అవును.. వాస్తవ జీవిత ఘటనలే !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi …………………………….

‘ఇది కధ కాదు’. బాలచందర్ మార్క్ సినిమా.. ఆయన  సినిమాలు కల్పిత కథల్లాగా ఉండవు . మన చుట్టూ జరిగే సంఘటనలనే సినిమాలుగా తీస్తారు ఆయన.మనసుకు హత్తుకుపోయేలా తెరకెక్కిస్తారు.మెదడుతో ఆలోచించే విధంగా తీస్తారు. అలాంటి సినిమాలలో ఇది ఒకటి.  జూన్ 1979 లో వచ్చిన ఈ ‘ఇది కధ కాదు’ సినిమా. జయసుధకు ఉత్తమ నటిగా నంది అవార్డుని తెచ్చిపెట్టిన సినిమా.

ఈ సినిమాలో రెండు స్త్రీ పాత్రలు ఉంటాయి. అందరికీ జయసుధ నటించిన సుహాసిని పాత్రే గుర్తు ఉంటుంది.అంత కన్నా గొప్ప పాత్ర సుహాసిని అత్త గారిది. కొడుకు చేసిన తప్పును సరిదిద్దటానికి విశ్వ ప్రయత్నం చేసి,తన కొడుకు మారడనే నిర్ణయానికి వచ్చి , ఆ కొడుకును వదిలేసి కోడలు వెంట నడిచేందుకు సిధ్ధమైన పాత్ర.

ఈ పాత్రలో నటించిన నటి పేరు లీలావతి. కన్నడంలో సుమారు 400 సినిమాలలో నటించింది.అన్ని భాషల్లోను కలిపి సుమారు 600 సినిమాలలో నటించింది. మన రమాప్రభ, తమిళంలో మనోరమ లాగా. 
జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏముంది ? మహానటి సావిత్రి , వాణిశ్రీ ల  వారసురాలు. 

మూడు మగ పాత్రలు, ప్రతి నిమిషం తాను మగాడిని , మగాడు ఆడది సమానం కాదు, ఆడదాన్ని హింసించడం మగాడి జన్మ హక్కు అని భావించే మృగాడి పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించారు.ఎంత బాగా నటించారంటే సీట్లో నుంచి స్క్రీన్ లోకి దూరి తన్నాలని అనిపిస్తుంది.ఆపాత్రకు తగినట్టు డైలాగులు కూడా పడ్డాయి.శాడిస్ట్ పాత్ర. కెరీర్ మొదట్లో ఇలాంటి పాత్రలను చాలానే వేసారు.

జనార్దన్ అనబడే జానీ( కమల్) క్యారెక్టర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. మంచి పాత్ర దొరికితే  కమల్ కూడా విజృంభిస్తాడు. అదే చేసాడు. సుహాసిని మెప్పు కోసం , ఆమె ప్రశాంతంగా ఉండేందుకు అహర్నిశలూ మనసులోనే ఆరాధించే మంచి బాలుడిగా కమల్  బాగా నటించారు.

ఈ పాత్రకు గొప్పపేరు రావటానికి కారణం వెంట్రిలాక్విజమే.ఈ కళను చూపిన మొదటి సినిమా ఇదే. అప్పట్లో  సాధారణ ప్రజలకు ఈ కళ గురించి తెలియదు. ఇలాంటి పాత్రను ఒకదాన్ని సృష్టించాలనే ఆలోచనే గొప్పవిషయం. ప్రఖ్యాత మిమిక్రి కళాకారులు వేణుమాధవ్ చేస్తుండేవారు.ఆయన ప్రదర్శన నేను మొదటిసారి మా S.S&N కాలేజీలో 1970 లో చూసాను. కమలహాసన్ ఈ వెంట్రిలాక్విస్ట్ పాత్రను అద్భుతంగా చేశారు. తమిళ్,తెలుగు చిత్రాల్లో కమలే ఈ క్యారెక్టర్ చేయడం విశేషం.

ప్రేక్షకులు మరచిపోలేని నాలుగో పాత్ర. మూడో మగ పాత్ర భరణి (శరత్ బాబు).  జయసుధ, భరణిలు ప్రేమించుకుంటారు. ఈ పాత్ర కూడా కళాకారుడి పాత్రే . జయసుధ విడాకులు తీసుకున్నాక మరోసారి కధలోకి వస్తుంది. రెండోసారి కూడా జయసుధని పెళ్ళి చేసుకోలేక పోతాడు. సరితను పెళ్లి చేసుకుంటాడు. ఉదాత్తమైన పాత్ర.

