Bharadwaja Rangavajhala…..
ఎన్టీఆర్ సిఎం గా ఉన్న రోజుల నాటి ఓ విషయం గుర్తొస్తోంది.హోటళ్ల వారు జనాలను దోచుకు తినేస్తున్నారని ఓ ఫైన్ మార్నింగ్ ఎన్టీఆర్ కు అనిపించింది. ఎందుకు అనిపించింది అనేది ఎవరికీ తెలియదు. ఆయనకి అనిపించింది అంతే … టిఫెన్లు తిందామని వస్తున్న ప్రజల్ని హోటల్ వాళ్లు టిఫెన్ చేసేస్తున్నారనేది ఆయనకు ఓ ఒపీనియన్ను ఫామయ్యింది.
అంతే … ఆయన హోటల్ లో ఏ టిఫెన్ ఎంతకి అమ్మాలో ఓ రేటు నిర్ణయించి జీవో విడుదల చేశారు. ఇడ్లీ ప్లేటు పది పైసలకన్నా ఎక్కువ అమ్మరాదు.దోశ పదిహేను పైసలు… పూరీ పదిహేను పైసలు… మసాలా దోశ ఇరవై పైసలు … ఇలా రేట్లు పెట్టారాయన.
ఒక ఫుల్ మీల్స్ రూపాయికే పెట్టాల … ప్లేటు మీల్స్ అర్ధ రూపాయికే పెట్టాల … ఇది జీవో సారాంశం …ఒక్కసారి హోటళ్లోళ్లు గగ్గోలు పెట్టారు. హోటళ్లు కిక్కిరిసిపోయేవి. జనం రామారావు భలే చేశాడని ఇళ్లళ్లో వంటలు మానేసి మరీ హోటళ్ల వాళ్లని తినేయడం మొదలెట్టారు.
నేను అప్పుడు కారణాంతరాల వల్ల ఒంగోలు పట్టణంలో రాజా పానగల్ రోడ్డులో ఉండేవాణ్ణి. రూమ్ లో వంట మానేసి స్టవ్వు గివ్వు తీసి పడేసి హోటళ్ల మీద దాడి చేయడంలో నిమగ్నమైపోయేవాడ్ని.ఇట్టా కొంత కాలం గడిచాక ….అప్పుడు హోటళ్ల వాళ్లందరూ బస్సులేసుకుని అబిడ్స్ ఎన్టీఆర్ ఇంటికి పోయి … వారి కాళ్ల మీద పడి అయ్యా … ఇది న్యాయమా … చచ్చిపోతామయ్యా అని బావురుమన్నారు.
అన్నగారు … విష్ణు మూర్తి లెవెల్లో అభయం ఇచ్చి … సర్లే మీకో చిన్న సవరణ చేస్తాను … అని … ఉదయం ఆరింటినుంచీ ఎనిమిదింటి వరకూ నా టైమ్ … అప్పుడు టిఫెన్ నా రేటుకే అమ్మాల … ఆ తర్వాత మీ టైమ్ … మీ ఇష్టమొచ్చిన రేటుకు అమ్ముకోండి …. అలాగే పన్నెండు గంటల నుంచీ రెండు గంటల వరకూ భోజనం నా రేటుకే అమ్మాల … రెండు తర్వాత మీ రేటుకు అమ్ముకోండి అని చెప్పి వారిని పంపేశారు.
అప్పుడు …. మా లాంటోళ్లం ఏం చేసేవాళ్లం అంటే .. ఒరే ఎన్టీఆర్ టైమ్ అయిపోతుంది పదండి టిఫెన్ చేసేసి వచ్చి పడుకుందాం … ఎన్టీఆర్ టైమ్ అయిపోతుంది పదండి భోం చేసి వచ్చేద్దాం అని తొందర తొందరగా తినేసి వచ్చేసేవాళ్లం. నిజానికి మొదట్లో ఆయన భోజనంలో వడ్డించే కూరలు ఎలా వండాలో కూడా ఒక ఫార్మెట్ పంపాడు హోటళ్ల వాళ్లకి అలా వండకపోతే హోటల్ సీజ్ చేస్తా అని బెదిరించాడు.
ఇలా కొంత కాలం అయ్యాక మళ్లీ వెళ్లి కాళ్లా వేళ్లా పడి ఆయన్ని ఒప్పించి ఆ జీవోని ఉపసంహరింపచేశారనుకోండి . అలాగే … రామారావుగారికి రాష్ట్రం మొత్తం మీద ఆరో ఏడో సినిమా హాళ్లు ఉండేవి … హైద్రాబాదులోనే మూడు హాళ్లు ఉన్నాయి. బెజవాడలో రెండు … తెనాలిలో ఒకటి ఉండేవనుకుంటా. అలాగే ఒకటి రెండు థియేటర్లలో ఆయన భాగస్వామ్యం ఉండేది.
అలాంటి సమయంలో … మేనేజర్లు తనకు సరిగా డబ్బులు పంపడం లేదని ఆయనకి అనుమానం ఉండేదనుకుంటా … అంటే అప్పట్లో ఏం జరిగేదంటే … ఒకే టిక్కెట్టు మీద పది మందిని లోపలికి పంపి థియేటర్లో ఉండే వంద మందికి పది టిక్కెట్లే తెంపి … వాటికే టాక్స్ కట్టేవారు. ఈ విషయం తెల్సిన అన్నగారు సిఎం అయినప్పుడు …స్లాబ్ సిస్టమ్ పెట్టడమే కాక టిక్కెట్ల రేట్లు తగ్గించమని కూడా ఆదేశాలు జారీ చేశారు.
సినిమా పరిశ్రమ నుంచీ ప్రతినిధి వర్గం ఆయన దగ్గరకు పోయింది. అందులో దాసరి నారాయణ రావు గారు కీలకం. ఏమిటి సమస్య అన్నారు దాసరిని ఉద్దేశించి ఎన్టీఆర్. అయ్యా ఎగ్జిబిటర్లు బావురుమంటున్నారు అన్నారు దాసరి … దాసరిగారూ … రాష్ట్రంలో నాకు ఆరు సినిమా హాళ్లు ఉన్నాయి. నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవరైనా ఉంటే వాడు బాధ పడుతుంటే వాణ్ణి పట్టుకురండి … వింటాను అని పంపేశారు.
అలా అన్నగారు పెట్టిన స్లాబు పద్దతి రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు తీసేశారు. ఆయన స్లాబు తీసేస్తూ … టిక్కెట్ల రేట్లు తగ్గిస్తూ జీవో ఇచ్చారు. డెబ్బై రూపాయలుగా ఉన్న బాల్కనీ రేట్ ను యాభై కి తగ్గించారు వైఎస్. ఎన్టీఆర్ కు చాలా సన్నిహితంగా ఉండే … ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు ఆర్ధికంగా అండగా నిల్చిన ఓ బెజవాడాయనకి … రెండు థియేటర్లు ఉండేవి … వాటిలో టిక్కెట్ల రేట్లు పక్క థియేటర్ల కంటే కాస్త పెంచి వసూలు చేస్తేనే అన్నగారు క్షమించలేదు. ఆయన్ని పిల్చి తగ్గించమని వార్నింగ్ ఇచ్చి మరీ తగ్గించేలా చేశారు.

