ఉదాత్తమైన అక్రమ ప్రేమ !!

Sharing is Caring...

Taadi Prakash  …….. Scandal …and An affair to remember…

Happy families are all alike, every unhappy family is unhappy inits own way అనాకెరినినా నవల ఎప్పటికీ వెన్నాడే ఈ వాక్యంతో మొదలవుతుంది. టాల్ స్టాయ్   ఒక్కడే  ఇలా నిజాలు చెప్పి మనల్ని భయకంపితుల్ని చేయగలడు.
“లేచిపోయినానని ఎవరన్నా అంటే… నా మనసుకెంతో కష్టంగా వుంటుంది.. ” ఇది రాజేశ్వరి బాధ.
మైదానం నవల ఈ వాక్యంతో మొదలవుతుంది. గుడిపాటి వెంకటచలం మాత్రమే అలా షాకింగ్గా  ప్రారంభించి ఒక స్త్రీ వేదనకి మాటల రూపం ఇవ్వగలడు.

ఇప్పటికి 66 సంవత్సరాల క్రితం… ఒక లేచిపోయినావిడకి సంబంధించిన నిజ జీవిత కథ ఇది. ఇందులో చాలా మంది అంతర్జాతీయ ప్రముఖులు ఉన్నందువల్ల చాలా ఇంట్రెస్టింగ్గా, ఊపిరి సలపనట్టుగా కూడా ఉంటుంది.

1957, పండిట్ జవహర్లాల్ నెహ్రూ మన దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రఖ్యాత ఇటలీ దర్శకుడు రాబర్టో రోసాలిని ని ఇండియా రమ్మని ఆహ్వానించారు నెహ్రూ. ఫాదర్ ఆఫ్ ఇటాలియన్ నియోరియలిస్ట్ సినిమాగా రోసాలిని ప్రపంచ ఖ్యాతి పొంది వున్నారు. నవ భారత్ పై నాలుగు డాక్యుమెంటరీలు, ఒక పూర్తి స్థాయి సినిమా తీయాలి.

కొత్తగా స్వాతంత్యం పొందిన భారతదేశంలో తాజ్ మహల్ , ఎర్ర కోట, పురాతన కట్టడాలు ,  గుళ్ళూ గోపురాలూ కాకుండా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పేమిటో ప్రజాస్వామ్యం ఎలా పని చేస్తుందో గమనిస్తున్నానని రోసాలిని అన్నారు. రోసాలిని ఇండియా వచ్చిన పని ఒకటైతే, కలకత్తా పర్యటన ఆయన జీవితాన్నే మార్చేసింది.

బెంగాల్లో డాక్యూమెంటరీ చిత్రాల దర్శకునిగా, నాటకరంగ నిపుణునిగా పేరందిన హరిసదన్ దాస్  గుప్తాని రొసాలిని కలుసుకున్నారు. ఒక రోజు ఈ దర్శకులిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు, అక్కడికి దాస్ గుప్తా  భార్య వచ్చింది. ఆమె పేరు సోనాలి దాస్ గుప్తా . ఇద్దరు చిన్న పిల్లల తల్లి. పొడవుగా, హుందాగా వుండే సోనాలీ బెంగాలీ బ్యూటీ. ఆ సంప్రదాయ సౌందర్యాన్ని చూసి తట్టుకోలేకపోయాడు రోసాలిని.

అందంగా, చురుగ్గా, గంభీరంగా వున్న ఇటాలియన్ దర్శకుణ్ణి చూసి ఆమె ఇష్టపడింది. అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నారు కొందరు. అప్పటికి 27 సంవత్సరాలున్న సోనాలికి ఇద్దరు మగపిల్లలు, ఒకడికి ఆరేళ్ళు, మరొకడికి 11 నెలలు మాత్రమే. దాస్ గుప్తా  లేని సమయం చూసి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. కలిసిబతుకుదాం అనుకున్నారు. లేచిపోదాం… అని నిర్ణయించుకున్నారు.

శాంతినికేతన్లో చదువుకున్న, ఉన్నత కుటుంబానికి చెందిన సౌందర్యరాశి… అటు చూస్తే భర్త పేరున్న దర్శకుడు, ఇటు ఇద్దరు పిల్లలు… ఎలా? ఇండియా నుంచి వెళ్ళిపోవడం ఎలా? సోనాలీని తీసుకుని వెళ్ళాలనే నిశ్చయంతో వున్న రోసాలిని, లవ్ ఎఫైర్ని ఏకంగా నెహ్రూ గారికే తెలియజేశారు. ప్రధానినెహ్రూ మాటంటే ఇక తిరుగు వుండదు కదా!

