Subramanyam Dogiparthi ……………………….
‘దేవాలయం’ సినిమా అప్పట్లో ప్రేక్షకులకు బాగా నచ్చింది. శోభన్ నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన సినిమా ఇది. నాస్తికుడిగా , దురాచారాలను హేతుబధ్ధత లేని దుస్సాంప్రదాయాలను ప్రతిఘటించే వ్యక్తిగా , మానవత్వమే ఆస్తికత్వం అని వివరించే సామాజిక సంస్కర్తగా శోభన్ బాబు అద్భుతంగా నటించారు.
ఏ నటుడు అయినా, నటి అయినా తమ ప్రతిభను చూపేందుకు సరైన పాత్ర రావాలి . అలాంటి పాత్రే శంకరం పాత్ర ఈ సినిమాలో. విప్లవ ఆస్తికత్వ చిత్రం ఈ దేవాలయం. ఈ సినిమా కధను మోదుకూరి జాన్సన్ వ్రాసారు .. గుర్రం జాషువా గారి శిష్యుడిగా గురువునే మించి ఈ సినిమా లోని సన్నివేశాలను , పాత్రలను సృష్టించారు . శ్మశానాన్నే కళ్యాణ వేదికను చేసారు.
అంతే పదునుగా సంభాషణలను వ్రాసారు మోదుకూరి జాన్సన్ , యం వి యస్ హరనాధరావులు . ఇలాంటి అత్యంత సున్నితమైన కధాంశం గల సినిమాకు మాటలు వ్రాయడమంటే కత్తి మీద సామే . ఎందరో మనోభావాలతో ముడిపడి ఉండే వ్యవహారం . త్రాసులో తూకం తూచి వేసినట్లు పడ్డాయి మాటలు . హేతుబధ్ధతను విడవకుండా ఆస్తికత్వాన్ని చాలా ఎఫెక్టివ్ గా ఆవిష్కరించారు. తెరవెనుక నటుడు ,రచయిత పి ఎల్ నారాయణ పర్యవేక్షణ కూడా ఉంది.
ఈ విప్లవాత్మక ప్రయత్నానికి సారధి , విజయసారధి టి కృష్ణ . ఒక్కోసారి నాకు అనిపిస్తుంది . విజయశాంతి కోసమే ఈయన పుట్టాడా అనిపిస్తుంది . కేవలం 36 సంవత్సరాలు మాత్రమే జీవించిన ఈ కళాకారుడు ఏడు తెలుగు సినిమాలకు దర్శకత్వం వహిస్తే ఆరింటిలో విజయశాంతే కధానాయిక . ఆరూ హిట్లు , సూపర్ హిట్లు , బ్లాక్ బస్టర్లు . సావిత్రి , వాణిశ్రీల తర్వాత అంతకన్నా ఎక్కువ స్టార్డంని , పారితోషకాన్ని డిమాండ్ చేసే స్థాయికి ఆమెను తీర్చిదిద్దిన వ్యక్తి టి కృష్ణ .
ఈ సినిమాలో విజయశాంతికి లభించిన పాత్ర అద్భుతమైన పాత్ర . బాధ్యత కల స్త్రీగా , మిత్రుడు శంకరానికి తోడుగా, చాలా బాగా నటించింది. ముఖ్యంగా నృత్య సన్నివేశాలలో ప్రేక్షకులు మరచిపోలేని ప్రతిభను ప్రదర్శించింది . ఈ ఇద్దరి పాత్రల తర్వాత మరో గొప్ప పాత్ర భగవాన్ దాసు పాత్ర . ఈ పాత్రలో పి యల్ నారాయణ కూడా నట తాండవం చేసాడు .
దేవాలయం ధర్మకర్తగా ఎన్ని అఘాయిత్యాలు చేయాలో అన్నింటినీ చేస్తాడు ఈ సినిమాలో ట్రస్టీ రావు గోపాలరావు.హీరో శోభన్ బాబు కాబట్టి ఆయనకు ధీటుగా విలన్ పాత్రకు రావుగోపాలరావును పెట్టారు. గుడి మాన్యాల దగ్గర నుండి కొబ్బరి చిప్పల దాకా , అనాధ పిల్లలకు అన్నం పెట్టకుండా పస్తులతో అలమటించేలా హింసించే నరరూప రాక్షసుడిగా రావు గోపాలరావు జీవించాడు.
ఈ నాలుగు పాత్రల తర్వాత చాలా గొప్ప పాత్ర దేవదాసి కళావతి పాత్ర.బహుశా కన్నడ నటి అనుకుంటా. పేరు శశికళ. అందంగా ఉంది , బాగా నటించింది . నీలాగా నీతి లేని దాన్ని కాను అని ఎండోమెంట్ ఆఫీసరుతో చెప్పే గొప్ప పాత్ర ఇది . తర్వాత చెప్పుకోవలసిన పాత్ర పూజారి పాత్ర . సోమయాజులు కి ఈ పాత్ర కొట్టిన పిండి.
బాపు గారి బుధ్ధిమంతుడు సినిమాలో మాధవాచార్యులు లాగా నిరంతరం దేవుడి సేవే . ఆస్తికత్వం మీద , ఆచార సాంప్రదాయాల మీద అపారమైన గౌరవం , విశ్వాసం కల పాత్ర . సోమయాజులు జీవించారు . ఆయన భార్యగా భర్త కొడుకు మధ్య నలిగిపోయే స్త్రీమూర్తిగా అన్నపూర్ణ చాలా గొప్పగా నటించారు .
