ఈనాడు గ్రూప్ మరో సంచలనానికి తెర లేపింది. ఒకేసారి 12 భాషల్లో బాలభారత్ చానళ్లను ప్రారంభించబోతోంది. ఈ ఛానళ్లన్నీ ప్రత్యేకంగా బాలల కోసం మాత్రమే రూపుదిద్దుకున్నాయి. గ్లోబల్ కంటెంట్ ను స్థానిక భాషల్లో అందిస్తారు. పిల్లలను ఉత్తేజ పరిచే అంశాలతో పాటు వినోదం,విజ్ఞానం అందించే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. అలాగే పిల్లలలో సంస్కారం , విలువలు పెంపొందించే విధంగా కార్యక్రమాలను తయారు చేస్తుంది. ఇంకా అద్భుతమైన కథలు .. పాత్రలు అబ్బురపరిచే యానిమేషన్ , లైవ్ యాక్షన్లతో బాలలకు వినోదాన్ని అందిస్తుంది.
కామెడీ, యాక్షన్,అడ్వెంచర్,థిల్లర్, ఫాంటసీ వంటి అంశాలతో సీరియళ్లు కూడా రూపొందిస్తున్నారు. వివిధ కథాంశాలతో చిన్నారులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించడమే ఈ ఛానళ్ల లక్ష్యం. ఇప్పటికే యానిమేషన్ సీరియల్ అభిమన్యు రెడీ అయింది. రోజుకో బాలల సినిమాను అందిస్తారు. వారాంతాల్లో మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో పిల్లలను అలరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతర్జాతీయ కంటెంట్ ను అందిచడం కోసం పెద్ద ఎత్తున అన్ని భాషల్లో రచయితలను కూడా తీసుకున్నారు.
రెండేళ్ల నుంచి ఈ ఛానళ్ల ఆరంభానికి ప్రయత్నాలు జరిగాయి.
గత ఏడాది ఫిబ్రవరిలో ఈ చానళ్లకు రామోజీ లైసెన్సు తీసుకున్నారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ , గుజరాతీ, కన్నడ , మరాఠీ,మలయాళం,తమిళం, అస్సామీ , బంగ్లా ,ఒడియా ,పంజాబీ భాషల్లో బాలభారత్ చానళ్ళు ఇవాళ్టినుంచి మొదలు కానున్నాయి. రామోజీ గ్రూప్ లో ఇప్పటికే ఈటీవీ ఏపీ, ఈటీవీ తెలంగాణ , ఈటీవీ ప్లస్ ,ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్ వంటి చానళ్ళు ఉన్నాయి. ఈ టీవీ భారత్ పేరిట అన్ని భాషల్లో న్యూస్ పోర్టల్స్ ను నడుపుతున్నారు.
ఇప్పటికే టాటా స్కై … సన్ టీవీ లతో చర్చలు ముగిసాయి. మిగిలిన వారితో సంప్రదింపులు జరుగుతున్నాయి.
కాగా ఆమధ్య రామోజీరావు ఆర్థికంగా దెబ్బ తిన్నారని విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే ఈ కొత్త ప్రాజెక్టు తో అవన్నీ పసలేని ప్రచారాలని తేలిపోయింది.బాలల కోసం ప్రత్యేకించిన ఛానల్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలభారత్ చానళ్ళు దేశీయంగా డిమాండ్ ను సొమ్ము చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ డిజిటల్ యుగం లో పెరుగుతున్న బాలలు టీవీ చూస్తూనే పాలు తాగుతున్నారు… భోజనం చేస్తున్నారు…చదువుకుంటున్నారు. ఈ క్రమంలో పిల్లలను ఈ చానళ్ళు ఆకర్షించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
—————-K.N.Murthy