దివంగత నేత,తలైవి జయలలితకు ఆంగ్లభాషపై అద్భుతమైన పట్టు ఉండేది.తెలుగు, తమిళం, కన్నడం హిందీ కూడా బాగానే మాట్లాడేవారు. సినిమా పరిశ్రమలో ఉండగా ఆ భాషలను ఆమె నేర్చుకున్నారు. ఆమె 1984 లో రాజ్య సభకు నామినేట్ అయ్యారు. అక్కడ కూడా ఆమె తన భాషా పాండిత్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు పొందారు.
ఒకరోజు రాజ్యసభలో జయలలిత ఆంగ్లంలో అనర్గళం గా ప్రసంగిస్తుంటే సభ్యులంతా ఆశ్చర్యపోయారట.అప్పటి ప్రధాని ఇందిర గాంధీ, మరికొందరు ప్రముఖులు రాజ్యసభ గ్యాలరీ కొచ్చి కూర్చుని మరీ ఆమె ప్రసంగాన్ని విన్నారు. ఆరోజు జయకు ఇచ్చిన సమయం 10 నిమిషాలు మాత్రమే. అయితే అరగంటకు పైగా మాట్లాడారు. తర్వాత ఇందిర స్వయంగా వచ్చి జయలలితను ప్రశంసించారు.
ఈ పరిచయమే తర్వాత రోజుల్లో కాంగ్రెస్ అన్నాడీఎంకే ల మధ్య పొత్తుకు దారి తీసింది. అన్నాడీఎంకే నేత ఎంజీఆర్ కూడా జయ నుంచి ఇదే ఆశించారు. అలాగే ఒకసారి ఉత్తర ప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ తమ పార్టీ ఎన్నికల ప్రచారానికి జయలలిత ను పిలిచారు.
ఆమె హిందీ లో మాట్లాడలేరు అనే ఉద్దేశ్యంతో అనువాదకులను కూడా సిద్ధం చేశారు. కానీ జయలలిత మొత్తం స్పీచ్ హిందీలోనే పూర్తి చేసి జనాలను ఆకట్టుకున్నారు. ఆ సభకొచ్చిన ఇతర నేతలంతా జయ ప్రసంగించిన తీరు చూసి అబ్బుర పడ్డారట.
జయలలిత నా ఫేవరేట్ హీరోయిన్.ఆమె నటించిన సినిమాలన్నీ దాదాపుగా చూసాను.అయితే ఆమెను అతి దగ్గరగా చూస్తానని కలలో కూడా అనుకోలేదు.అలాంటి అవకాశం అనుకోకుండా వచ్చింది. హీరోయిన్ గా కంటే ఇంకా గొప్ప పొజిషన్ లో ఒక రాష్ట్ర సీఎం గా జయలలితను చూసాను.
సాదారణంగా నంది అవార్డుల పంపిణీ వేడుకలు హైదరాబాద్ లోనే జరుపుతారు.1992 లో మాత్రం నెల్లూరు పట్టణంలో జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్య అతిధి ఎవరో కాదు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. ముందుగా ఈ విషయం తెలియడంతో అప్పటి ఆంధ్రజ్యోతి తిరుపతి న్యూస్ ఎడిటర్ కృష్ణమూర్తి గారు నన్ను కవరేజ్ కి వెళ్లమన్నారు.
జ్యోతిచిత్ర కు స్టోరీ కావాలని తోటకూర రఘు గారు చెప్పారు. అప్పటి నెల్లూరు స్టాఫ్ రిపోర్టర్ నిమ్మరాజు రామ్మోహన్ కి ఫోన్ చేసి పాసులు తీసుకోమని చెప్పాను. జూన్ 4 మధ్యాహ్నం కల్లా నెల్లూరు చేరుకున్నాను. నేను,రామ్మోహన్, మరో రిపోర్టర్ సుధాకర్ కూర్చొని కవరేజ్ ఎలా చేయాలో ప్లాన్ చేసాం.
