెలివి వచ్చేసరికి మరో నరకంలోనో ఉంటుంది.
అతి శీతమను పేరు గల మరో నరకముంది. ఇది అత్యంత శీతల వాతావారణంతో ఉంటుంది. శరీరాన్ని తీవ్రంగా బాధపెడుతుంది. దీని పొడవు వెడల్పులు మహా రౌరవంతో సమానంగానే వుంటాయి. అంతటా చిక్కటి చీకటి నిండి వుంటుంది. సహింపరాని కష్టాన్ని కలిగించడం కోసం యమదూతలు పాపులను ఆ చీకటి కూపంలా ఉన్న లోకంలోకి విసిరేస్తారు. పాపులకు దిక్కు తోచదు. గుడ్డితనం వచ్చేసిందేమోనని భయపడిపోతారు.
తట్టుకోలేనంత వణకుతో శరీరం తల్లడిల్లిపోతుంటుంది. పళ్ళు టపటపా కొట్టుకొని విరిగిపోతుంటాయి. ఇతర పాపులు తగులుతుంటారు. ఆలింగనం చేసుకుంటారు. కానీ వారు తమలాంటి వారో ….. పిశాచాలో రక్కసులో తెలియదుగా.. పీక్కు తింటారేమో అనే భయంతో విడివడిపోతుంటారు. అక్కడ దాహం, ఆకలి చాలా ఎక్కువగా వుంటాయి.
ఎంత తడిమినా తినడానికీ తాగడానికీ ఏమి తగలవు. ఇంతేకాక మంచుగడ్డల్ని మరింత గడ్డ కట్టించేటంత అతి భీకర శీతలవాయువులు అక్కడ వీస్తుంటాయి. ఆ గాలుల తాకిడికి ఎముకలు పుటుక్కున విరిగిపోతుంటాయి. శిక్షాకాలం అయిపోగానే ఈ తమసావృత నరకం నుండి ఆత్మ వెలుగులోకి వచ్చిపడుతుంది. అసంఖ్యాకంగా పాపాలు చేసినవారు అయితే వెలుగులో పడరు. మరికొన్ని నరకాల గురించి మరో పోస్టులో తెలుసుకుందాం.