డా. పుల్లూరి సంపత్ రావు…………………………….. migrants
బ్లెస్సీ మలయాళంలో అత్యుత్తమ సినిమాలు చేస్తారనే పేరున్న దర్శకులు. కాజ్బా, తన్మాత్రా, భ్రమరం వంటి సినిమాలకు దర్శకత్వం వహించి అవార్డులు గెలుచుకున్నారు. రచయిత ‘బెన్యామెన్’ రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా వారు గోట్ లైఫ్ సినిమాను తెరకెక్కించారు.
‘ఆడు జీవితం’ పేరుతో రాసిన ఈ కథ కేరళ నుంచి సౌదీ ఆరేబియాకు వలస వెళ్ళిన నజీబ్ మహమ్మద్ నిజ జీవిత కథ. ఈ నవల మలయాళంలో 2008 లో వచ్చింది. అనేక పురష్కారాలు పొందింది. వందసార్లకు పైగా పునర్ముద్రించారు. కేరళలో దీన్ని పదవ తరగతిలోనూ మరికొన్ని విశ్వవిద్యాలయాలలోనూ పాఠ్యాంశంగా పెట్టారు. తర్వాత అరబిక్, నేపాలీ, థాయి, ఒడియా, తమిళ భాషలలోకి అనువాదం అయింది. హిందీ, కన్నడ భాషలలోకి రాబోతున్నది. అయితే దీన్ని ఎమిరేట్స్ మినహా మిగతా గల్ఫ్ దేశాలలో నిషేదించారు.
కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు వలసవెళ్లడం అనాదిగా వస్తున్నదే. గతంలోనూ గధమా(2011), పత్తేమారి (2015), టేక్ ఆఫ్(2017) వంటి గల్ఫ్ నేపథ్యం గల అనేక మలయాళ సినిమాలు వచ్చాయి. నిజానికి చాలా మలయాళ సినిమాలలో ఏదో ఒక గల్ఫ్ పాత్ర కనిపిస్తుంటుంది. ఎందుకంటే కేరళలో వలస జీవి లేని కుటుంబాలు అరుదు. మనదేశంలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఒక్క కేరళలోనే ఉన్నాయి. గాలిలో ఎగురుతున్న ప్రతి విమానంలో ఒక మలయాళీ ఉంటాడని అంటారు.
సామాజిక మాద్యమాలలో ఈ సినిమా గురించి బోల్డంత సమాచారం లభిస్తున్నది. సాధారణ మలయాళ సినిమాల కంటే దీనికి ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నారు. 2008 నుంచి సినిమా గురించిన చర్చలు జరిపి 2018-2022 మద్య షూటింగ్ పూర్తి చేసుకుందని, షూటింగ్ కోసం గొర్రెలను, ఒంటెలను కొన్నారని, అయితే నిబంధనలు అనుమతించక వాటిని ఇండియాకు తేలేక జోర్డాన్, సహారా, అల్జీరియా వంటి ప్రాంతాలలోనూ మరికొన్ని సన్నివేశాలను ఇండియాలోని కేరళ, రాజస్థాన్ లొకేషన్లలోనూ చిత్రీకరించారు.
కోవిడ్ కాలంలో అరేబియాలో చిక్కుకుని ప్రభుత్వ సహాయంతో ఇండియాకు తిరిగి వచ్చారని, నజీబ్ పాత్ర కోసం హీరో 30 కిలోల బరువు తగ్గ వలసి వచ్చిందని, ఈ సినిమా ‘లైఫ్ ఆఫ్ పై’, ‘కాస్ట్ అవే’ చిత్రాల వంటిదని, ఈ సినిమాను కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి వారు ఆకాశానికి ఎత్తేశారని చెప్తున్నారు.
కథ సాధారణమే. గల్ఫ్ ఏజెంట్ల మాటలునమ్మి మోసపోయి అరేబియా ఎడారిలో నిర్భందం మద్య గొర్రెలకాపరిగా అనేక కష్టాలు పడుతూ నాలుగేళ్ల పాటు నరకయాతన అనుభవించిన అభాగ్యుని కథ. సినిమా అంతా ఎడారిలో మూడునాలుగు పాత్రల మద్య జరుగుతుంది.
సాధారణంగానే వలస జీవితాలది జీవన్మరణ సమస్య. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా గల్ఫ్ లో లక్షల సంఖ్యలో ఉన్నారు. కరీంనగర్-నిజామాబాద్, కడప-అనంతపురం, శ్రీకాకుళం-విజయనగరం జిల్లాలనుంచి పురుషులు, చిత్తూరు -గోదావరి జిల్లాల నుంచి మహిళలు ఎక్కువ సంఖ్యలో గల్ఫ్ లో ఉన్నారు. గల్ఫ్ జీవితాలను తెలుగు సాహిత్యంలో బాగానే చిత్రించారు.
