Mohan Artist……………………………………..
అపుడు శాంతారాం ‘దో ఆంఖే బారాహాత్’ అనే సినిమా తీసేవాడు. తరువాత రాజ్ కపూర్ సినిమా జిస్ దేశ్ మే గంగా బహ్తీ హై వచ్చేది. దొంగతనాలు, చెడ్డపనులు మానేసి బుద్ధిగా మన పోలీసులకి లొంగిపోయి, క్యాబేజీ, క్యారెట్లు పండించి దేశానికి మేలు చేయండని అవి సందేశం ఇచ్చేవి. అలా జనాన్ని వొప్పించే ప్రోగ్రాంలో కార్టూన్లు వేయడం శంకర్ వంతయింది. ప్రతిభావంతంగా ఆ పని చేశాడాయన.
భిన్నభిప్రాయాన్ని సహించడం, నువ్వు ఇష్టపడే మనిషిలో లోపాలను ఎత్తిచూపడం లాంటి ఉదారవాదం ఆయన కార్టూన్లలో ఉండేది. నెహ్రూకి చురకలు అంటించడం, ఆయనని వెక్కిరించడం అంతా సుతారంగా మల్లెపూలతో కొట్టినట్టే ఉండేది. ఆ కార్టూన్లన్నీ నెహ్రూ గ్లామర్ని పెంచేవేకానీ, తగ్గించలేదు.
పాతికేళ్లకు పైగా ఆయన ‘శంకర్స్ వీక్లీ’లో వేసిన కార్టూన్లు చూస్తే పైకి కనిపించే సరదాలూ, విసుర్లూ, వెటకారాలన్నింటికీ మధ్య దారం లాగా వో మెథడ్ ఉంటుంది. పేద దేశాల ప్రజల్ని బ్రిటిష్ నాయకులూ, పత్రికలూ ఎప్పుడూ వెక్కిరించేవి. శంకర్ మాత్రం పేదదేశాల పక్షానే నిలబడేవాడు. ఐ.రా.స లోపలా, బయటా మన అలీన విధానానికి యూరోపియన్లు తాటాకులు కట్టేవారు.
శంకర్ మాత్రం ఆ తెల్లదొరల్ని వెవ్వెవ్వె .. అని వెక్కిరించేవాడు. 50, 60 దశకాల్లో ప్రపంచం మీద అమెరికా దండయాత్రలకు అంతూపొంతూ వుండేదికాదు. వియత్నాం, అంగోలా, గ్వాటిమాలా.. ఎక్కడ ఎలాంటి దురాక్రమణ జరిగినా ఇన్స్టెంట్ గా దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కార్టూన్ కనిపించేది. నాజర్, టిటో, నెహ్రూ, హోచిమిన్, కాస్ట్రో అందరూ కార్టూన్లలో హీరో పాత్రల్లోనే కనిపించేవారు. మాక్మిలన్, విల్సన్, నిక్సన్, జాన్సన్, ఫోర్డ్ అందరూ విలన్, బఫూన్ రోల్స్ లో ఉండేవారు.
హిందూ, ముస్లిం మతపిచ్చిగాళ్ల మీద చావుదెబ్బ తీసే కార్టూన్లే వస్తుండేవి. అది కోల్డ్ వార్ కాలం. కమ్యూనిజం పేరెత్తితేనే సకల స్వేఛ్చా స్వాతంత్య్రాలు కోల్పోయినట్టు మిడిల్ క్లాస్ మేధావులు బెంబేలెత్తేవారు. కానీ శంకర్ మాత్రం కమ్యూనిజాన్ని చూసి జడుసుకునేవాడు కాదు. అది నియంతృత్వ పోకడలు పోయినపుడు తిట్టేవాడు.
