Garuda puranam …………………..
గరుడ పురాణం లోని పంచ ప్రేతాల కథ రెండో భాగం ఇది. శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుడుడికి చెప్పిన కథ..
బ్రాహ్మణోత్తమా! ఒకమారు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినపుడొక బ్రాహ్మణుని నియమించుకున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు. నేను ఆకలికి తాళలేక శ్రాద్ధ కర్మ చేయకుండానే ఆ శాకపాకాలను తినేశాను.
బ్రాహ్మణునికి పర్యుషిత అంటే పాచిపోయిన అన్నాన్ని ఎక్కడి నుండో తెప్పించి మరీ పెట్టాను. నేనిలా దుష్టప్రేతాన్ని కావడానికీ నా పేరు పర్యుషితుడు కావడానికి కూడా అదే కారణం.’ అంటూ ముగించింది మొదటి ప్రేతం.
బ్రాహ్మణ దేవతా! నా పేరు సూచీముఖుడు. ఒకనాడొక బ్రాహ్మణి తీర్థస్నానానికయి భద్రవట తీర్థానికి వచ్చింది. ఆమెతో ఆమె అయిదేళ్ళకొడుకున్నాడు. ఆమె అతనిని చూసుకునే జీవిస్తున్నట్లుంది. నేనప్పుడు క్షత్రియ యువకునిగా జన్మించి యున్నాను. అలవి మీరిన ఒళ్ళు పొగరు, క్రూరత్వాలతో ప్రజలను హింసిస్తుండేవాడిని.
నేనా బ్రాహ్మణీ, పుత్రుల దారికాచి అతని తలపై పిడికిలితో బాది వారి సామాన్లన్నిటినీ లాగేసుకున్నాను.ఆ పసివాడు దాహం దాహమని ఏడుస్తుంటే తల్లి అతనికొక చిన్న పాత్రతో నీళ్ళిచ్చింది. నేను పాత్రను దౌర్జన్యంగా లాగేసుకొని ఖాళీ చేసేశాను. విపరీత భయంతో … తీవ్ర దాహంతో ఆ పిల్లవాడు అక్కడే మరణించాడు. అతని తల్లి ఆ గర్భశోకాన్ని తట్టుకోలేక అక్కడే వున్న నూతిలో దూకి అసువులు బాసింది.
ఈ మహా పాపం వల్ల నాకీ ప్రేతయోని ప్రాప్తించింది. పర్వతాకార శరీరుడనే కాని నాకు నోరు లేదు. కొంగలాగ సూది ముక్కుంది. నాకు ఆహారం దొరికినా దానిని తినడానికి చాలాసేపు కష్టపడవలసి వస్తుంది. నేనా రోజు బ్రాహ్మణ బాలకుని నీరు తాగనివ్వకుండా చేసినందుకు ఇలా అనుభవిస్తున్నాను. నా ఈ నోరు కలిసిన ముక్కు నా పేరుని ‘సూచీముఖుడు’గా చేసింది. అంటూ ముగించింది రెండో ప్రేతం.
భూసురేంద్రా! నా పేరు శీఘ్రగుడు. నేనొకప్పుడొక ధనవంతుడనైన వైశ్యుడను. జన్మలో నా మిత్రుడొకనితో కలసి ఇతర దేశాలకు వ్యాపార నిమిత్తమై వెళ్ళాను. నేను కటిక పేదవానిని కాకపోయినా నా మిత్రుని వద్ద అశేష ధనరాశులుండడంతో నాలో లోభం, దాని వల్ల క్రౌర్యం పెరిగాయి. మేమిద్దరం వ్యాపారం చేసి వెనుకకు మరలి వస్తున్నపుడు దారిలో తగిలిన ఒక నదిని పడవ సహాయాన దాటుతుండగా సూర్యుడస్త మించాడు.
