Gr.Maharshi………………………………
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా పోలీసులు ఎలుకలపై కేసు పెట్టారు. 60 ఫుల్ బాటిళ్లు అవి తాగేశాయి. స్టేషన్‌లో సీజ్ చేసిన బాటిళ్లతో ఎలుకలు భారీ మందు పార్టీ చేసుకున్నాయి. కథలు చెప్పడం పోలీసులకి కొత్త కాదు కానీ, ఈ కథ మరీ కొత్త. ఎలుకలు పార్టీ చేసుకుంటున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న.
ఇప్పుడు ఎలుకల్ని కోర్టుకి హాజరపరిస్తే, వాటికి జైలు శిక్ష విధిస్తే , అమలు చేయడం ఎట్లా? జైలు ఊచల్లోంచి దూకి పారిపోతాయి కదా! మనుషుల్నే ఎలుకలు కుక్కినట్టు సెల్‌లో కుక్కే పోలీసులకి ఎలుకలో లెక్కా?
సృష్టిలో అన్ని ప్రాణులు సమానమే అని వేదాంతం చెబుతుంది. కేసులకి కూడా ఈ సూత్రం వర్తిస్తుందని పోలీసులు అంటున్నారు. కేసుల కొద్దీ మద్యం తాగుతున్నప్పుడు ఎలుకలకి తెలిసి వుండదు, కేసుల్లో ఇరుక్కుంటున్నామని.మద్యంలో కిక్ వుందని ఎలుకలే తెలుసుకున్నప్పుడు, ఇక మనుషుల్ని అనడం కరెక్టా? ఈ సత్యాన్ని గ్రహించడం వల్ల అనేక రాష్ట్రాల్లో మంచి నీళ్లు లేకపోయినా మందుకి కొదవలేదు.
మామూలుగానే మందుబాబులకి నోరు తిరగదు. ఆంధ్రప్రదేశ్‌లో దొరికే బ్రాండ్లను గతంలో ఎన్నడూ చూడకపోవడం వల్ల, తాగకపోవడం వల్ల జగనన్న మందు అని పిలుస్తుంటారు. కృష్ణదేవరాయల కాలంలో వీధుల్లో వజ్రాలు అమ్మినారో లేదో తెలియదు కానీ, చంద్రబాబు కాలంలో మాత్రం మందుని వీధుల్లోనే అమ్మేవారు. బాబు ఐటికి మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ కాదు, మద్యం బ్రాండ్లకి కూడా అని తెలుగు తమ్ముళ్లు ఎంతకీ కిక్ ఎక్కని మందు తాగి వాపోతుంటారు.
ఎలుకలకి, మనుషులకి పెద్ద తేడా లేదు. కనపడినవన్నీ కొరికి తినడం ఎలుకలకి అలవాటు, మనుషులు కూడా దొరికినోన్ని దొరికినట్టు కరుస్తున్నారు. రాజకీయాల్లో కరవడం ప్రాథమిక అర్హత. ఎలుకలు తాగుతున్నాయనే గ్రహించే బ్లాక్ డాగ్ బ్రాండ్ పెట్టారు. అదే బ్లాక్ క్యాట్ అని పెడితే కస్టమర్లను పోగొట్టుకునే వాళ్లు.
ఎలుకల్లో చిట్టెలుకలు, ఎలుకలు, పంది కొక్కులు అని మూడు రకాలుంటాయి. వీటిలో మద్యం తాగిన ఎలుకల్ని పోలీసులు ఎలా గుర్తించారన్నది సమస్య. పంది కొక్కులు రాజకీయాల్లో చేరిపోయాయి. వాటినే మనం ఒక్కోసారి ఏనుగులు అనుకుని పొరపడుతుంటాం.
ఇక చిట్టెలుకలు ఎక్కువగా జర్నలిజాన్ని ఎంచుకున్నాయి. కిచకిచమని సౌండ్ చేస్తూ హడావుడి చేస్తుంటాయి. తాము పైకి కిందకి ఎగరడం వల్లే సమాజంలో సమతుల్యత సాధ్యమని నమ్ముతూ పిల్లి అనే యజమాని దగ్గర పని చేస్తూ వుంటాయి. కలం యోధులని గర్విస్తూ ఆ కలం చివర గుచ్చబడి చీకుల్లాగా నిప్పుల మీద కబాబుల్లా అంతమై పోతాయి.
ఇక మిగిలింది ఎలుకలు. వాస్తవానికి, భ్రాంతికి తేడా తెలియని దశలో మందు తాగేసి వుంటాయి. పోలీసుల మందు తాగితే కక్కే వరకూ తంతారని తెలియని అమాయక ప్రాణులు.
కొసమెరుపుః హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో అనేక పిల్లులుంటాయి. జర్నలిస్టుల కంటే అవే ముందుగా సభ్యులయ్యాయని పాత తరం వాళ్లు అంటున్నారు. రౌండ్ రౌండ్‌కి గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ మాట్లాడుతుంటారు. అయితే జర్నలిస్టుల కంటే పిల్లులకే రాజకీయ పరిజ్ఞానం ఎక్కువని ఈ మధ్య ఒక సర్వేలో వెల్లడైంది (ఎన్నికల నేపథ్యంలో చేసిన సవాలక్ష బోకు సర్వేల్లో ఇదొకటి).
ఎందుకంటే జర్నలిస్టులు ఏదో ఒక పార్టీ కొమ్ము కాయాలి. పిల్లులకి క్లబ్‌లో పార్టీ జరిగితే చాలు. అది ఏ పార్టీ అనేది అనవసరం. జర్నలిస్టులు బల్ల గుద్ది మాట్లాడినప్పుడల్లా బల్ల కింద ఉన్న పిల్లులు మ్యావ్ అని నవ్వుకుంటుంటాయి. అయితే అన్ని పిల్లులున్న ప్రెస్‌క్లబ్‌లో ఎలుకలు ఎందుకు చేరుతున్నాయన్నది బుద్ధి జీవుల ప్రశ్న.