పోస్టల్ టైమ్ డిపాజిట్ ..ఆకర్షణీయం !

Sharing is Caring...

Time Deposits ……………………………………………………

పోస్టాఫీసు అందిస్తున్న పెట్టుబడి పథకాల్లో ‘టైమ్ డిపాజిట్’ ఒకటి. బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్లను పోలి ఉండడంతో వీటిని పోస్టాఫీసు ఫిక్స్ డ్ డిపాజిట్లు అని కూడా పిలుస్తారు.నిర్ణీత కాలానికి డిపాజిట్ చేసిన మొత్తానికి హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. కాబట్టి నష్టభయం లేని పెట్టుబడులను కోరుకునే వారు పోస్టాఫీసు అందించే టైమ్ డిపాజిట్లలో పొదుపు చేయొచ్చు.

భారతదేశ నివాసితులైన వ్యక్తులు ఎవరైనా పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ ఖాతాను తెరవొచ్చు. భారతీయ నివాసితులు కాని వారు ఖాతాను తెరిచే వీలులేదు. ఈ ఖాతాను నగదు లేదా చెక్ ద్వారా ఓపెన్ చేయొచ్చు. చెక్ ద్వారా ఖాతా తెరుస్తుంటే చెక్ చెల్లుబాటు అయిన తేదీని ఖాతా తెరిచిన తేదీగా పరిగణిస్తారు.ఖాతాను కనీసం రూ. 1000తో తెరవాల్సి ఉంటుంది.

గరిష్ఠ డిపాజిట్ పై ఎలాంటి పరిమితులూ లేవు. ఉమ్మడిగా కూడా ఈ ఖాతాను తెరవొచ్చు. అయితే, గరిష్ఠంగా ముగ్గురు వ్యక్తులు మాత్రమే జాయింటుగా ఖాతాను తెరిచే వీలుంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కూడా తెరవొచ్చు. దీనిపై ఎలాంటి పరిమితులూ లేవు. మైనర్ల తరఫున తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఖాతాను తెరవొచ్చు. నిర్ధిష్ట వయసు వచ్చిన తర్వాత మైనర్లు స్వయంగా తమ ఖాతాను నిర్వహించుకోవచ్చు.

ఒక వ్యక్తి తన ఖాతాను ఒక పోస్టాఫీసు బ్రాంచి నుంచి మరొక బ్రాంచికి సులభంగా బదిలీ చేసుకోవచ్చు. టైమ్ డిపాజిట్ ఖాతాలో వివిధ కాలపరిమితులతో లాక్-ఇన్ పిరియడ్ ఉంటుంది. ఒకటి, రెండు, మూడు, ఐదు సంవత్సరాల కాలపరిమితులతో డిపాజిట్ చేయవచ్చు. కాలవ్యవధిని పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. పోస్టాఫీసు అధికారికి దరఖాస్తు సమర్చించి కాల పరిమితిని పొడిగించుకోవచ్చు.

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ ఖాతా వడ్డీ రేట్లను త్రైమాసిక ప్రాతిపదికన లెక్కిస్తారు. కానీ వార్షిక ప్రాతిపదికన చెల్లిస్తారు. త్రైమాసికానికి ఒక సారి వడ్డీరేట్లను సవరిస్తారు. ప్రస్తుత త్రైమాసికానికి 1,2,3 సంవత్సరాల కాలవ్యవధి గల డిపాజిట్లపై 5. 50%, ఐదేళ్ల కాలవ్యవధి గల డిపాజిట్లపై 6.70% వడ్డీ లభిస్తోంది. డిపాజిట్ దారులు ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షల వరకు మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.

అయితే, ఇది ఐదేళ్ల లాక్-ఇన్ పిరియడ్ ఉన్న డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుంది. పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లను అవసరమైతే మెచ్యూరిటీ కంటే ముందే విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఖాతా తెరిచిన రోజు నుంచి కనీసం 6 నెలల పాటు డిపాజిట్లను కొనసాగించాలి.

ఆ తర్వాత మాత్రమే ముందుస్తు విత్ డ్రాలను అనుమతిస్తారు. ఖాతా తెరిచిన ఆరు నెలల నుంచి ఏడాది లోపు డబ్బు విత్ డ్రా చేసుకుంటే.. డిపాజిట్లపై పోస్టాఫీసు పొదుపు ఖాతాపై లభించే వడ్డీ మాత్రమే లభిస్తుంది. ఒక సంవత్సరం తర్వాత విత్ డ్రా చేసుకుంటే డిపాజిట్లపై సాధారణంగా లభించే వడ్డీ రేటు కంటే 1 శాతం తక్కువ వడ్డీ లభిస్తుంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!