ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం తాలూకు ప్రభావం అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరా పై పడుతోంది. ఫలితంగా పలు దేశాల్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి చుక్కలను తాకుతున్నాయి. ఈ పెరుగుదల ప్రభావం ఇతర రంగాలపై పడితే బతుకు భారం అవుతుందని సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారు.
శ్రీలంకలోని లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ ఇంధన ధరలను భారీగా పెంచేసింది. దాంతో ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు డబుల్ సెంచరీని దాటేశాయి. లీటర్ డీజిల్‌పై రూ.75, పెట్రోల్‌పై రూ.50 చొప్పున పెంచినట్లు ఎల్‌ఐఓసీ ప్రకటించింది. ఫలితంగా లీటరు పెట్రోల్ ధర రూ.254కు చేరగా.. డీజిల్ ధర రూ.214 కు పెరిగింది. శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమైన నేపథ్యంలో ఎల్ఐఓసీ ఈ నిర్ణయం తీసుకుంది.
శ్రీలంకలో కేవలం ఒక్క నెలలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడోసారి. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్రమంలో ఇంధన ధరలు గరిష్ఠ స్థాయికి చేరడం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయ్యిందని విశ్లేషకులు అంటున్నారు.
ధరల పెంపుపై ఎల్ఐఓసీ కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ ‘శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమై డాలర్తో పోలిస్తే రూ.57కు తగ్గింది. ఈ పరిణామం చమురు, గ్యాసోలిన్ ఉత్పత్తుల ధరలను నేరుగా ప్రభావితం చేసి .. ఇంధన ధరల పెరుగుదలకు దారి తీసిందని వివరించారు.రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా సహా ఐరోపా దేశాలు ఆంక్షలు విధించిన క్రమంలో చమురు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయన్నారు.