All are maestros………………..
ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ‘మాస్ట్రో’ మూవీ ని తీశారు దర్శకుడు మేర్లపాక గాంధీ. హిందీ సినిమా ‘అంధాదున్’ ఈ మాస్ట్రో కి మాతృక.దర్శకుడు మాతృకలోని ఆత్మ ఏ మాత్రం చెడకుండా ‘అంధాదున్’ను ‘మాస్ట్రో’గా మలిచిన తీరు బాగుంది.
హీరో అరుణ్ డైలీ లైఫ్, పియానోపై అతనికున్న పట్టును చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఒక్కో సన్నివేశాన్ని అల్లుకుంటూ కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆయా సన్నివేశాలన్నీ సరదాగా, ఉత్కంఠగా సాగుతాయి. హీరో నితిన్ .. నటి తమన్నా ఇందులో కీలక పాత్రల్లో నటించారు.
మొదట్లో కొంత సినిమా నీరసంగా ఉన్నప్పటికీ .. పదిహేను నిమిషాల తర్వాత అసలు కథ మొదలవుతుంది. అక్కడ నుంచి మలుపులు తిరుగుతూ సాగుతుంది. సినిమా లో నితిన్ ఒక పియానిస్ట్. కళ్ళు ఉండి కూడా లేనట్టు నటిస్తుంటాడు. చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ బతికేస్తుంటాడు. అందరూ నిజంగా నితిన్ గుడ్డివాడే అని అనుకుంటుంటారు.
హీరో కళ్ళు ఉండి లేనట్టు ఎందుకు నటిస్తున్నాడనే పాయింట్ వద్ద ప్రేక్షకులు కన్విన్స్ కారు. కానీ అలా నటించడం మూలానే నితిన్ చిక్కుల్లో పడతాడు. ఆ చిక్కుల నుంచి తప్పించుకోవడం చుట్టూనే కథ నడుస్తుంది.
నితిన్ పియానోపై వాయించే మ్యూజిక్ అంటే నటుడు నరేష్ కి ఇష్టం.తన రెండో భార్య తమన్నా బర్త్ డే గిఫ్ట్ గా ఆ మ్యూజిక్ వినిపించాలని నితిన్ ని ఇంటికి రమ్మంటాడు. నితిన్ వెళ్లేసరికి నరేష్ హత్యకు గురై ఉంటాడు. అదే సమయంలో మరో వ్యక్తి కూడా ఉంటాడు.
ఇదంతా గమనించినా నితిన్ తనకు కళ్ళు కనబడనట్టే ఉంటాడు. అసలు హంతకుడు ఎవరు అనే సంగతి తెలిసినప్పటికీ చెప్పే అవకాశం లేకపోవడం సినిమాలో ఒక ట్విస్ట్.అక్కడ కథ మరో మలుపు తీసుకుంటుంది.
కానీ తమన్నా ప్రియుడు పోలీస్ ఇన్స్పెక్టర్ కి .. తమన్నా కి నితిన్ పై సందేహం కలుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు ? నితిన్ ఎలా తప్పించుకున్నాడు ? అనే అంశాల చుట్టూ కథ నడుస్తుంది.
తమన్నా కు మంచి పాత్ర దొరికింది .. పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో తమన్నా బాగానే నటించింది. నితిన్ కి ఇది పూర్తిగా డిఫెరెంట్ పాత్ర. దర్శకుడు అటు నితిన్ ఇటు తమన్నాల నుంచి మంచి నటననే రాబట్టుకున్నాడు.
ఒక దశలో కథ అయిపోయింది అనుకుంటాం .. అక్కడ సడన్ గా మరో మలుపు తిరుగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. హీరోయిన్‌గా నభానటేశ్ ది పెద్ద పాత్ర కాదు. ఉన్నంతలో క్యాజువల్ గా నటించింది. ఇక నటుడిగా.. తమన్నా భర్తగా నరేష్ కరెక్ట్ గా సూటయ్యాడు.
భార్యకు భయపడే తమన్నా ప్రియుడు పాత్రలో జిస్సు సేన్ గుప్తా బాగానే నటించారు. నరేష్ కుమార్తె పాత్రలో అనన్య నాగళ్ల, జిస్సుసేన్ భార్యగా శ్రీముఖి తమ తమ పరిధి మేరకు నటించారు. డబ్బు కోసం ఏమైనా చేసే తరహా పాత్రల్లో మంగ్లీ ,రచ్చ రవి, హర్షవర్ధన్ నటన ఆకట్టుకుంటుంది.
చిన్నమార్పులు తప్ప దర్శకుడు మేర్లపాక గాంధీ మాతృకను అనుసరించి తీశారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు అస్సెట్. మహతి స్వర సాగర్ అందించిన ట్యూన్స్ పెద్ద గొప్పగా లేవు. నేపధ్య సంగీతం బాగుంది. హిందీ చిత్రం చూడని వారికి బాగా నచ్చవచ్చు.మాస్ట్రో సినిమా కరోనా నేపథ్యంలో డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలయింది. ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది.. చూడని వారు చూడవచ్చు.