Ravi Vanarasi………………..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లకల్లోలంగా మారాయి.సినీ గ్లామర్, రాజకీయాలు పెనవేసుకుపోయి అభిమానుల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ ఒక మిత్రుడికి మద్దతుగా ప్రచారం చేయడం, దానికి మరో హీరో పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ఊహించని స్థాయిలో వ్యతిరేకత ఎదురైంది.
ఈ క్రమంలోనే అసభ్యకరమైన తిట్లు కూడా వినిపించాయి. ఈ పరిణామాలు కేవలం రాజకీయ వాతావరణాన్నిమాత్రమే కాదు, టాలీవుడ్ పరిశ్రమలోని అంతర్గత సంబంధాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి.ఆ సమయంలో, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులను, ముఖ్యంగా ఇంటి ఆడవారిని లక్ష్యంగా చేసుకుని, మరీ దారుణంగా, అసభ్య పదజాలంతో దూషించారు.
ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ అభ్యర్ధికి ప్రచారం చేసినందుకేనా ? అన్నప్రశ్న తలెత్తింది. ఈ పరిణామాలు వ్యక్తిగత దూషణ స్థాయికి వెళ్లి, తెలుగు సమాజంలో ఆరోగ్యకరమైన చర్చలకు తావు లేకుండా చేసాయి. సినిమా తారలు, రాజకీయ నాయకులు తమ అభిమానులకు ఒక ఆదర్శంగా నిలవాలి… కానీ అపుడు జరిగిన సంఘటనలు, అభిమానుల మధ్య విద్వేషాన్ని, దురభిప్రాయాలను పెంచి పోషించాయి.
అల్లు అర్జున్ ప్రచారం చేసిన అభ్యర్థి ఓడిపోవడం, పవన్ కళ్యాణ్ గెలవడం .. ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం వంటి పరిణామాలు రాజకీయంగా అల్లు అర్జున్‌కు కొంత ప్రతికూలతను తెచ్చిన మాట వాస్తవం.
ఆ కష్టకాలంలో, అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్! సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుండి విడుదల వరకు, సినిమా పట్ల ఒక రకమైన సానుకూల వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, మెగా కుటుంబంలోనే ఒక భాగమైన అల్లు అర్జున్‌పై జరిగిన దుష్ప్రచారం, కొన్ని వర్గాల ప్రజలలో ఒక రకమైన సానుభూతిని కూడా కలిగించి ఉండవచ్చు.
నిజానికి, కొంతమంది కులపెద్దలు సైతం, అల్లు అర్జున్ సినిమాకు వ్యతిరేకంగా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ప్రచారం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. “మెగా కుటుంబం”, “కులం” అనే రెండు పదాలు సినిమా రాజకీయాలలో ఎలా కలగలిసిపోయాయో ప్రజలు చూశారు. అయితే, ప్రజలు ఈ రాజకీయ, కులపరమైన విభేదాలను పట్టించుకోలేదు.
వారికి ముఖ్యం సినిమా. కంటెంట్ బలంగా ఉంటే, ఎంతటి వ్యతిరేకతనైనా తట్టుకుని నిలబడగలదని పుష్ప 2 నిరూపించింది. సినిమా విడుదలైన తర్వాత, తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులు పుష్ప 2కు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది.
ఇది కేవలం ఒక సినిమా విజయం కాదు, ఇది కంటెంట్ విజయం. రాజకీయాలు, కులాలకు అతీతంగా, సినిమా తన శక్తిని చాటిచెప్పింది. ప్రేక్షకులు మంచి సినిమాను ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి స్పష్టమైంది. ఈ విజయం అల్లు అర్జున్‌కు వ్యక్తిగతంగానే కాకుండా, పరిశ్రమలో అతని స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది.
ఇక పవన్ కళ్యాణ్ సినిమా గురించి చూద్దాం. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అయిన మొదటి సినిమా ‘హరిహర వీరమల్లు’…దీంతో అభిమానులలో, సినీ పరిశ్రమలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్, మంత్రివర్గ సహచరులు, జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, అలాగే కుల పెద్దలు కూడా ఈ సినిమాకు మద్దతుగా ప్రచారం చేశారు.
ఒక రకంగా, ఇది పవన్ కళ్యాణ్ తన రాజకీయ పలుకుబడిని, తన అధికార స్థానాన్ని తన సినిమా విజయానికి ఉపయోగించుకునే ప్రయత్నంలా కనిపించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమాకు ప్రచారం చేయడం, కొందరు నాయకులూ మద్దతు ఇవ్వడం సినీ చరిత్రలో కనిపించని దృశ్యం.అంతటి మద్దతు, ప్రచారం లభించినప్పటికీ, హరిహర వీరమల్లు అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. కారణం స్పష్టమే. సినిమాలో విషయం లేకపోవడం.
ఎంతటి ప్రచారం ఉన్నా, ఎంతటి రాజకీయ మద్దతు ఉన్నా, కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు సినిమాను తిరస్కరిస్తారని ఈ సినిమా నిరూపించింది. ప్రేక్షకులకు ఒక నటుడి రాజకీయ స్థానం, అతని కులం, లేదా అతని చుట్టూ ఉన్న ప్రచారాలు ముఖ్యం కాదు. వారికి కావాల్సింది ఒక మంచి కథ, ఆకట్టుకునే నటన.ఈ సినిమా విషయంలో, ఇవేవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో, హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద నత్త నడక నడుస్తోంది.
అటు పుష్ప 2 … ఇటు హరిహర వీరమల్లు తెలుగు సినీ పరిశ్రమకు, రాజకీయ నేతలకు .. ముఖ్యంగా అభిమానులకు,ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. రాజకీయాలు, కులాలు, వ్యక్తిగత విద్వేషాలు సినిమా విజయానికి కొలమానం కావు. ప్రేక్షకుడికి ముఖ్యం సినిమా. కంటెంట్.. అది బలంగా ఉంటే, ఎంతటి అడ్డంకులనైనా అధిగమించి విజయం సాధించవచ్చు.
కేవలం స్టార్డమ్, ప్రచారం మాత్రమే సినిమాను గట్టెక్కించలేవు…సినిమాలను కేవలం వినోదంగా చూడాలి, వాటికి రాజకీయ రంగు పులిమి, కుల విబేధాలకు వాడుకోవడం సరికాదు. అభిమానం అనేది ఆరోగ్యకరంగా ఉండాలి, అది ద్వేషంగా మారకూడదు.

