రామప్ప నంది ఠీవే వేరు !

Sharing is Caring...

రామప్ప ఆలయంలో శిల్పకళ చూసేందుకు రెండు కనులు చాలవు. ఆలయంలో స్థంభాలు,పీఠములు, మండపం, గర్భాలయ ప్రవేశద్వారం, ద్వార బంధనం, మకరతోరణాలు అర్థమండపాలు, ప్రదక్షిణాపధం,మదనికలు,శాసన శిల్పం వేటికవే సాటి లేని అద్భుతాలు.  ప్రతి శిల్పంలోను ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అయితే వీటన్నింటి కంటే భిన్నమైనది రామప్ప నంది విగ్రహం.

దేశంలోని పలు నిర్మాణ శైలులలో నంది విగ్రహాలు ఎన్నో కనిపిస్తాయి. మైసూరు నంది, లేపాక్షి నంది, యాగంటి నంది, హొయసల నంది మొదలైనవి ఎన్నో ఉన్నాయి కానీ వీటన్నంటిలో రామప్ప నంది రాజసమే వేరు. ఆ శిల్పం ప్రత్యేకమైంది. ఆ మాటకొస్తే కాకతీయ నంది విగ్రహాలు ఇతర నిర్మాణ శైలిలో నిర్మించిన నంది విగ్రహాలు కన్నా అందంగా ఉంటాయి.

సహజత్వం ఉట్టిపడేలా ఉండే కాకతీయ నంది విగ్రహాలలో ఉన్న సున్నితమైన పనితనం కానీ అలంకరణలు ఇతరచోట్ల నందులలో మనకు కనిపించవు. ప్రధానంగా హన్మకొండ  వేయి స్థంభాల గుడిలో నంది..  రామప్పలోని నంది విగ్రహాలను ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టుగా చెక్కారు.

రామప్ప నందికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.ఈ నంది విగ్రహాన్ని ఎదురుగా ఉండి చూసినా, మరోవైపు నుంచి చూసినా అది మన మననే చూస్తున్నట్టు అనిపిస్తుంది. లే అనగానే లేచి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. నంది మీద ఉన్న వివిధ ఆభరణాలను సైతం ఎంతో మనోహరంగా చెక్కారు. విగ్రహాన్ని బసాల్ట్ అనే నల్లరాయితో నిర్మించారు. 

దీనిని  ఇగ్నీషన్ రాక్ అని కూడా అంటారు. అగ్నిపర్వతపు లావా ఘనీభవించినప్పుడు రూపొందినదే ఈ శిల. ఈ శిలలోపలు లోహ సంబంధిత ధాతువులుంటాయి. ఎక్కువభాగం ఇనుము, గ్రానోడయారైట్ అనే మరొక రకం లోహం ఉంటాయి. ఈ శిలలో క్వార్ట్జ్, మైకా అనే పదార్థాలుండడం వల్ల పాలిష్‌తో దానికి వెలుగు పరావర్తనం చెందగల మెరుపు వస్తుంది.

దీనికున్న కాఠిన్యం వల్ల అతిసూక్ష్మమైన నగిషీ డిజైన్లు చెక్కడం కూడా సాధ్యపడింది.కాకతీయుల శిల్పా  కళా వైభవానికి ప్రతీకగా చెప్పుకునే రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించడంతో మరోసారి ఈ ఆలయ శిల్పాలపై విశ్లేషణలు వెలువడుతున్నాయి. 

———-– కన్నెకంటి వెంకట రమణ  సౌజన్యంతో 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!