జాడ లేకుండా పోయిన వివాదాస్పద స్వామి నిత్యానంద ట్విట్టర్ లో ఖాతా తెరిచి జోకులు పేలుస్తున్నాడు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో తమ దేశమైన కైలాష్ ద్వీపంలోకి భారతీయ భక్తులకు ప్రవేశం లేదని ప్రకటించారు. భారత్ తో పాటు బ్రెజిల్, ఈ యూ, మలేషియా భక్తుల ప్రవేశం పై నిషేధం విధిస్తున్నట్టు తన ప్రెసిడెన్షియల్ మెండేట్ లో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాయబార కార్యాలయాలన్నింటిని మూసివేస్తున్నట్టు నిత్యానంద ప్రకటన చేశారు. ట్విట్టర్ లో నిత్యానంద ప్రకటనలు చూసి జనాలు విరగబడి నవ్వుతున్నారు. నిత్యానంద మాటలను జోకులుగా చెప్పుకుంటూ రీట్వీట్ చేస్తున్నారు. నిత్యానంద ప్రకటన చూస్తే అతగాడికి పైత్యం ఎక్కువైందని ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది.
ఇదిలా ఉంటే మన పోలీసులు ఇంకా పరిశోధన చేస్తున్నామంటున్నారు కానీ ఈ దొంగ స్వామి ఆనుపానులు మాత్రం కనిపెట్టలేకపోతున్నారు.తాను కైలాస దేశం సృష్టించుకుని అక్కడ ఉంటున్నానని నిత్యానందుడు ప్రకటించుకున్నప్పటికీ ఆమాటలు నమ్మబుద్దికావడం లేదు.అయితే అతగాడు మరెక్కడున్నాడు ? అదే మిస్టరీ. అసలు ఈక్వెడార్ ప్రాంతంలో దీవి ఎవరికి అమ్మలేదని ఆ దేశపు అధికారులు కూడా ప్రకటించారు.
నిత్యానంద సృష్టించిన కైలాస దేశం అనేది నిజమా? అబద్ధమా ? అక్కడికి పోయి చూసినవారు లేరు. ఆయన అనుచరులు ఎక్కడో కూర్చుని చేస్తున్న ప్రకటనల ద్వారానే సమాచారం విడుదల చేస్తున్నారు. ప్రాగ్జి సర్వర్స్ ద్వారా వీడియోలను నిత్యానంద కానీ ఆయన అనుచరులు కానీ విడుదల చేస్తున్నారని పోలీసులు తేల్చారు. అహ్మదాబాద్ పోలీసులు నిత్యానంద ఈక్వెడార్, ట్రినిడాడ్ పరిసరాల్లో సంచరిస్తున్నారని అనుమానిస్తున్నారు.అలాగే మలేషియా కూడా వెళ్లి ఉండొచ్చని అంటున్నారు . అక్కడ నుంచే సమాచారాన్ని ప్రపంచానికి విడుదల చేస్తున్నారని చెబుతున్నారు. గతంలో నిత్యానంద ఒక యూనివర్శిటీ నెలకొల్పేందుకు మలేషియా తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆ ఒప్పందం క్రమంలో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం సినీనటి రంజితతో సరససల్లాపాల్లో మునిగి తేలిన నిత్యానందుడు వీడియోల సాక్షిగా అడ్డంగా దొరికిపోయాడు. అతడి వద్ద దాదాపు 15 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ కేసులో నుంచి పూర్తిగా బయట పడకముందే గుజరాత్ ఆశ్రమం కు మకాం మార్చాడు . ఇతగాడిపై కర్ణాటకతో సహా, ఇండియాలో పలుచోట్ల క్రిమినల్ కేసులున్నాయి . ఓ రేప్ కేసులోనూ ప్రధాన నిందితుడు . మొత్తం మీద నిత్యానంద పోలీసుల కళ్ళు గప్పి ఇండియా వదిలి పోయాడు.