పెద్దింటి అశోక్ కుమార్, బి. ఎస్. రాములు, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి వంటి వారు కొన్ని కథలు రాశారు. మహిళా వలసల గురించి చక్ర వేణు రాసిన ‘కువైట్ సావిత్రమ్మ’ పద్మావతి పూజ రాసిన ‘నా కథ’ నవలలు ఇలాంటి జీవితాలను చిత్రించాయి.
‘రంగుల ఊబి గల్ఫ్’ అనే శీర్షికతో ఒక దినపత్రిక ఆదివారం అనుబంధ కథనం నన్ను వలసలపై అధ్యయనానికి పురికొల్పింది. ఉస్మానియాలో ప్రొఫెసర్ కర్లి శ్రీనివాసులు పర్యవేక్షణలో వలసల ప్రభావంపై పీహెచ్డీ చేశాను. తర్వాత అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఈ విషయాలపై కలిసి పనిచేశాను. ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం, కేంద్ర కార్మిక శాఖ సంయుక్తంగా చేసిన ‘మైగ్రేషన్ ఆఫ్ వుమెన్ వర్కర్స్ ఫ్రం సౌత్ ఏషియా టు ద గల్ఫ్’ అనే ప్రాజెక్ట్ లో భాగం పంచుకున్నాను.
నా పీహెచ్డీ పరిశోధనలో భాగంగా క్షేత్ర పర్యటనలకు వెళ్ళినపుడు గోట్ లైఫ్ సినిమాలో వలెనే అనేక విషాదభరిత గాధలను విన్నాను. కొన్నింటిని చదివాను. రావులపాలానికి చెందిన లక్ష్మీ అనే మహిళ ఒమన్ కు పనికి వెళ్ళింది. ఇంటి యజమానురాలు, భర్త బయటికి వెళ్ళిన సమయంలో మరో పురుషునితో ఉన్నపుడు లక్ష్మీ చూసిన కారణంగా యజమానురాలు తన స్వంత పాపను నీటి తొట్టిలో లక్ష్మితో బలవంతంగా వేయించి చంపి పోలీసులకు చెప్పి ఆ నేరాన్ని లక్ష్మిపై మోపింది.
ఫలితంగా లక్ష్మికి ఉరిశిక్ష విధించారు. లక్ష్మి కాళ్లా వెళ్ళా పడితే యజమానురాలు దయతలిచి ఆ శిక్షను 25 సంవత్సరాల కారాగార శిక్షకు మార్చారు.కరీంనగర్ జిల్లాలో చందుర్తి మండలంలో గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వారితో మాట్లాడటానికి వెళ్ళినపుడు. మమ్మల్ని గమనిస్తూ, నవ్వుతూ మమ్మల్ని అనుసరిస్తూ ఉన్న ఒకాయన గురించి స్థానికులను అడిగితే, అతను కూడా గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాడని, మతిస్థిమితం కోల్పోయాడని చెప్పారు.
నిజామాబాద్ సరిహద్దు గ్రామంలో గల్ఫ్ నుంచి తిరిగి వచ్చి బాగుపడ్డాడని చెప్తే ఒకాయన దగ్గరకు వెళ్ళాము. ఆయన తన కొత్త ఇంటిని చూపించారు. ‘ఎలా ఉన్నారని’ అడిగితే దిక్కులు చూస్తున్నారు. కళ్ళలో నుంచి నీళ్ళు కారడాన్ని అపలేకపోయారు. కొంచెం తేరుకుని ‘భూమి కొన్నాను, ఇల్లు కట్టుకున్నాను గానీ వీటికోసం ఇరవై ఏండ్ల జీవితాన్ని కోల్పోయాను, కనీసం నా పిల్లలు ఎలా పెరిగారో కూడా నాకు తెలియదు’ అన్నారు.
సెల్ ఫోన్లు వచ్చాక పరిస్థితి మారిందిగాని అంతకుముందు వలసజీవులకు ఇంటితో సంబంధం ఉండేది కాదు. ఉత్తరాలు రాసుకునేవారు. ఆ తర్వాత కాలంలో టేప్ రికార్డర్ లో మాటలు రికార్డ్ చేసి ఎవరైనా ఇంటికి వచ్చినపుడు వాళ్ళతో క్యాసెట్ పంపేవారు. భీవండి, షోలాపూర్ వంటి ప్రదేశాలకు వెళ్ళేవారి వ్యధలు కూడా వర్ణనాతీతం.
గల్ఫ్ నుంచి మనిషి తిరిగి రావాలంటే ఎంతో అదృష్టం కావాలి. కొన్నిసార్లు శవాలు తిరిగి వస్తాయి.
