Taadi Prakash ……………………….
రేప్ లో సెక్సేమీ వుండదు. బూతు కూడా వుండదు. చూసేవాడి రక్తాన్ని వేడెక్కించేదీ అందులో ఏమీ వుండదు. రేప్- ఒక పురుష మృగోన్మాదం. ఒక గుడ్డి ఎనుబోతు పచ్చని చేలో పడడం. ఒక ఆడది మరణభయంతో విలవిలా తన్నుకుని వాంతి చేసుకోడం… నెత్తురు కక్కుకోడం. కాంక్ష, కామోద్రేకం మానవ సహజం. రేప్ మాత్రం పూర్తిగా పశువులకు సంబంధించిన వ్యవహారం… ‘అని ‘బాండిట్ క్వీన్’ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకుడికి మొదటిసారిగా తెలుస్తుంది.
రాజనాల, రావుగోపాలరావు నుంచి కోట శ్రీనివాసరావు దాకా రేప్ అంటే- చీర లాగెయ్యటం, జాకెట్ చించడం. సెక్సంటే మొహం వాచిపోయిన సగటు భారతీయ ప్రేక్షకుడి సౌకర్యార్థం కొంత వక్షస్థలమూ, తొడలూ ప్రదర్శింప చేయడం, పెనుగులాట సమయం పెంచి నేలక్లాసు నుంచి ఈలలూ, హైక్లాసులో ఉత్సాహమూ పొంగేలా చేయడం అందరికీ తెలిసిన చవకబారు ఫార్ములా.
బందిపోటు రాణి ఫూలన్ దేవికి మాత్రం రేప్ అంటే ఒక పసి హృదయాన్ని ఇనప బూట్లతో తొక్కేసిన పీడకల. దర్శకుడు శేఖర్ కపూర్ కి ఆ పీడకలని తెరమీద అలాగే చూపించాలని కల. ‘బాండిట్ క్వీన్’ తీసి దాన్ని నిజం చేశారాయన. అక్షరం ముక్క రాని ఒక పేద పల్లెటూరి పిల్ల తుపాకీ చేబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాల్ని గడగడలాడించిన ఫూలన్ దేవిగా మారడానికి కారణం రేప్. ఎసాల్ట్ అండ్ రేప్.
నిమ్న కులంపై, అసహాయంగా నిలిచిన ఆడతనంపై ఆయుధంగా ప్రయోగించిన రేప్. ఓ పదకుండేళ్ల వెర్రి పిల్ల పూర్తి క్లోజప్. దాని నోటినుంచి ఒక బండబూతు మాట. ముఖమ్మీద ఈడ్చికొట్టినట్టు ప్రారంభమవుతుంది ‘బాండిట్ క్వీన్’. దరిద్రపు నీడల్లా వున్న తలిదండ్రులకి ఓ సైకిలూ, ఒక ఆవూ యిచ్చి, ఆ పసిదాన్ని పెళ్ళి చేసుకుంటాడో యువకుడు. వాడివెంట కన్నీళ్ళతో వెళిపోతుందా బెదురుచూపులు మేకపిల్ల.
ఒకరాత్రి ఆ మొగుడనే మగపశువు ఆ పసిబిడ్డని సాధికారికంగా కుమ్మేస్తుంది. ఏం జరుగుతుందో తెలీని భయంతో వేసిన ఒక ముక్కుపచ్చలారని గావుకేక – సన్నని నుస్రత్ అలీఖాన్ సంగీతంతో కలిసి మనల్ని గుచ్చుకుంటుంది.మన నెత్తుటిలోకి గుండుసూదుల్ని ప్రవేశ పెడుతుంది… ఆ కేకే! అదీ ఆ పసితల్లి తొలి జీవితానుభవం.
పేరు ఫూలన్. దురుసుగా, ధైర్యంగా వుండే ఆ గడుగ్గాయి వాడి చెరనుంచి పారిపోతుంది. ఇంటికి వెళిపోతుంది. ఆమెకి వయసొస్తుంది. ఆడది. తక్కువ కులం పిల్ల. పైగా వయసులో వుంది. అగ్ర కులం కుర్రాళ్ళకి ఇలాంటి ఆడపిల్లల్ని వేధించడం సరదా. వాడుకోవడం హాబీ. ఎదిరిస్తే తన్నడం, తిరగబడితే చంపడం చాలా మామూలు. వాళ్లు ఏడిపిస్తారు. తను తిడుతుంది. జబ్బ పట్టుకు లాగుతారు. ఛీ కొడుతుంది.
అగ్రకులం వారి గారాల అబ్బాయిని తక్కువ కులం ముండ కాదనడమా? సరసాలాడబోయిన గడ్డివాము దగ్గర్నించి ఆమెని బరబరా ఈడ్చుకొస్తాడు రోడ్డుమీదికి. వెయ్… వెయ్… కొట్టు… అన్న అరుపుల మధ్య ఆమెని చెప్పుతో పడపడా కొడతాడు. చాలదన్నట్టు మర్నాడు పంచాయతీ. అది తలఎత్తిన దళిత యువతి అభిమానాన్ని తెగనరికే అగ్రకుల పెద్దల పంచాయితీ, పల్లెజనం అందరి ఎదుట, అపరాధిలా కూచున్న నిస్సహాయ పూలన్ని వేధించిన కుర్రాళ్ళ ఎకసెక్కాలు. నవ్వులు.
