Walks with the aim of conserving rivers……
పై ఫొటోలో కనిపించే మహిళ పేరు షిప్రా పాఠక్… ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన షిప్రా కు నదులు అంటే ఇష్టం. వాటి పరిరక్షణ అంటే ప్రాణం. నదుల వెంబడి ఉన్న ప్రాంతాలలో నివసించే ప్రజలను కాలుష్యం నుండి రక్షించడం .. నదుల ఆక్రమణల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాదయాత్రలు చేస్తుంటుంది.
బుదౌన్ జిల్లాకు చెందిన షిప్రా ఉన్నత చదువులు చదివింది. ముప్పై ఏళ్ళ షిప్రా నదుల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ‘నదులకు ఏమైతే మనకేమిటి? మనం హాయిగానే ఉన్నాం కదా అనే భావన నుంచి ప్రజలు బయటికి రావాలి. నదుల మనుగడలోనే మనుషుల మనుగడ ఉంది. ప్రకృతి వనరులే మన శక్తులు. నదులకు ముప్పు వాటిల్లితే మన కుటుంబ పెద్దలకు ముప్పు వాటిల్లినట్లుగా భావించి తక్షణ చర్యలపై దృష్టి పెట్టాలి.
మనిషికి రక్తం ఎంత అవసరమో నది ఆరోగ్యానికి కలుషితం కాని నీరు అంతే అవసరం’ అనే మాటలు చెబుతుంది. గతంలో నర్మద నది సంరక్షణ కోసం 3600 కిలోమీటర్ల యాత్ర చేసి రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న పుణ్యనది గోమతి సంరక్షణ కోసం వెయ్యిన్నొక్క కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఈ యాత్ర 2023లో ముగిసింది.
సన్నని ప్రవాహం గా బయలుదేరే గోమతి ప్రయాణంలో బలపడుతుంది. ‘ప్రయాణం గొప్పతనం బలం’ అని ఆ నది మౌనంగానే చెబుతుంది. అందుకేనేమో ‘గోమతి నదిని రక్షించుకుందాం’ నినాదానికి బలం ఇవ్వడానికి షిప్రా ఆ నది ఒడ్డున పాదయాత్ర చేసింది. పారిశ్రామిక వ్యర్థాలు, నివాసాలలో నుంచి వచ్చే మురుగు నీరు… మొదలైన వాటి వల్ల గోమతి అనేక ప్రాంతాలలో కలుషితం అవుతుంది.
మురుగునీటి శుద్ధి కర్మాగారాల వల్ల కూడా పెద్దగా ప్రయోజనం వనగూరడం లేదు. ఇవన్నీ గమనించి ‘ఎవరో వస్తారని… ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన నదిని మనమే రక్షించుకుందాం’ అంటూ పాదయాత్ర చేసింది. ప్రజల్లో చైతన్యం తెచ్చింది. పంచతత్వ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన షిప్రా పాఠక్ ‘వాటర్ ఉమన్’గా పేరు తెచ్చుకుంది.
‘గోమతి నదిని రక్షించుకుందాం’ నినాదంతో పదిహేను జిల్లాలలో ఊళ్లు, పల్లెలు, పట్టణాల గుండా సాగిన పాదయాత్రలో ఆ పుణ్యనది ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి ప్రజలకు తెలియజేయడంలో విజయం సాధించింది. ప్రతిరోజు 30 నుంచి 35 కిలోమీటర్‌ల వరకు పాదయాత్ర చేసింది. ‘నది ఒడ్డున మొక్కలు నాటుదాం’ అని ప్రజలతో ప్రమాణం చేయించింది.
ఆమె వెంట ప్రజలు వచ్చేవాళ్లు. పర్యావరణ సంబంధిత విషయాలను చర్చిస్తూ ఆమె పాదయాత్ర ముందుకు సాగేది. ‘ఆక్రమణలను అడ్డుకుందాం. పుణ్యనదిని కాపాడుకుందాం’ అనే నినాదంతో ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, అధికారులతో మాట్లాడేది. ఈ పాదయాత్రలో పాల్గొన్న వందలాది మంది ప్రజలు మొక్కలు నాటడాన్ని ఒక ఉద్యమంలా చేసుకున్నారు.అదో గొప్ప విషయం.
‘ఏదో ఒక ఉద్యోగం చేయడం కంటే నదుల పరిరక్షణకు నా వంతుగా ఏదైనా చేస్తాను’ అంటూ ప్రయాణం మొదలు పెట్టింది. ఆ ప్రయాణం వృథా పోలేదని ఎన్నో ఊళ్లలో వచ్చిన మార్పు తెలియజేస్తుంది. ప్రస్తుతం షిప్రా పాఠక్ అయోధ్య నుంచి రామేశ్వరానికి పాదయాత్ర చేసున్నారు. 2024 ఏప్రిల్ చివరి నాటికి ఆమె రామేశ్వరం చేరుకోవచ్చు. ఈ పాదయాత్రలో రాముడు సంచరించిన అన్ని ప్రదేశాలను షిప్రా కవర్ చేయనున్నారు. నదుల పరిరక్షణ సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ తన నడకను సాగిస్తున్నారు.