దురదృష్టవంతులైతే శవాలు కూడా రావు. గల్ఫ్ వలస కుటుంబాలకు మంత్రులను, రాయబార కార్యాలయాలను సంప్రదించే స్థోమత ఉండదు. వలస జీవుల శవాలను స్వంత గ్రామాలకు తెప్పించడానికి కృషి చేస్తున్న సంస్థలు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో మంద భీమ్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల, జిలకర మురళి వంటివారు ఇలాంటి గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా దిండిరామరాజులంక గ్రామానికి చెందిన నల్లి మేరీ ఒమన్ లో చనిపోతే సమాచారలోపం కారణంగా శవాన్ని ఇండియా పంపలేక అక్కడే పూడ్చేశారు. ‘పత్తేమారి’ అనే మలయాళ సినిమాలో గల్ఫ్ నుంచి ఆంబులెన్స్ లో శవం వచ్చే ప్రతిసారీ గుండెలు బాదుకుంటూ బేల చూపులు చూసే ఒక మతిస్థిమితం లేని పాత్ర ఉంటుంది. శవపేటికల చెక్కలను ఇంటితలుపులుగా వాడుకున్న ఘటనలు మీడియాలో నమోదయ్యాయి.
ఫీల్డ్ విజిట్స్ లో నాతోపాటు ఆదేశ్ రవి ఉండేవాడు. కరోనా సమయంలో వలసజీవుల వ్యధలను ‘పిల్ల జెల్లా’ పాటగా రాసి, పాడి దృశ్యమానం చేశాడు. ఈ మద్య కందుకూరి రమేష్ బాబు తెలంగాణపై అనేక రచనలు చేశారు. ఆ క్రమంలో తెలంగాణా వలసల నేపథ్యం గురించి ‘బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి’ పద బంధం గురించి మాట్లాడుకున్నాం.
***
పృథ్వీరాజ్ సుకుమారన్ శ్రమ ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. యువనటుడు గోకుల్ గుర్తుండిపోయే హకీం పాత్రలో నటించారు. హైతీ నటుడు జిమ్మీ జీన్ లూయిస్, ఇబ్రహీం ఖాద్రి పాత్ర చేయడంతో పాటు ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉన్నారు. సంగీత దర్శకులు ఏ. ఆర్. రహమాన్, సౌండ్ డిజైనర్ & ఆడియోగ్రఫీ చేసిన రసూల్ పూకుట్టి ఇద్దరూ ఆస్కార్ విజేతలు ఈ సినిమాకు పని చేశారు.
ఎడారి దృశ్యాలు, నీటిలోపల దృశ్యాలను చిత్రీకరించడంలో సునిల్ కె. ఎస్. కెమెరా పనితనం కనిపించింది. సన్నివేశాలను పెనవేయటంలో ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ ప్రతిభ కనపరిచారు గానీ అక్కడక్కడా సన్నివేశాల సాగదీతను అరికట్టలేకపోయారు. ఎనబైల నాటి దుస్తులను రూపొందించిన కాస్ట్యూమ్ డిజైనర్ స్టెఫీ జేవియర్ చాలా శ్రమ పడ్డట్టుగానే ఉంది.
ఆమె 2016 లో ‘గుప్పి’ అనే సినిమాకు కేరళ రాష్ట ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డ్ గెలుచుకున్నారు. ఇంతమంది నిపుణులు పనిచేసిన గోట్ లైఫ్ కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండవచ్చు.
అయితే సగటు తెలుగు ప్రేక్షకుడు ఈ సినిమాను చూడటం కష్టం. ఎంతమంచి నిపుణులు పనిచేసినా, ఇతర భావోద్వేగ సన్నివేశాలు ఏవీ లేకుండా 173 నిమిషాల విషాదాన్నిఏకబిగిన తెరపై భరించాలంటే సినిమా నిర్మాణంపై అవ్యాజ్యమైన ప్రేమో లేదా పిచ్చో ఉండాలి.
వర్షం తర్వాత గొర్రె నీటిని విదిల్చినపుడు వచ్చే శబ్ధాలను, నాలుగేళ్ల తర్వాత తన భార్య గొంతును ల్యాండ్ లైన్ ఫోనులో వింటున్నపుడు వచ్చే తన పాప ఏడుపును గ్రహించే ఓపిక ఎంతమందికి ఉంటుంది?
తెలుగు టైటిల్స్ టైప్ చేయడంలో నిర్లక్ష్యం వహించారు. నజీబ్ పాత్రధారిది తెలంగాణా అని చెప్పడం, హకీం పాత్రధారిది మొగల్తూరు అని చెప్తడం ఇద్దరూ ఒకేచోట రైలులో కలుసుకోవడం వంటివి అనువాదం కాబట్టి విస్మరించదగినవే అయినా కొంచెం సింక్ కాని విషయాలు. గోట్ లైఫ్ 2024 మార్చి 28 విడుదల అయింది.