Excellent chess players……..
ఆ ఇద్దరు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో నేటి తరం మహిళలకు స్ఫూర్తిదాతలుగా నిలిచారు. తెలుగు గడ్డపై పుట్టి, మేధస్సుతో చదరంగంలో ప్రత్యర్థులకు చెక్ పెట్టిన రాణులు.. వారే కోనేరు హంపి ..ద్రోణవల్లి హారిక లు.
కోనేరు హంపి చదరంగం లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ గ్రాండ్‌మాస్టర్. కేవలం 15 ఏళ్ల వయసులోనే గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించారు.
నాటి నుంచి ఆమె క్రీడా జగత్తులో దూసుకుపోతున్నారు. 2004 లో అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక ఓపెన్ టోర్నమెంట్లో పురుషులతో పోటీపడి విజేతగా నిలిచారు.2006లో దోహా ఆసియా క్రీడల్లో వ్యక్తిగత, జట్టు విభాగాల్లో రెండు బంగారు పతకాలు సాధించారు. 2011లో మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచారు.
2019లో రష్యాలో జరిగిన వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచారు. 2020లో భారత జట్టు చారిత్రాత్మక బంగారు పతకాన్ని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. 2022 లో ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించారు.2022 లో చెన్నైలో జరిగిన 44వ చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టుతో కలిసి కాంస్య పతకం గెలిచారు.2024లో న్యూయార్క్‌లో జరిగిన ఫైడ్ ప్రపంచ రాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో ఇండోనేషియా క్రీడాకారిణిని ఓడించి రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచారు.
ఫిబ్రవరి 2026 నాటికి ఈమె భారత మహిళల విభాగంలో నెం.1 క్రీడాకారిణిగా, ప్రపంచ స్థాయిలో 6వ ర్యాంకులో కొనసాగుతున్నారు.భారత ప్రభుత్వం ఈమెను పద్మశ్రీ, అర్జున అవార్డులతో గౌరవించింది.హంపి ప్రస్తుతం జూన్ 2026లో జరగనున్న ప్రతిష్టాత్మకమైన నార్వే చెస్ ఉమెన్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.
హంపి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, గుడివాడలో జన్మించారు. ప్రస్తుతం వీరు విజయవాడలో నివసిస్తున్నారు.తండ్రి కోనేరు అశోక్..ఈయనే హంపి కి తొలి గురువు, కోచ్.కూతురి కోసం తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి పూర్తిస్థాయి శిక్షకుడిగా మారారు.ఇంట్లోనే తండ్రి వద్ద కఠినమైన క్రమశిక్షణతో శిక్షణ సాగింది. రోజుకు 8-10 గంటల పాటు ప్రాక్టీస్ చేసేవారు.
ఆ రోజుల్లో అమ్మాయిలు చెస్‌లో రాణించడం అరుదు. పురుషాధిక్యత ఉన్న క్రీడలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి హంపి ఎంతో శ్రమించారు.విదేశీ టోర్నమెంట్లకు వెళ్లడానికి అయ్యే ఖర్చును భరించడం మధ్యతరగతి కుటుంబానికి పెద్ద సవాలుగా ఉండేది. ప్రైవేట్ స్పాన్సర్లు లేని కాలంలో కుటుంబమే భారమంతా మోసింది.
ఆట కోసం రెగ్యులర్ స్కూలింగ్‌కు దూరమై ప్రైవేట్‌గా పరీక్షలు రాసింది.అలా కష్టపడ్డారు కాబట్టే అద్భుత విజయాలు సాధించారు.2014 ఆగస్టు లో హంపి ..దాసరి అన్వేష్ ల వివాహం ఘనంగా జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు అహానా .
ఇక ద్రోణవల్లి హారిక చెస్ గ్రాండ్ మాస్టర్ గా పేరుగాంచారు. ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌షిప్‌లో పలు పతకాలు సాధించారు. హారిక ప్రపంచ రికార్డులు చాలానే ఉన్నాయి .కోనేరు హంపి తర్వాత గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన రెండో భారతీయ మహిళా క్రీడాకారిణి.
ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌షిప్‌లో 2012, 2015, 2017 సంవత్సరాలలో వరుసగా కాంస్య పతకాలు అందుకుని హ్యాట్రిక్ సాధించారు. 2024లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టు చారిత్రాత్మక బంగారు పతకాన్ని గెలుచుకోవడంలో ఈమె కీలక పాత్ర పోషించారు. భారత ప్రభుత్వం ఈమెను పద్మశ్రీ, అర్జున అవార్డులతో సత్కరించింది.
హారిక తొమ్మిదో నెల గర్భంతో ఉన్నప్పుడు కూడా 2022 చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొని భారత జట్టు కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించి వార్తల్లో నిలిచారు. ఫిబ్రవరి 2026 నాటికి ఈమె ప్రపంచ మహిళల చదరంగ ర్యాంకింగ్స్‌లో 18వ స్థానంలో కొనసాగుతున్నారు.
టాటా స్టీల్ చెస్ ఇండియా 2026.. కోల్‌కతాలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో హారిక ప్రస్తుతం ఆడుతున్నారు. ఇందులో ఉమెన్స్ ర్యాపిడ్ .. బ్లిట్జ్ కేటగిరీల్లో ఆమె పోటీ పడుతున్నారు.
ఈమె ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో 1991లో జన్మించారు. హారికకు చిన్నతనంలోనే తన తాతయ్య ద్వారా చెస్ పట్ల ఆసక్తి కలిగింది. ఆమె ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు (రమేష్, స్వర్ణ) గుంటూరు నుండి హైదరాబాద్‌కు మారారు. కోచ్ ఎన్.వి.ఎస్. రామరాజు వద్ద హారిక శిక్షణ పొందారు. ఉదయం 4 గంటలకే నిద్రలేచి ప్రాక్టీస్ మొదలుపెట్టేవారు..
హారిక తండ్రి ఒక సాధారణ ఉద్యోగి. ఆమెను అంతర్జాతీయ పోటీలకు పంపడానికి చాలాసార్లు అప్పులు చేయాల్సి వచ్చింది. స్పాన్సర్లు దొరకక ఇబ్బంది పడ్డారు.: చిన్న వయసులోనే ఒంటరిగా విదేశాలకు వెళ్లడం, అక్కడి వాతావరణం, ఆహారంతో ఇబ్బందులు పడ్డా తన పట్టుదలను వీడలేదు.గెలుపోటముల మధ్య స్థిరంగా ఉండటం చిన్న వయసులోనే పెద్దవారితో పోటీ పడటం ఆమెకు పెద్ద సవాలుగా ఉండేది.
అన్నింటిని అధిగమించి ముందుకు సాగి ఘన విజయాలు సాధించారు. ప్రస్తుతం ఈమె కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.హారిక 2018 ఆగస్టులో వివాహం చేసుకున్నారు. భర్త పేరు కార్తీక్ చంద్ర. ఈయన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సివిల్ ఇంజనీర్. వీరికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు హన్విక (Hanvika).