రష్యా, చైనా వల్ల ఇండియాకి సాయం జరిగితే సంతోషంగా కార్టూన్ వచ్చేది. హంగెరీ, జెకొస్లావేకియాల మీదకి రష్యన్ ట్యాంకులు వెళ్తే నిర్దాక్షిణ్యంగా ఖండించే కార్టూన్లు గీసేవాడాయన. ఇంతగా చెప్పడమెందుకంటే 1940 నుంచి 45 వరకూ హాట్ వార్ కార్టూన్లు, ఆ తరువాత కోల్డ్ వార్ కార్టూన్లు ప్రపంచ పత్రికల్లో వరదల్లాగా వచ్చాయి. మనలాంటి పేదదేశం కార్టూనిస్టు ప్రథమ వీక్షణంలోనే వాటి ప్రేమలో పడ్డం మామూలు.
బ్రిటిష్ కార్టూనిస్టు డేవిడ్ లో బ్రష్ గీతలనీ, హ్యూమన్ ఫక్కీనీ నాటినుండి నేటికీ శ్రద్ధగా ఒక్క ఇంచి కూడా ముందుకు పోకుండా కాపీ చేస్తున్న ఆర్కే లక్ష్మణ్ మనకి సజీవ ఉదాహరణ. శంకర్ మాత్రం అలా కాకుండా గీతల్లో, ఆలోచనల్లో ఆనాడే ఇండిపెండెంట్ గా ఉన్నాడంటే అబ్బురమనిపిస్తుంది. ఆయన పెట్టిన శంకర్స్ వీక్లీ ఒక సంస్థగా ఎన్నడూ లేదు. అది అతి ప్రతిభావంతుల అరాచకపు గుంపు అంటాడు విజయన్.
వీక్లీలో వచ్చిన సెకండ్ జెనరేషన్ చిప్స్ – అబూ అబ్రహం, వొ.వి. విజయన్, కుట్టి, మికీ పటేల్, ప్రకాష్, రేవతీ భూషణ్ – వీళ్లెవరి మీదా శంకర్ తన స్టయిల్ ను రుద్దలేదు. ఎవరి గీత వారిది. విజయన్ కార్టూన్ల వరస చూసి శంకర్ జడుసుకునేవాడు. కానీ అభ్యంతరపెట్టేవాడు కాదు. ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే ఫోర్త్ జెనరేషన్ కార్టూన్ చిప్స్ ఉన్నారు గనక. ఎవర్ని ఎక్కడ ఎందుకు ఎలా జిందాబాద్ అనాలో, డౌన్ డౌన్ అనాలో తెలియాలంటే ఏదో ఒక ప్రపంచ దృక్పథం ఉండాలి.
లేకపోతే కార్టూన్లో గీతలా అక్షరాలకూ వో వరసా వావీ లేకుండా పోతాయి. ఇప్పుడొస్తున్న బొంబాయి, డిల్లీ పత్రికల్లో ప్యూర్, ఎపొలిటికల్ హ్యూమర్ కే పెద్దపీట వేస్తున్నారు. లేదా బండ ప్రాపగాండాకి కార్టూన్లు పనిముట్లు అవుతున్నాయి. పత్రికలు భారీ పరిశ్రమలుగా మారేకొద్దీ కార్టూన్లు, ఆ యంత్రభూతాలకి అలంకారప్రాయ మైన నట్లూ, బోల్టులుగా ఉంటున్నాయి.
బిగ్ బిజినెస్ నీడ పొడుగ్గా ఈ పంచరంగుల కార్టూన్ల మీద పర్చుకుంటోంది. ఇలాంటి బలహీనమైన చేతకాని పరిస్థితిలో మన తాతయ్యని తలుచుకుంటే ఇన్స్ఫిరేషన్ వస్తుంది. పేదదేశాలకి పతాకంగా నిలిచిన కార్టూన్లకి సెల్యూట్ చేస్తే ఇపుడు గీస్తున్న కార్టూన్ల పాపం అయినా ప్రక్షాళన అవుతుంది. అప్పుడప్పుడు – మేమూ గియ్యగలం తాతా… నీకంటే ఇంకా ఎమ్డన్ గా గీస్తాం అని మీసాలు మెలేయ బుద్ధవుతుంది.
pl. read this also ……….. నెహ్రు ఇష్టపడిన కార్టూనిస్ట్ ఈయనే (1)