అప్పటికి రొసాలినికి 52 ఏళ్ళు. ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ హీరోయిన్ ఇంగ్రిడ్ బెర్గ్ మన్  ఆయన భార్య. అయితే, రోసాలిని అందమైన ఆడవాళ్ళ వెంట తిరగడం, ఇతర సమస్యలలో వాళ్ళిద్దరూ విడిపోయే ఉద్దేశంతో వున్నారు. నాటి కుర్రకారంతా అందాల తార ఇంగ్రిడ్ బెర్గ్మన్ చురుకైన చూపు కోసం ఒక్క నవ్వు కోసం పడిచస్తుంటే, రోసాలిని, సోనాలి ముందు మోకరిల్లి వున్నాడు.

తాజావార్త : కొత్త ప్రేమ కథ, వాళ్ళిద్దరూ దేశం  విడిచి వెళిపోబోతున్నారు అంటూ కొన్ని పత్రికలు రాశాయి. సెక్స్ స్కాండల్ అనే లెవెల్లో! పూజ్యనీయుడైన ఇటాలియన్ దర్శకుడూ, పైగా ఇంగ్రిడ్ బెర్గ్మన్ భర్త గనక, హాలీవుడ్ సినిమా పత్రికలూ ఈ సంచలన వార్తని హెూరెత్తించాయి.ఈ ప్రేమ – పర్యవసానం వార్తలు చదివి సంప్రదాయ బెంగాలీ సమాజం షాక్ తినింది. దాస్ గుప్తా భార్య  ఇంతకి తెగిస్తోందా? అని విస్తుపోయింది.

కొందరైతే, ఏకంగా, ఆమెకి పాస్ పోర్ట్  ఇవ్వకూడదని గట్టిగా చెప్పారు. సాక్ష్యాత్తు నెహ్రూయే ఒకమాట చెప్పడం వల్ల సోనాలికి పాస్పోర్ట్, దేశం విడిచి వెళ్లడానికి అవసరమయ్యే డాక్యుమెంట్లు యిచ్చారు. బొంబాయి నుండి రోసాలినితో కలిసివెళ్ళడం కుదరదని సోనాలి చెప్పింది. అప్పటికే రోసాలినితో  పరిచయం పెరిగి స్నేహంగా మారడంతో ఎం.ఎఫ్. హుస్సేన్ రంగంలోకి దిగారు. ముందుగా అనుకున్న చోటికి చిన్న కొడుకుని తీసుకుని సోనాలీ వచ్చింది. ఆర్టిస్ట్ ఎం.ఎఫ్ హుస్సేన్ పొడవాటి గడ్డం, తెల్లనిబట్టల్లో వున్నాడు.

సోనాలి, హుస్సేన్ భార్యగా నటించారు. పత్రికా విలేకరులు, కెమెరాల కంటబడకుండా హుస్సేన్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఢిల్లీ వెళ్ళడానికి హుస్సేన్, సోనాలీ రైలు ఎక్కారు. వాళ్ళపక్క కంపార్టుమెంట్లో వున్న ప్రతిష్టాత్మకమైన అమెరికన్ టైమ్, లైఫ్ పత్రికల ప్రతినిధులు ఒక్కఫోటోకి అనుమతిస్తే, అయిదువేల డాలర్లు ఇస్తామని చెక్కులు చూపించారు. 1957లో ఐదు వేలడాలర్లు అంటే మాటలా? హుస్సేన్ వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెని ఢిల్లీ చేర్చారు.

విమానంలో బురఖా వేసుకున్న సోనాలి, హుస్సేన్ తో పాటు పారిస్ వెళ్ళింది. అక్కడితోనే హుస్సేన్ బాధ్యత తీరిపోలేదు. ఆమె ఎందుకు వస్తోందో ఇంగ్రిడ్ బెర్గ్మన్ కి  చెప్పాల్సివచ్చింది. రోసాలినీ ఇండియా గురించి తీసే చిత్రానికి స్క్రిప్టు రచయిత సోనాలి అనీ, ఆమెకి భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గురించి బాగా తెలుసనీ హుస్సేన్ కోతలు కోశాడు.

ఇండియాలో పనంతా గంగలోతొక్కి రోసాలినీ పారిస్ వెళ్ళాడు. అక్కడ రోసాలీని మిత్రుడు, ఫోటోగ్రాఫర్ హెన్రీకార్టియిర్ బ్రెస్సన్ స్టూడియోలో రెండు మూడు రోజులుండి, తర్వాత రోమ్ వెళ్ళారు. (అప్పటికి మన ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ సోనియాగాంధీకి 11 ఏళ్ళు) శాంతినికేతన్లో చిన్నతనం నుంచే సోనాలీకి నెహ్రూ తెలుసు. ఇందిరాగాంధీ, నెహ్రూలతో ఆమె స్నేహం జీవితాంతమూ కొనసాగింది. రోమ్ లో  రోసాలిని వల్ల సోనాలీకి ఒక పాప… పేరు రాఫెల్లా పౌలా.

