రాహుల్ పట్ల ఇండియా కూటమి లో వ్యతిరేకత !!

Sharing is Caring...

Polytrix …………….. 

‘దళిత ప్రధాని’ అంశాన్ని లేవనెత్తి  తద్వారా వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీని సైడ్  చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సోనియా కుటుంబానికి నిజంగా షాకే.   రాహుల్ గాంధీ తమ ప్రధాని అభ్యర్థి కాదని, రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా తాము ఒప్పుకోవడం లేదని పరోక్షంగా india  కూటమి తేల్చేసింది.

రాహుల్ గాంధీని భావిభారత ప్రధానిగా ఊహించుకుంటున్న సోనియా గాంధీకే కాదు, దేశవ్యాప్త కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఇది మింగుడుపడని వ్యవహారం. కుటుంబ వారసత్వ రాజకీయాల విమర్శల నుంచి తప్పించుకోవడం కోసం కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ వదులుకోవడమే చేటు చేసిందా అన్న అంతర్మథనం ఇప్పుడు పార్టీ లో మొదలైంది.

తమ చెప్పుచేతల్లో ఉంటాడనుకుని మల్లికార్జున ఖర్గేను ఏరికోరి తీసుకొచ్చి అధ్యక్ష బాధ్యతల్లో కూర్చోబెడితే ఏకంగా ప్రధాని పీఠంపైనే కన్నేసి తెరవెనుక మంత్రాంగం నడిపారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.

స్వతంత్ర భారత మొట్టమొటది ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వరకు వరుసగా నెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వ రాజకీయాలు కొనసాగాయి. ఆ తర్వాత సోనియా గాంధీ పార్టీ సారథ్య బాధ్యతలను సుదీర్ఘకాలం పాటు నిర్వహించినప్పటికీ.. ప్రధాని పీఠంపై కూర్చోలేదు.

అప్పట్లో   ‘విదేశీ మహిళ’ అన్న ఆరోపణల కారణంగా సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. అయితే పదేళ్ల యూపీఏ పాలనలో పేరుకే మన్మోహన్ సింగ్ ప్రధాని కానీ పెత్తనం మొత్తం సోనియాదే అన్న విమర్శలూ లేకపోలేదు.

వాటి సంగతెలా ఉన్నా సోనియా గాంధీ వదులుకున్న పీఠాన్ని రాహుల్ గాంధీకి కట్టబెట్టాల్సిందే అన్న పట్టుదల పార్టీ నేతల్లో, శ్రేణుల్లో కనిపిస్తుంది. తదుపరి ఎన్నికల్లో గెలుస్తారా లేదా అన్న ప్రశ్న కంటే ముందే రాహుల్ గాంధీకి ప్రధాని పీఠాన్ని దూరం చేసే ప్రయత్నాలు మొదలైనట్టు INDIA కూటమి 4వ సమావేశం తేటతెల్లం చేస్తోంది.

 I.N.D.I.A  కూటమిలోని కాంగ్రెసేతర రాజకీయ పార్టీలు  అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాయి. రెండు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నా.. రాజకీయ పరిణితిని ప్రదర్శించలేకపోతున్నారన్న విమర్శలు రాహుల్ గాంధీపై ఉన్నాయి. రాహుల్ గాంధీ నాన్-సీరియస్ పొలిటీషియన్ అంటూ స్వపక్షంలోనే విమర్శలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఇలాంటి ఎన్ని అభ్యంతరాలున్నా.. ఇన్నాళ్లుగా మరో ప్రత్యామ్నాయం చూపలేకపోవడంతో మిన్నకుండిపోయారు.

మమత బెనర్జీ, శరద్ పవార్, నితీశ్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు అడపా దడపా ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నామంటూ ప్రకటనలు చేశారు .. వీళ్లలో ఏ ఒక్కరినీ మిగతా అందరూ అంగీకరించే పరిస్థితి లేదు. పైగా వీళ్ల పార్టీలకు ఒకట్రెండు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా పట్టు, ఆదరణ లేవు.

ఈ పరిస్థితుల్లో కూటమిలో పెద్దన్నగా మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మూలాలు కల్గిన కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రధాని అభ్యర్థిని అంగీకరించక తప్పని స్థితి నెలకొంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన  కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా రాహుల్ స్థానంలో మల్లికార్జున ఖర్గేను తెరపైకి తీసుకొచ్చాయి.

కొందరు కాంగ్రెస్ నేతలు మమత బెనర్జీ కేవలం ‘దళిత ప్రధాని’ అని మాత్రమే సూచించారు తప్ప ‘ఖర్గే’ పేరును నేరుగా ప్రతిపాదించలేదని చెబుతున్నా.. కూటమి సమావేశం అనంతరం పలువురు నేతలు మరోలా స్పందించారు.  మొత్తంగా మాకు “రాహుల్ వద్దు – ఖర్గేయే ముద్దు” అని విపక్ష కూటమిలో మెజారిటీ అభిప్రాయంగా ఇప్పుడు చలామణి అవుతోంది. ఈ పరిణామాలను కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఇవన్నీ బీజేపీ కి అనుకూలమవుతాయి. 

.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!