మసక చీకటిలో ప్రయాణీకులంతా ఎవరి గోలలో వారున్నారు.చాలామంది అలసట కారణంగా కునుకు పాట్లు పడుతున్నారు. వారిలో నా మిత్రుడు కూడా వున్నాడు. అతడు నా తొడ మీదే తలపెట్టి నిశ్చింతగా నిద్ర పోసాగాడు. నేనతనిని ప్రవాహంలోకి తోసేశాను. చీకటిలో ఎవరూ చూడలేదు.
అతని వద్దనున్న బహుమూల్య ప్రదాలైన రత్న జటిత స్వర్ణాభరణాలూ, ముత్యాలూ, బంగారు కాసులూ అన్నీ పట్టుకొని మా వూరొచ్చేశాను. దారి దోపిడీ దొంగలు మాపై దాడి చేయగా ఆమె భర్త దొరికిపోయాడనీ, వారతని సొత్తంతా దోచుకొని అతనిని చంపేశారని నామిత్రుని పత్నితో చెప్పేశాను.
నేను మరోదారంటా, తుప్పల వెంటా, నా సొమ్ముని పట్టుకొని పరుగెత్తి ఏదో చావు తప్పి కన్నులొట్టబోయిన చందన ఇల్లు చేరానని చెప్పాను. నాజీవితాన్నంతటినీ ఆ పాపపు సొమ్ముతోనే గడిపాను.శీఘ్రంగా డబ్బు సంపాదనలో ముందుకెళ్ళానని నన్ను ‘శీఘ్రగుడు’ అన్నారు కానీ ఆ పాపానికి, నాకిలా ప్రేతయోనిలో పుట్టుక వస్తుందని ఎవరూ ఎరుగరు కదా! అంటూ చెప్పింది మూడో ప్రేతం.
విప్రోత్తమా! నా పేరు రోధకుడు. నేను శూద్రజాతికి చెందినవాడను. రాజభవనం నుండి నాకు పెద్ద పెద్ద గ్రామాలొక వందపై అధికారం ఇవ్వబడింది. నా కుటుంబంలో వృద్ధులైన తల్లిదండ్రులు ఒక తమ్ముడు మాత్రమే ఉండేవారము. అయినా లోభం కొద్దీ నా తమ్ముడిని వేరే కాపురం పెట్టుకొమ్మని వెళ్ళగొట్టాను.వాడికేమీ లేదు.
అన్నవస్త్రాలు లేక అవస్థపడుతున్నాడని తెలిసి నా తల్లిదండ్రులు రహస్యంగా నా గృహం నుండి అన్ని వస్తువులనపంపిస్తుండేవారు. నేనిది విని అగ్గిరాముడినై పోయి నా తల్లిదండ్రులను సంకెళ్ళతో బంధించి ఒక గదిలో పడేశాను. వారు అతి కష్టం మీద తప్పించుకుని.. ఆత్మాభిమానం దెబ్బతిన్నదనే బాధతో విషం మింగి మరణించారు.
నా తమ్ముడు ఏమీ లేక ఎక్కడెక్కడో తిరుగుతూ ఏమైపోయాడో తెలియలేదు. వృద్ధులను బంధించాను కాబట్టి రోధకుడనే పేరు వచ్చింది. ఈ మహాపాపాల వల్ల నేనిలా ప్రేత యోనిలో పడి వున్నాను. అంటూ వివరించింది నాలుగో ప్రేతం.
విప్రదేవా! నన్ను లేఖకుడంటారు. పూర్వం ఉజ్జయినీ నగరంలో బ్రాహ్మణునిగా పుట్టాను. మారాజుగారు నన్నొక బ్రహ్మాండమైన కోవెలకు పూజారిగా నియమించారు. ఆ గుడిలో విభిన్న నామాలతో ఎన్నో విగ్రహాలున్నాయి. స్వర్ణ నిర్మితములైన ఆ విగ్రహాలలో అవసరమైన చోట పలు విలువైన రత్నాలు తాపడం చేయబడి వున్నాయి.