ఈ బిడ్డనే కాకుండా రోసాలిని, ఇంగ్రిడ్ బెర్గ్మన్ ల  కూతురు అయిన ఇసబెల్లా రోసాలిని కూడా సోనాలి ప్రేమగా పెంచింది. తర్వాత ఇసబెల్లా ప్రఖ్యాత సినీ నటి అయింది.సోనాలి, భర్తనీ బిడ్డని మోసం చేసి ఇటలీ దర్శకునితో వెళ్ళిపోయింది. పోనీ అక్కడ సుఖపడిందా… అంటే అదీలేదు. ఒంటరితనంతో విలవిల్లాడి పోయింది. బిడ్డలు దూరమై, బతుకు భారమై.. ఆమెకి తగిన శాస్తి  జరిగింది… అని కొన్ని పత్రికలు రాశాయి. రొసెల్లినీకి వున్న యితర సంబంధాలు, ఇంగ్రిడ్ బెర్గ్మన్ ఆయన విడిపోవడం… లాంటివన్నీ కలిసి పత్రికలు సంచలన వార్తలుగా రాశాయి.భారతీయ సంపద్రాయాన్ని సోనాలీ మంట గలిపిందనీ కొందరు అన్నారు.

ఇంతకీ సోనాలీ రోమ్ లో  దుర్భరమైన జీవితం గడిపారా? అది 2014 జూన్ 15వ తేదీ కావొచ్చు. మా అన్నయ్య ఆర్టిస్ట్ మోహన్, నేనూ మా ఖైరతాబాద్ ఆఫీసులో కూర్చొని ఆదివారం పత్రికలు, అనుబంధాలు, మేగజైన్లు తెగ చదువుతున్నాం. అరేయ్, ఇది చదువు అని మోహన్ ఒక వ్యాసం యిచ్చాడు. దాని హెడ్డింగ్ :”యాన్ ఎఫైర్ టు రిమెంబర్ “.అది హిందూ దినపత్రిక సంస్థ ప్రచురించే ఫ్రంట్ లైన్ మాస పత్రిక. చదివితే కళ్ళు తిరిగాయి. అతను ఇంగ్రిడ్ బెర్గ్మన్ భర్త. ఆమె దాస్ గుప్తా  భార్య. పిల్లలున్నారు. జవహర్లాల్ నెహ్రూ చొరవతో వాళ్ళు హాయిగా రోమ్ వెళిపోయారు.

ఐనా అదంతా 1957లో జరిగితే, ఇప్పుడెందుకు ఆ ఎఫైర్ గురించి రాశారు?  2014వ సంవత్సరం జూన్ 7 శనివారం నాడు రోమ్ లో  సోనాలీ చనిపోయారు. అప్పుడామె వయస్సు 86 సంవత్సరాలు. 66 సంవత్సరాల క్రితం సినీ ప్రపంచాన్నీ, బెంగాల్ని కుదిపివేసిన ఈ అక్రమ ప్రేమ గురించి వాళ్ళు గుర్తు చేశారు. ఎంతో ఇంటరెస్టింగా వున్న ఈ ఎఫైర్ గురించి తప్పకుండా రాయాలని అప్పడే అనుకున్నా. ఈ మధ్యనే ఓ ఇంగ్లీషు మేగజైన్లో ఆ ప్రేమ కథపై ఒక ఆర్టికల్ వచ్చింది. అది చూశాక సోనాలి ప్రేమ గురించి విస్తృతంగా చదివాను. ఆ వివరాలే రాస్తున్నాను.

ఉన్నత విద్యతో సంస్కారవంతురాలైన సోనాలి అక్కడ ఆనందంగా బతికారు. పాప పుట్టాక రోమ్ నగరంలో 1960లో సొంతంగా ఒక బొటిక్ పెట్టారు. భారతీయ కాటన్స్, అల్లికలు, జాయెలరీ అమ్మకంతో బొటిక్ పాపులర్ అయ్యింది. బొటిక్ పేరు ‘సొనాలి’. ఆమె ఇండియా వచ్చి దక్షిణాది కాటన్స్, జాయలరీ, కొత్త డిజైన్లు కొని, ఆర్డర్ చేసి రోమ్ తీసికెళ్ళేవారు. ఇటలీ సినిమా ప్రముఖులు, హాలీవుడ్ హీరోయిన్లు సోనాలీలో షాపింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేసేవారు.

