ఆ పిసినారి పాత్ర ను మరొకరు చేయలేరేమో ?

Sharing is Caring...

A rare actor …………………..

పై ఫోటో చూడగానే ఎవరికైనా నవ్వొస్తుంది. ఎదురుగా కోడిని వేలాడ తీసి లొట్టలేసుకుంటూ అన్నం తినే పరమ పిసినారులు ఉంటారా అనే సందేహం వస్తుంది. ఈ స్టిల్ ‘అహనాపెళ్ళంట’.. సినిమాలోది. ప్రముఖ రచయిత జంధ్యాల సృష్టించిన పాత్ర అది. గయ్యాళి అనగానే నటి సూర్యకాంతం ఎలా గుర్తుకొస్తారో …. పిసినారి అనగానే ‘అహ నా పెళ్ళంట’లోని లక్ష్మిపతి  పాత్ర గుర్తుకు వస్తుంది ఎవరికైనా.  

ఆ సినిమాలో బ్రహ్మానందం ఒక చోట ‘పిసినారితనానికి పరాకాష్ట ఇది’ అని అంటాడు. నిజంగా అలాటి పాత్రే అది. పిసినారి పాత్రలు ఎన్ని వచ్చినా ఆ పాత్రదే అగ్రస్థానం. ఈ సినిమాలో పిసినారి తనాన్ని ‘నభూతో న భవిష్యతి’ అన్న రీతిలో జంధ్యాల తెరకెక్కించారు. ఆ పాత్రను ఎప్పటికీ గుర్తుండి పోయేలా తీర్చిదిద్దిన క్రెడిట్, ఖ్యాతి జంధ్యాలదే. ఇక ఆపాత్రలో కోట కూడా జీవించారు.  

చిన్ని క్రాఫ్ .. ముతకపంచె,మాసిన బనీను,పగిలిన కళ్ళద్దాలతో కోట వెరైటీ గెటప్ లో కనిపిస్తారు. జంధ్యాల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని  ఆ పాత్రకు అలా రూప కల్పన చేశారు. ఈ గెటప్ లో కోట కొంచెం రఫ్ గా కనిపించాలనే ఉద్దేశ్యంతో మట్టిలో దొర్లించే వారట. మొదట్లో మామూలు కళ్ళద్దాలే కోట కు పెట్టాలనుకున్నారు. 

ముఖంలో పిసినారి తనం తాండవించాలంటే పగిలిన కళ్ళజోడు ఉంటే బాగుంటుందని భావించిన జంధ్యాల ఆ కళ్ళజోడుని తనే చిన్నరాయితో పగలగొట్టారట. 20 రోజుల పాటు ఆ పగిలిన కళ్ళజోడుతోనే నటించారు కోట. అటు దర్శకుడు జంధ్యాల,ఇటు నటుడు కోట కష్టపడ్డారు కాబట్టి ఆ లక్ష్మిపతి పాత్ర చిరస్థాయిగా నిలిచి పోయింది.  

పాత్ర ఏదైనా అందులో ఈజీగా ఇమిడిపోగల కొద్ది మంది నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు.అది గుర్తించారు కాబట్టే జంధ్యాల కోటను ఎంచుకున్నారు. ఈ పాత్రకు తొలుత రావుగోపాలరావు ను తీసుకోవాలని నిర్మాత రామానాయుడు భావించారు. అయితే కోట మాత్రమే కరెక్ట్ అని జంధ్యాల వాదించారు.చివరకు కోటనే ఎంపిక చేసుకున్నారు. జంధ్యాల అంచనా కరెక్ట్ అయిందని ఆ రోజుల్లోనే రామానాయుడు మీడియాకు చెప్పారు. 

ఇక ‘అహనాపెళ్ళంట’ సినిమాకు మూలం రచయిత ఆదివిష్ణు రాసిన నవల’సత్యం గారిల్లు’. అందులో సత్యం పాత్రనే లక్ష్మీపతి గా మార్చారు జంధ్యాల. దానికి మెరుగులు దిద్దారు. సినిమాలో లక్ష్మీపతి ని చూడటానికి  కొంతమంది వస్తారు.. వారు “అనంతపురం నుంచి వచ్చామండీ మిమ్మలను చూడటానికి” అంటారు. ‘అయితే నాకేంటి’ అంటాడు లక్ష్మీపతి. అంతలో బ్రహ్మానందం వచ్చి ‘చేతిలోబరువు పడితే కానీ మాట్లాడరండీ” అంటాడు. 

ఇంకో సందర్భంలో ‘ఇనుప ముక్కలు ఇంట్లోకి తేకండి’ అంటుంది భార్య. అపుడు లక్ష్మీపతి ‘ఆ శని గాడు నా జోలికి రాడే’ అంటాడు. రాత్రిపూట బస్టాండ్లో టీ అమ్మే సీన్ సూపర్ కామెడీగా ఉంటుంది. అలాగే పేపర్ లుంగీ కట్టుకోవడం వంటి సన్నివేశాలు,డైలాగులు సినిమాలో బోలెడు. బ్రహ్మానందం., రాజేంద్రప్రసాద్. సుత్తి వీరభద్రరావు కాంబినేషన్ లో  హాస్యం పొంగి పొర్లింది.

అందుకే సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కూడా జంధ్యాల సినిమాల్లో కోట కొన్ని వెరైటీ పాత్రల్లో చేశారు.ఒక అరుదైన పాత్ర .. మరొకరు చేయడానికి భయపడే పాత్ర చేసి అందరిని నవ్వించి ..మెప్పించిన కోట శ్రీనివాసరావు కూడా ఒక అరుదైన నట రత్నం.           

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!