జయలలిత స్పీచ్ నేను, సీఎం నేదురుమల్లి జనార్ధనరెడ్డి స్పీచ్ రామ్మోహన్, ఇతరుల స్పీచ్ .. మీటింగ్ హైలైట్స్ సుధాకర్ కవర్ చేయాలని నిర్ణయించుకున్నాం. ముందుగా అనంతపూర్, కొన్ని ఇతర ఎడిషన్స్ కోసం బ్రీఫ్ రిపోర్ట్ పంపాలని ప్లాన్ చేసాం.ఆరున్నర .. ఏడు గంటల మధ్య సీఎం జయలలిత ను తోడ్కొని ఏపీ సీఎం జనార్ధనరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సభా ప్రాంగణంలోకి వచ్చేసారు.
గబగబా అతిధులు స్టేజి పైకి వెళ్లే మార్గం దగ్గరకు వెళ్ళాం. ఫుల్ సెక్యూరిటీ మద్య జయలలిత ఉన్నారు. అయినా లోపలకు చొరబడ్డాం. అప్పటికే స్థానిక ప్రముఖులను నేదురుమల్లి జయలలిత కు పరిచయం చేస్తున్నారు.మాగుంట మమ్మల్ని ముందుకు తోశారు. నేదురుమల్లి మమ్మల్ని ప్రెస్ పీపుల్ అంటూ జయలలితకు చూపారు. ఆమె నమస్కరించారు.మేము ప్రతి నమస్కారం చేసి వచ్చి మా సీట్లలో కూర్చున్నాం.
సభ మొదలైంది. నేదురుమల్లి క్లుప్తంగా నంది అవార్డుల ప్రాముఖ్యతను వివరించి మైకు జయలలిత కు ఇచ్చారు.మొదటి 5 నిమిషాలు ఆమె తెలుగు లో మాట్లాడింది.రామ్మోహన్ కి చెవిలో కొన్ని పాయింట్లు చెప్పి పంపించేసాను. దగ్గర్లో ఉన్నటెలిఫోన్ బూత్ నుంచి ఆఫీస్ కి ఫోన్ చేసి టీపీ ఆపరేటర్ కి వార్త చెప్పి రమ్మన్నాను. రామ్మోహన్ అటు వెళ్ళగానే జయలలిత స్పీచ్ సడన్ గా ఇంగ్లిష్ లోకి మారింది.
అక్కడ నుంచి ఇంగ్లీష్‌లో దంచి కొట్టింది. అనువాదకులు లేరు. ఫాలోకావడం కష్టం అనిపించింది. పక్కనే ఉన్న చాలామంది పాత్రికేయులు కూడా నోరెళ్లబెట్టారు. నా పరిస్థితి అంతే. తెలుగు మీడియం లో చదువుకున్నోళ్లకు ఆమె స్పీడ్ ను ఫాలో అయి అర్ధం చేసుకోవడం కష్టమే. ఆమె అనర్గళంగా మాట్లాడుతోంది.
దాంతో పాయింట్స్ నోట్ చేసుకోవడం ఆపేసి శ్రద్ధగా వింటూ కూర్చున్నా. తన స్పీచ్ మొత్తంలో తెలుగు పరిశ్రమ తో తనకున్న అనుబంధాన్ని ఆమె వివరించింది. అంతే. రామ్మోహన్ రాగానే నేను ఆఫీస్ కొచ్చేసా. ఆఫీస్‌లో నేను చెబుతుంటే అప్పటి ఆపరేటర్ చెంచు కృష్ణయ్య వేగంగా టైపు చేసాడు. అరగంట తర్వాత రామ్మోహన్ .. సుధాకర్ వచ్చేసారు.
అన్ని ఎడిషన్లకు న్యూస్ పంపాము. ఫోటో రీల్ ఒక కార్ లో పంపించాం. చిత్తూర్ ఎడిషన్‌లో ఫోటోలు న్యూస్ కవర్ అయ్యాయి.
హైదరాబాద్ , విజయవాడ ఎడిషన్స్ లో కూడా న్యూస్ బాగా కవర్ అయింది. అదొక అరుదైన అనుభవం. ఆ తర్వాత ఎండీ జగదీశ్ ప్రసాద్ గారు తిరుపతి వచ్చినపుడు ఈ కవరేజ్ గురించి మాట్లాడుతూ అభినందించారు.
———— K.N.MURTHY