ధర్మకర్తకు చెంచాలుగా ఎండోమెంట్ ఆఫీసర్ పాత్రలో హరనాధరావు , బిచ్చగాళ్ల దగ్గర కూడా అప్పులు చేసే అర్భకుడిగా సుత్తి వేలు , విలన్ భార్యగా అత్తిలి లక్ష్మి , బిచ్చగాళ్ల ప్రెసిడెంటుగా నర్రా వెంకటేశ్వరరావులు నటించారు. పాత్రల పరిధుల మేరకు అందరూ బాగా చేశారు.
ఈ సినిమా అఖండ విజయానికి ముఖ్యులు సంగీత దర్శకుడు చక్రవర్తి , పాటల్ని వ్రాసిన గొప్ప రచయితలు వేటూరి , సి నారాయణరెడ్డి , వంగపండు , అదృష్ట దీపక్ లు. వాటిని ఎంతో శ్రావ్యంగా పాడిన బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మలు. మొట్టమొదటగా చెప్పుకోవలసింది దశావతారాల మీద పాట . జీవన పరిణామ క్రమాన్ని శాస్త్రీయంగా చెప్పే ప్రయత్నమే ఈ పాట.
విజయశాంతి,శోభన్ బాబులు అద్భుతంగా నృత్యించారు . విజయశాంతికి చక్కటి నృత్యాన్ని ప్రదర్శించేందుకు అవకాశం కల్పించిన పాట ‘నమో నాగాభరణా’ పాట సినిమా ప్రారంభంలోనే వస్తుంది . ఈ సినిమాకు ఒక విధంగా ఐకాన్ పాట ‘దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం ‘ పాట. వేటూరి మాస్టారు వ్రాసిన ఈ పాట అప్పట్లో సూపర్ హిట్ సాంగ్.
ఆ పాట చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉంటుంది. రవికాంత్ నగాయిచ్ కెమెరా పనితనం ఆ పాటలో కనపడుతుంది. దర్శకుడి ఆలోచనలకు తగిన రీతిలో రవికాంత్ చిత్రీకరణ సాగింది. హే స్మరాంతక పాట కూడా అద్భుతంగా ఉంటుంది. పి యల్ నారాయణ విజృభించి నటించాడు. ఈ పాటలోనే శోభన్ పై తీసిన షాట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
అలాగే విజయశాంతి నృత్యించటానికి అవకాశం కల్పించిన డ్యూయెట్ ‘హృదయాలయాన తొలిసారి వెలిశాడు దైవం’ అనే శోభనం రాత్రి పాట. ‘అమ్మో బయలెళ్ళినాడె దేవుడు’ అంటూ జానపద బాణీలో సాగే ఎర్ర పాటను వంగపండు వ్రాసారు. శోభన్ బాబు పాత్ర ఈ గ్రూప్ డాన్స్ ద్వారానే పరిచయం అవుతుంది సినిమాలో మరో పాట ‘నీ నుదుట కుంకుమ నిత్యమై వెలగాలి’ చాలా శ్రావ్యంగా ఉంటుంది .
నృత్యాలను అద్భుతంగా కంపోజ్ చేసిన పసుమర్తి కృష్ణమూర్తి ని మెచ్చుకోవాలి . ముఖ్యంగా దశావతారాల నృత్యం . ఈ సినిమా అంతా మా గుంటూరు జిల్లా లోని పుణ్యక్షేత్రం అమరావతి లోనే షూటింగ్ చేసారు . రాశి కన్నా వాశి ముఖ్యం . టి కృష్ణ వాశిలో చిరంజీవి . ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలో నాకు ఎంతో నచ్చిన సినిమా ఇది .
An unmissable , thought-provoking , musical and visual splendour . సినిమాల ద్వారా కూడా సంస్కరణలను బోధించవచ్చని నమ్మే బాపు , విశ్వనాధుల సరసన చేరారు టి కృష్ణ ఈ సినిమాతో . ఆస్తికులు , నాస్తికులు , హేతువాదులు , దుస్సాంప్రదాయులు , అందరూ చూడవలసిన చిత్రం . యూట్యూబులో ఉంది. చూడని వారు చూడవచ్చు.
tharjani ……………….
శోభన్ బాబు నటించిన సినిమాల్లో ఇదొక మంచి సినిమా. ఈ సినిమా కథను విని శోభన్ బాబు నటించారంటే అది గొప్ప విషయం.రొటీన్ పాత్రలకు భిన్నమైన పాత్ర ను శోభన్ అద్భుతంగా చేశారు. దర్శకుడు కృష్ణ కూడా అంతే గొప్పగా తీశారు.శోభన్ బాబు తొలుత ఈ సినిమాలో నటించకూడదు అనుకున్నారు.
అయితే నిర్మాత వై హరికృష్ణ శోభన్ కి సన్నిహితుడు. ఆయన అడగడం వలన శోభన్ కాదన లేకపోయాడు..అయితే ఛాతీ కనబడకుండా కండువా .. లేదా లాల్చీ ధరించి నటిస్తానని కండిషన్ పెట్టారు. పిలక పెట్టుకోవడానికి అభ్యంతరం లేదన్నారు. దానికి నిర్మాత దర్శకులు అంగీకరించారు.
కమ్యూనిస్ట్ భావాలున్న దర్శకుడు టి కృష్ణ సినిమాలో శివతాండవం పెట్టడం విశేషం. శోభన్ ఈ కథ లో ప్రధాన పాత్రకు బాగా సూట్ అయ్యారు. ఆయన ఊహించిన దానికంటే ఈసినిమాకు మంచిపేరు వచ్చింది. శోభన్ బాబు కి నంది అవార్డు వస్తుందనుకున్నారు. కానీ రాలేదు.