Mohammed Rafee …………..
2026 గణతంత్ర దినోత్సవ వేడుకల (77వ రిపబ్లిక్ డే) సందర్భంగా భారత ప్రభుత్వం సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సంజయ్ లీలా బన్సాలీ, ఎం.ఎం. కీరవాణిలకు అత్యంత అరుదైన గౌరవాన్ని కల్పించింది.
ప్రముఖ సినీ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ భారతీయ సినిమాకు ప్రతినిధి గా గణతంత్ర పరేడ్‌లో ఇండియన్ సినిమా తరపున మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేక శకటాన్ని (Tableau) ప్రదర్శిస్తున్నారు. ఈ శకటానికి నాయకత్వం వహించే బాధ్యతను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంజయ్ లీలా బన్సాలీకి అప్పగించింది.
ఈ శకటం ‘భారత గాథ’ అనే థీమ్‌తో 113 ఏళ్ల భారతీయ సినిమా ప్రస్థానాన్ని, గొప్ప ఘట్టాలను ప్రపంచానికి చాటిచెప్పనుంది. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదని, అది భారతదేశపు శక్తివంతమైన సాంస్కృతిక రాయబారి అని ప్రభుత్వం గుర్తించినట్లు ఈ గౌరవం సూచిస్తోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ‘వందేమాతరం గీతానికి ‘ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో ‘వందేమాతరం’ గేయం బంకిం చంద్ర ఛటర్జీ రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనకు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.
దేశవ్యాప్తంగా వచ్చిన సుమారు 2,500 మంది కళాకారులు కీరవాణి స్వరపరిచిన బాణీలకు అనుగుణంగా కర్తవ్య పథ్ (Kartavya Path) లో ప్రదర్శన ఇవ్వనున్నారు. జాతీయ భావాన్ని ఉప్పొంగించే ఈ వేడుకలో ఒక దక్షిణ భారత సంగీత దర్శకుడికి జాతీయ స్థాయి బాధ్యతను అప్పగించడం ద్వారా కళా రంగంలో ప్రాంతీయ భేదాలు లేవని చాటిచెప్పినట్లయింది.
రిపబ్లిక్ డే పరేడ్‌లో ఒక భారతీయ చిత్ర దర్శకుడు అధికారికంగా సినిమా రంగానికి ప్రాతినిధ్యం వహించడం ఇదే మొదటిసారి. గాయని శ్రేయా ఘోషల్ పాడిన కొత్త గీతం బన్సాలీ శకటానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. ఈ గౌరవాలు భారతీయ సినిమా ప్రభావశీలతను, ప్రపంచవ్యాప్త గుర్తింపును ప్రభుత్వం అధికారికంగా గుర్తించినట్లు చెప్పుకోవచ్చు.
ఇక మన తెలుగు రాష్ట్రాలకు రాజకీయాలే ప్రధానం! అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఒకరినొకరు తిట్టుకోవడాలు మినహా ఇంకొకటి ఉండదు! ఇక్కడ అంతే! అక్కడ అంతే! కనీసం కళాత్మక శకటాల రేసులో కూడా లేకుండా పోయాయి. ప్రతియేటా జనవరి 26 గణతంత్ర వేడుకల్లో ఢిల్లీ ఎర్రకోట దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ ముందు, ప్రధాన నేతలు ప్రత్యక్షంగా చూస్తూ ఉండగా, కోట్లాదిమంది ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారాల్లో తిలకిస్తుండగా ఆయా రాష్ట్రాల ప్రగతికి సంబంధించిన శకటాలు కదులుతుంటాయి!
ఆ ర్యాలీ కనుల పండువగా ఉంటుంది. ఆయా రాష్ట్రాల అభివృద్ధి కళాత్మకత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి. ఈ శకటాల ర్యాలీలో పాల్గొనడం అనేది ఒక ప్రతిష్టాత్మక అంశంగా అన్ని రాష్ట్రాలు తీసుకుంటాయి. ఆరు నెలల ప్రక్రియ ఇది!ఈసారి రేసులో రెండు తెలుగు రాష్ట్రాలు లేవు! నమూనాలోనే తిరస్కరించబడ్డాయి! ఈసారి గణతంత్ర శకటాల ర్యాలీలో తెలుగు రాష్ట్రాల పేర్లు వినిపించవు.
కానీ, కళాకారుల ప్రదర్శనల్లో తెలంగాణ ఒగ్గు డోళ్లు, పేరిణి డప్పు నృత్యాలు కనువిందు చేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తప్పెట గుళ్ళు, బుర్రకథ, కూచిపూడి కనిపించునున్నాయి. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే శకటాల్లో మాత్రం ఈసారి వెనకబడిపోయాం. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత అయినా మన శకటాలకు ప్రత్యేక ఆకర్షణ ఉండేది!
పోటీలో తప్పనిసరిగా బహుమతులు గెలుచుకునేవి! ఈసారి అంతగా శ్రద్ధ చూపించని కారణంగా రెండు రాష్ట్రాల శకటాలు ఎంపిక కాలేదు.

