బాబు పై కేసులన్నీ కొట్టేశారా ??

Sharing is Caring...

ఏపీ మాజీ ముఖ్యమంత్రి , ప్రతిపక్ష నేత చంద్రబాబు పై ఉన్న కేసులన్ని కోర్టులు  కొట్టి వేశాయా ? అంటే “అవును” అని బాబు అనుకూల వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లుగా బాబు స్టే ల పైనే నెట్టుకొస్తున్నారని రాజకీయ ప్రత్యర్ధులు పదే పదే విమర్శలు గుప్పించేవారు. ఆ స్టే లు ఎత్తేస్తే ఆయన జైలుకి వెళతారు అని ఘాటు వ్యాఖ్యలు చేసేవారు. వారం క్రితం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా  బాబు స్టే ల గురించి మాట్లాడారు. బాబు కు దమ్ముంటే  ఆ కేసులపై విచారణ చేయించుకోవాలని సవాల్ విసిరారు. స్టే లపై ఉన్న బాబును ఏక్షణంలో మూసేస్తారో తెలియదని ఎద్దేవా చేశారు.

తమ్మినేని వ్యాఖ్యల దరిమిలా టీడీపీ వర్గాలు  “బాబు మీద కేసులన్నీ కొట్టేశారని, ఉన్న ఒకటి అరా కేసులు పెద్ద లెక్కలోవి కాద”ని అంటున్నాయి. ప్రస్తుతం  బాబు మిస్టర్ క్లీన్ అని  ….  బాబు పై లక్ష్మీపార్వతి వేసిన కేసు ఒకటి, అలాగే బాబ్లీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కేసు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా కేసులన్నీ ఎపుడో కోర్టులు కొట్టేశాయి. అయినప్పటికీ వైసీపీ వర్గాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.కాగా “ఓటుకు నోటు కేసు ” గురించి కూడా వైసీపీ నేతలు తరచుగా ప్రస్తావిస్తుంటారు. ఆ కేసులో అక్యూజ్డ్ లిస్ట్ లో చంద్రబాబు పేరు లేదు . కేవలం చార్జిషీట్ లో మాత్రమే ప్రస్తావించారు. కాబట్టి ఆ కేసు లో బాబు ప్రమేయం లేనట్టే అని టీడీపీ వర్గాల వాదన.

ఇక  బాబు  అక్రమాస్తులపై  లక్ష్మీపార్వతి వేసిన కేసు ఇప్పటిది కాదు.  బాబు దానిపై అప్పట్లో స్టే తెచ్చుకున్న మాట వాస్తవమే. ఆమధ్య సుప్రీం కోర్టు పాత కేసులపై స్టే లను తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో  ఆ కేసు పై విచారణ మొదలైంది. ఇది గాక నిబంధనలకు విరుద్ధంగా బాబ్లీ ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా పోలీసులు పెట్టిన   ఒక కేసు పెండింగ్ లో ఉంది. ఇవి తప్పితే బాబు పై కేసులే లేవని టీడీపీ బల్లగుద్ది వాదిస్తోంది.

వైఎస్ , వైఎస్ సతీమణి విజయమ్మ , కాంగ్రెస్ నేతలు వేసిన కేసులను కోర్టులు కొట్టేశాయని టీడీపీ అనుకూల మీడియా కూడా చెబుతోంది. ఇటీవల ఇదే అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో డిబేట్ కూడా జరిగింది. టీడీపీ కూడా ఒక వీడియోను  సోషల్  మీడియాలో పెట్టింది. కేసు నంబర్లతో సహా కొట్టివేసిన  కేసుల గురించి వాళ్ళు చెబుతున్నారు . కేసులపై ఇంత ప్రచారం జరిగేక కూడా ఎక్కడా వైసీపీ వర్గాలు ఈ అంశంపై స్పందించిన దాఖలాలు లేవు.

చంద్రబాబు పై మొదట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి  సీఎం కాకముందు అయిదు కేసులు వేశారు. కొన్నాళ్ల తర్వాత వాటిలో మూడింటిని  విత్ డ్రా చేసుకున్నారు. రెండు కేసులు కోర్టు కొట్టివేసింది . అప్పట్లో న్యాయవాది రామచంద్ర రావు సూచన మేరకు  విత్ డ్రా చేసుకున్నానని వైఎస్ చెప్పేవారు. ఆ తర్వాత వైఎస్ విజయమ్మ వేసిన కేసులు కొట్టి వేశారు.
వాటిని తీసేస్తే ఇంకా బాబు 18 కేసులలో స్టే తెచ్చుకున్నారని 2014 ఎన్నికలవరకు ప్రచారం జరిగింది. అపుడు టీడీపీ వర్గాలు కూడా కేసులు … స్టేలు లేవని వాదించలేదు. బాబు కూడా ఎక్కడా ఖండించలేదు. ఆ మాట కొస్తే ఇపుడు కూడా ఎక్కడా బాబు తనపై కేసులు కొట్టేశారని చెప్పలేదు.

అధికార పక్షం పదేపదే కేసులు..స్టేలు గురించి మాట్లాడుతున్నప్పుడు వాటిని ఖండించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అలా ఖండిస్తే ఇక కేసులు గురించి పదేపదే ఎవరూ ప్రస్తావించరు.  ఇక కేసులు కొట్టివేత అంశంపై మీడియా కూడా అంతగా దృష్టి పెట్టలేదు. స్పీకర్ కేసుల ప్రస్తావన తెచ్చాకనే మళ్ళీ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఎవరి దృష్టిలోకి రాకుండానే కోర్టులు వాటి పని అవి చేసేశాయి.

ఇక ఇప్పటికి  బాబుపై కేసులు .. స్టే లు ఉన్నాయని వైసీపీ భావిస్తుంటే …  వెంటనే వాటిని తొలగించి విచారణ జరపమని  ఆ పార్టీ లాయర్లు ఎవరైనా పిటీషన్లు వేయవచ్చు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారో లేక యధావిధిగా విమర్శలు చేస్తుంటారో  చూడాలి.

 

— KNMURTHY

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. Ram mohan October 1, 2020
error: Content is protected !!