వాటిని రోజూ పూజిస్తూ పుణ్యాన్ని వెనకేసుకోవలసిన నేను లోభమోహాలచే రాకాసి మనసు గలవాడినై డబ్బు వెనకేసుకోవాలనే వాంఛ పుట్టి మహాపాపినై పోయాను.బుద్ధి పాపాసక్తమై పోతే బ్రాహ్మణుడైనా, పూజాధికారైనా ఒకటే, రాక్షసుడైనా పిశాచమైన ఒకటే. నేనొక సూదిగా వాడిగా నున్న ఇనుప ఆయుధాన్ని చేపట్టి ఆ విగ్రహాలకున్న బంగారాన్నీ రత్నాలనూ పెకలించివేసి దాచేసుకున్నాను.
మరునాడు ఎప్పటిలాగే కోవెల తెఱచి గోల గోల పెట్టేశాను, ఏమీ తెలియనివాడిలాగ. రాజుగారా రూపుమాసిన విగ్రహాలను చూసి క్రోధంతో రగిలిపోయారు. ఈ పని చేసిన దొంగను, దైవద్రోహిని, వాడు బ్రాహ్మణుడైనా సరే, పట్టుకొని నేరాన్ని నిరూపించి వానిని నా చేతులతోనే చిత్రవధ చేసి చంపేస్తాను.. అని దేవుని యెదుట ప్రతిజ్ఞ చేశారు.
ఆయన బ్రాహ్మణుడైనా సరే ; అనడంతో అనుమానమేదైనా నా మీద కలిగిందేమో అనే సందేహం నాకు కలిగి రాత్రికి రాత్రే రాజమందిరంలో ప్రవేశించి ప్రశాంతంగా నిద్రిస్తున్న రాజును చంపేసాను . అట్నుంచటే రత్నాలనూ బంగారాన్నీ పట్టుకొని పారిపోయాను.
దాంతో భూదేవికి కూడా నా మీద అసహ్యం కలిగిందేమో అలా పారిపోతూ దారి తప్పి ఘోరారణ్యంలో దిగబడి అక్కడొక పులివాత పడి చనిపోయాను.కలం వంటి సాధనంతో మహా పాపం చేశాను కాబట్టి నన్ను నరకంలో లేఖకుడని పిలిచారు. అక్కడ ఎనలేని బాధలూ అనుభవించి ఇలా ప్రేత యోనిలో పడ్డాను.
ఇలా అయిదు ప్రేతాలూ వినయంతో తమ పాపాలను వినిపించగా బ్రాహ్మణుడు. జాలిపడి వారి ప్రస్తుత పరిస్థితిని గూర్చి అడుగగా వారిలా చెప్పుకొని విలపించారు.
ఓ ద్విజేంద్రా! ఎక్కడ వేదమార్గం అనుసరింపబడుతుందో, ఎక్కడ లజ్జ, ధర్మం, దమం, క్షమ, ధృతి, జ్ఞానం వుంటాయో అక్కడ మేము ప్రవేశించలేము. శ్రాద్ధ, తర్పణ కర్మలు చేయబడని గృహాల్లో మేము దూరగలము. అక్కడి మనుషుల రక్తమాంసాలను వారికి తెలియకుండానే అపహరించి ఆరగిస్తాము.
వారు ఏ జబ్బూ లేకుండానే నీరసించి పోతుంటారు. మా ఆహారం పరమ అసహ్యకరం. మలం దగ్గర్నుండి శవం దాకా అన్నీ తింటాం. మాకే సిగ్గనిపిస్తుంది – అయినా తప్పదు. మేము అజ్ఞానులం, తామసులం, మందబుద్ధులం, ఏ మాత్రం దైవశక్తి అలికిడి విన్నా భయంతో పారిపోయే పిరికి జనాలం. మాకీ ప్రేతజన్మ ఎప్పుడు పూర్తవుతుందా అని చూస్తుంటాం.
బ్రాహ్మణుడు వారి బాధలను వింటుండగనే మహావిష్ణువు వారికి దర్శనమిచ్చాడు. ఆ బ్రాహ్మణుని మనసులోని కోరికనర్థం చేసుకొని వారందరికీ ఉత్తమలోకాలను ప్రసాదించాడు. అదండీ పంచప్రేతాల కథ.