వ్యాపార దక్షతగల మహిళగా సోనాలి రాణించారు. రాసే అలవాటున్న సోనాలీ, 1959లో రోసెల్లినీ తీసిన ‘ఇండియా మాతృభూమి’ అనే 90 నిమిషాల డాక్యుమెంటరీకి స్క్రిప్టు రాశారు.సోనాలి కోసం భార్య బెర్గ్మన్ తో విడిపోయిన రోసెల్లినీ  రెండో భార్యతో 16 సంవత్సరాలు కలిసి వున్నారు. నాటి అగ్రదర్శకులందరూ ఆయన మిత్రులే. వాళ్ళ సాయంత్రం పార్టీల్లో ఎం.ఎఫ్ హస్సేన్ కూడా వుండే వారు. వాళ్ళు హుస్సేన్ని గొప్ప ఆర్టిస్ట్ గా  ఆదరించి, గౌరవించారు.

1973లో సోనాలితో కూడా రోసెల్లినీ విడిపోయారు. అయితే 1977 జూన్ 3న ప్రపంచం గర్వించదగ్గ దర్శకుడైన రోసెల్లినీ మరణించారు. అప్పడాయన వయసు 71 సంవత్సరాలు… సోనాలీ తన బొటిక్ వ్యాపారం చూసుకుంటూ, కూతుళ్లనీ, మనవళ్ళనీ శ్రద్ధగా పెంచుతూ మిగిలిన సంవత్సరాలు గడిపారు. ఆమె జీవితాంతమూ చీర మాత్రమే ధరించారు. నాణ్యమైన భారతీయ నూలువస్త్రాలు, అందమైన డిజైన్లను ఆమె ప్రాణాధికంగా ఇష్టపడ్డారు.

ఈ హైసోసైటీ లవ్ స్టోరీ హీరోయిన్గా మాత్రం  సోనాలీ అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందారు. ఆమె పిల్లలంతా (దాస్ గుప్తా  కుమారులతో సహా) ఉన్నత విద్యావంతులై వాళ్ళ వృత్తుల్లో రాణించారు. ప్రఖ్యాత భారతీయ జర్నలిస్టు, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ ఎడిటర్ దిలీప్ పడ్గావ్ కర్ , రోసిల్లినీ భారత యాత్రపై ఒక పుస్తకం రాశారు.

దాని పేరు UNDER HER SPELL : ROBERTO ROSSELLINI IN INDIA.ఒక అపిప్పిరాయం : మనలాంటి మిడిల్  క్లాస్ టెర్రరిస్టులకి కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి. సొరకాయ కూర వండడం ఎలా? దగ్గర నుంచి సమంత ఎవరితో వుండాలి? అనే దాకా మనవన్నీ తిరుగులేని తీక్షణమైన ఒపీనియన్స్. మేలిమి బంగారం లాంటి సావిత్రి ఆ జెమిని గణేషన్ గాణ్ణి చేసుకోపోతేనేం! దేవతలాంటి శ్రీదేవికి ఆ బోని కపూర్ గాడే దొరికాడా?…
ఇలా మనం రగిలిపోతూఉంటాం.

నాటి సనాతన బెంగాలీ సమాజం కూడా ఈ కొవ్వెక్కిన ఆడది ఇటలీ వాడితో లేచిపోయిందని దురాగ్రహంతో ఊగిపోయింది. చదువు, సంస్కారమూ, ‘ఈ జీవితం నాది’ అన్న స్పృహ వున్న సోనాలీ తనకి నచ్చినట్టుగా బతికింది. రోసాలినీ భార్యగా, ఒక సెలబ్రెటీగా రోమ్ వీధుల్లో తలెత్తుకుని నడిచింది. బిడ్డలందరినీ బాధ్యతగా పెంచింది. ‘సోనాలీ’ ని ఒక ప్రతిష్టాత్మకమైన ఇండియన్   బోటిక్ గా తీర్చిదిద్దింది.

చివరికి రోసాలినీతో విడిపోయినా హుందాగా, దర్జాగా బతికింది.ఆమె ఏ విమర్శకీ స్పందించలేదు. ఎవర్నీ నిందించలేదు. సెల్యూలాయిడ్ జీనియస్ రాబర్టో రోసాలినీ, శాంతినికేతన్ ఆర్టిస్టు, రచయిత్రి సోనాలీల ఎఫైర్ గురించి దిలీప్ పడ్ గాం కర్  ఒక్క వాక్యంలో ఇలా అన్నారు…. “He was the storm and she was the eye of it’ .

రచయిత ఫోన్ నంబర్
9704541559

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!