తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రకటన కార్యక్రమం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రజనీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైబీపీ కారణం గా ఆయన ఆసుపత్రిలో చేరారు.ప్రస్తుతం రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో హాస్పిటల్ వైద్య బృందం బులెటిన్ విడుదల చేసింది. రజనీ కొద్దిరోజుల క్రితం చెప్పిన మాట ప్రకారం ఈనెల 31 న పార్టీ పేరు ప్రకటించాల్సి ఉంది. అయితే రజనీ కొద్దీ రోజులు విశ్రాంతి తీసుకోవాలని … ఒత్తిడికి లోను కాకూడదని డాక్టర్లు చెబుతున్న నేపథ్యంలో పార్టీ ప్రకటన వాయిదా పడవచ్చు అంటున్నారు.
ఇదిలా ఉంటే కుటుంబసభ్యులు కూడా ఆయనను విశ్రాంతి తీసుకోమని … పార్టీ విషయం తర్వాత చూసుకోవచ్చని చెబుతున్నట్టు తెలుస్తోంది. రజనీకాంత్ రాజకీయాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఒత్తిడికి లోనయ్యారని అంటున్నారు. రాబోయే జనవరిలోనే రాజకీయ ప్రవేశం చేస్తానని ప్రకటించిన క్రమంలో ఏలాంటి వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించుకోవాలా అని రజనీ కొద్దిరోజులుగా తీవ్రంగా ఆలోచిస్తున్నారని సమాచారం .
అందువల్లే బీపీ పెరిగిందని అంటున్నారు. జనవరిలో పార్టీ ప్రకటిస్తే, మే నెలలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ కొద్దీ సమయంలో తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం వీలవుతుందా అని రజనీ ఆందోళన లో ఉన్నట్టు కూడా చెబుతున్నారు. అందువల్లే ఒత్తిడికి గురయ్యారని అంటున్నారు. ఆరోగ్యం సహకరించడం లేదు అంటూ తన రాజకీయ అరంగేట్రాన్ని రజనీ వాయిదా వేసుకొనే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి ముందు ఇదో పొలిటికల్ స్టంట్ అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నెల 12తో రజనీకాంత్ 70 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తన పుట్టినరోజుకు కొద్ది రోజుల ముందే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. 31 న రజనీ పార్టీ పేరు, ఆశయాలు, పార్టీ పతాకం, గుర్తు తదితర వివరాలను ప్రకటిస్తామన్నారు. ఈ లోగా ఆయన ఒత్తిడికి గురయ్యారు.కాగా జనవరి 14 సంక్రాంతి రోజున పార్టీని ప్రారంభిస్తే ఆ సెంటిమెంట్ బాగా వర్క్‌ఔట్ అవుతుందనే కొత్త ప్రచారం కూడా జరుగుతోంది.