The Forgotten Army……………
వాస్తవం గా జరిగిన ఘటనలకు కొంత డ్రామా జోడించి ఈ ‘ఫర్గాటెన్ ఆర్మీ’ సిరీస్ ను అద్భుతంగా తెరపై కెక్కించారు. రెండో ప్రపంచ యుద్ధం(1942) జరిగే సమయంలో బ్రిటిష్ ఆర్మీ లో పనిచేసిన భారత సైనికులు సింగపూర్ లో జపాన్ కి లొంగి పోతారు.
తర్వాత జపాన్ అనుమతితో నేతాజీ సారధ్యంలో భారత్ స్వాతంత్య సమరంలో పాల్గొనేందుకు చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతారు.అందులో భాగంగా సింగపూర్ నుంచి బయలు దేరుతారు. బర్మా అడవులు గుండా వీరి ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణంలో నాడు సైనికులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో కళ్ళకు కట్టినట్టు దర్శకుడు కబీర్ ఖాన్ చిత్రీకరించారు.
ఈ సైనికులనే ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతదేశం బ్రిటీష్ వలస పాలనలో ఉంది కనుక శత్రువుకు శత్రువు మిత్రుడన్న ప్రాతిపదికన జపనీయులు భారతీయులకు మద్దతు ఇచ్చారు.ఇలాంటి బృహత్ కార్యక్రమానికి తగినవాడని భావించి నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సారధ్యాన్ని అప్పగించారు.
సుభాష్ చంద్రబోస్ ఈ సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించాడు. అలానే విదేశంలో భారత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి (దాని పేరే అజాద్ హింద్ ప్రభుత్వం) భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు… ఇక దానికి వాస్తవ రూపానికి తీసుకురావాలన్నట్టు పిలుపు నిస్తాడు.
1944-45 సమయంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ దళాలు, జపనీస్ దళాలతో కలసి బర్మా నుంచి ఇంఫాల్ మీదుగా భారత్ లో అడుగు పెట్టడానికి బ్రిటిష్ సైన్యం తో పోరాడాయి. ఈ పోరాటాన్ని మొత్తం కబీర్ ఖాన్ ఆసక్తి కరంగా తెరపై ఎక్కించారు.
సైన్యంలో చేరిన మహిళా జర్నలిస్టు మాయా కు … కెప్టెన్ సురేందర్ సోధీ కి మధ్య చిన్న లవ్ స్టోరీ పెట్టారు. సోధీ గా సన్నీ కౌశల్ … మాయా గా శర్వారి వాగ్ ఆ పాత్రల్లో జీవించారు. సోధీ జీవిత ఖైదీగా శిక్ష అనుభవించి మరల బర్మా అడవుల్లో కెళతాడు. కథ అక్కడక్కడా ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తుంది. ఎక్కడా బోర్ ఫీలవకుండా ప్రేక్షకులు కథలో లీనం అవుతారు.
యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా తీశారు. ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ తో సిరీస్ భాగాలు నడుస్తాయి. కెమెరా పనితనం సుపర్బ్ … బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సీరియస్ ఆడియన్స్ కు ఇది బాగా నచ్చుతుంది. ఇండియా కు స్వాతంత్య్రం లభించిన అనంతరం ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులను పట్టించుకున్నవారు లేరు.
వారికి ఎలాంటి గుర్తింపు, ఆదరణ లభించలేదు. ఏ ఒక్క ఆజాద్ హింద్ సైనికుడిని కూడా భారత సైన్యంలో కి తీసుకోలేదు.పెన్షన్ సదుపాయాలు ఇవ్వలేదు.దర్శకుడు కబీర్ ఖాన్ ఈ సిరీస్ ను మూడేళ్ళ పాటు షూట్ చేశారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా ఉంది. ఆసక్తి గల వారు చూడవచ్చు.