మొదట్లో విలన్ గా నటించిన శరత్ బాబు మధ్య మధ్యలో ఇలాంటి ఉదాత్త పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. బాలచందర్ సినిమాలలో పాత్రల సంఖ్య తక్కువగా ఉంటుంది.అలా అని మనకు అనిపించకుండా సినిమాను పరుగెత్తిస్తారు. మనకు తెలియకుండానే సినిమాలో లీనమవుతాం. 

ఈ సినిమాకు ప్రాణం యం యస్ విశ్వనాథన్ సంగీతం. ముత్యపు చిప్పలో పడితే కానీ వాన చినుకు ముత్యం కాదు . అలాగే మంచి సంగీతం , గాత్రం ఉంటేనే కానీ సాహిత్యానికి గుర్తింపు రాదు. ఈ సినిమాలో పాటలన్నీ ఆత్రేయే వ్రాసారు.

‘సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము’ పాట ఈరోజుకీ చెవుల్లో గింగురుమంటూనే ఉంటుంది.చాలా శ్రావ్యంగా ఉంటుంది.సుశీలమ్మ పాడారు . ‘జూనియర్ జూనియర్ అంటూ సాగే ఇటు అటు కాని హృదయంతోని ఎందుకురా ఈ తొందర పాట’ పిల్లలకు, సాధారణ ప్రేక్షకులకు భలే నచ్చిన పాట. బాలసుబ్రమణ్యం , రమోలా పాడారు.

కమలహాసన్, సరితలు డాన్స్ పాట ‘తకధిమితక జతజతకొక కధ ఉన్నది’ పాట లో ఇద్దరూ అద్భుతంగా నటించారు. ఈ పాటను చూసినప్పుడల్లా నాకు ‘మేరా నామ్ జోకర్’ హిందీ సినిమాలో రాజ్కపూర్ గుర్తుకు వస్తారు. అసలు ఈ సినిమాలో ఈ పాత్ర సృష్టికి బాలచందర్ కు రాజ్ కపూర్ జోకర్ పాత్రే స్ఫూర్తి ఏమో అని అనిపిస్తుంది. 

నాకయితే మాత్రం కమలహాసన్ పాత్ర చూసినప్పుడల్లా రాజ్ కపూర్ జోకర్ పాత్రే గుర్తుకు వస్తుంది. ఇంకా మరో రెండు పాటలు ఉన్నాయి.  గాలి కదుపు లేదు .. కడలికంతు లేదు . సంగీత సాహిత్యాలు రెండూ అదుర్సే . మరో పాట ‘జోల పాట పాడి ఊయలలూపనా’ పాట.చాలా శ్రావ్యంగా ఉంటుంది. వెరశి ఈ సినిమా సక్సెస్ కు కారణాలయిన సంగీత సాహిత్య గాత్రాలను అభినందించాల్సిందే. 

కధ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాలచందర్. ‘చావే అన్నింటికీ పరిష్కారం అయితే నేను ఎన్ని సార్లు చావాల్సివచ్చేదో ”దేశంలో స్త్రీలంతా ఇంత నిజాయితీ పరులైతే తుఫాన్లు ఎందుకొస్తాయి’ ? ‘ముప్పయి రూపాయల చీరలో కూడా అందం గా ఉంటే.. అదే అసలైన అందం’. ‘విడాకులు ఆడదానికి వరం.’  వంటి  పదునైన డైలాగులను గణేష్ పాత్రో అందించారు  

ఇప్పటికీ తరచూ ఏదో ఒక టివి చానల్లో వస్తూనే ఉంటుంది. తక్కువ బడ్జెట్తో బాగా హిట్టయిన సినిమా.పైగా బ్లాక్ & వైట్ సినిమా.1977 లో తమిళంలో బాలచందర్ తీసిన ‘అవర్ గళ్’ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా. అందులో జయసుధ పాత్రను సుజాత పోషించింది .

కమలహాసన్ రెండింటిలోనూ నటించారు.చిరంజీవి పాత్రను రజనీకాంత్ పోషించారు.చిరంజీవి , కమలహాసన్ కలిసి నటించిన ఏకైక చిత్రం ఇదొక్కటే . ఈరోజుల్లో కూడా ఈ సినిమాను చూడనివారు ఉండరు . ఎవరయినా ఉంటే అర్జెంటుగా చూసేయండి . An unmissable , musical , art film .

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!