నేరం: యువకుడి చిరుకోర్కె తీర్చకపోవడం. శిక్ష వెలి. ఒక ఆప్తునితో గ్రామం విడిచి వెళిపోతుంది. ఆ కొంపలోనూ కుదరక ఎటో పారిపోతుంది. ఒంటరిది. పోలీసులు లాక్కెళతారు. నేరస్తుల్ని బంధించే నాలుగు గోడల మధ్య- పోలీసు వెంట పోలీసు – హింస తర్వాత హింస… ఒక మూకుమ్మడి రేప్ ముగిసిపోతుంది. ఈడ్చిపారేస్తారు స్టేషన్ బైటికి… పోలీసు అధికార్లకి కాల్చిన వీపు చూపించి ఏడ్చి మొత్తుకుంటుంది. తిరుగుబోతుదానా, తప్పుడు ముండా అని తిట్టి పొమ్మంటారు.
ఇష్టంగానో అయిష్టంగానో తప్పకో బందిపోట్ల పంచన చేరుతుంది. కథ మామూలే. ముఠా నాయకుడు చంబల్ గుట్టల్లో ఫూలన్ మీద పడతాడు. ఇరవయ్యేళ్ల యువతి బలిసిన బందిపోటుని ఆపగలదా? ఆ ఘోరం చూడలేక మరో బందిపోటు, ముఠా నాయకుణ్ణి కాల్చి చంపుతాడు. అతను విక్రం మల్లా. బతుకులో తొలిసారి అతని నుంచి ఇంత ఆదరణ పొందుతుంది.
ఆ కొండల్లోనే, బందిపోట్ల మధ్యే ఆమెకింత శాంతి దొరుకుతుంది. తలనిమిరి, తన కళ్ళలోకి ప్రేమగా చూసిన విక్రం మల్లాతో ఫూలన్ ఇష్టంగా పడుకుంటుంది. అతనామెకి శిక్షణ ఇచ్చి ‘ఫూలన్ దేవి’ ని చేస్తాడు. ఈ ఆనందమూ ఆట్టే నిలవదు. బందిపోట్లని వాడుకునే అగ్రకుల మాఫియా బాస్ మల్లాని చంపిస్తాడు. ఫూలన్ తల్లడిల్లిపోతుంది. బాస్ మనుషులు ఆమెని లాక్కుపోతారు. మరొక గుండె పగిలే గ్యాంగ్ రేప్.
తర్వాత…గ్రామం మధ్యనున్న బావినుంచి నీళ్లు తెమ్మని ఆమెకో బిందె ఇస్తారు. బాధతో, అవమానంతో సగం చచ్చివున్న ఫూలన్ ఒంటిపై కంబళినీ మాఫియా బాస్ లాగేస్తాడు. గొడవకి బైటకొచ్చిన గ్రామస్తులంతా చూస్తుండగా… నగ్నంగా ఒక స్త్రీ. నడవలేక నడుస్తూ వచ్చి, నీళ్ళు తోడబోయే సరికి, మాఫియా బాస్ వచ్చి ఆమె జుట్టు పట్టుకుని, “ఇదే బందిపోటు ఫూలన్ దేవి, చూడండి, ఈ దిక్కుమాలిన దానిని” అని నీచంగా తిట్టి నగ్నంగా వున్న పూలన్ని మరింత హింసిస్తాడు.
ప్రతీకారేచ్ఛతో దహించుకుపోతున్న ఫూలన్ దేవి ఇక ఎత్తిన తుపాకీ దించదు. శత్రువుని కనికరించదు. తనని చెరిచిన బెహ్మేయ్ గ్రామంలోని అగ్రకులం (గుజ్జర్లు) వాళ్లని వరసబెట్టి కాల్చిపారేస్తుంది. ప్రజల్లో ఫూలన్ పేరు మోగిపోతుంది. దళితుల్లో ఆమె పలుకుబడి పెరుగుతుంది. ఒక ఆడ బందిపోటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల్నీ, పోలీసులనీ వెక్కిరిస్తూ, అగ్రకులాల వారికి నిద్ర లేకుండా చేయడంతో దొంగ ఎన్ కౌంటర్లు మొదలవుతాయి. గ్రామస్తుల్ని వేధించి, బందిపోట్ల జాడ కనుక్కొని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా పోలీసులు క్రూరంగా చంపేస్తారు.
చంబల్ కొండల్లో, చెరువుల్లో తుప్పల్లో ఎక్కడ చూసినా ఫూలన్ దేవి సహచరుల శవాలే. పురుషాధిపత్యమూ, అగ్రకుల దురహంకారంపై తిరగబడి మగాళ్ళ సాయంతోనే మాడు పగలగొట్టిన ఫూలన్ దేవి మళ్లీ ఒంటరిదై పోతుంది. జన సంచారంలేని ఆ దుమ్మురేగే గుట్టల్లో దీనంగా మిగిలిపోతుంది. ఒక ఆప్తుని సలహాపై చివరికి- తుపాకీ కింద పెడుతుంది. ప్రభుత్వానికి లొంగిపోతుంది.
అతి, మెలో డ్రామా, ఓవర్ యాక్షన్ ఎక్కడా వుండదు. ఫూలన్ జీవిత సంఘటనలు ఒకటొకటే పచ్చిగా, వాస్తవికంగా, ఒక్కోచోట సాదాసీదాగా కళ్ళముందు కదిలిపోతుంటాయి. ఫూలన్ లాగే శేఖర్ కపూరూ రాజీ పడకూడదనే నిశ్చయంతో సినిమా తీశారు. రేప్అనగానే సెక్స్ సన్నివేశాలనుకొని సంబరపడి సినిమా కెళితే మిగిలేదినిరాశే. సెన్సారు వాళ్ళు కొంత కత్తిరించారు. ఆ కట్లలోనూ బూతేమీ లేదు. వున్నదంతా భయోత్పాతమే.
భారతీయ తెరమీద స్త్రీని పూర్తిగా నగ్నంగా చూపించిన తొలి సినిమా ఇది. అది వాస్తవ సంఘటన గనక సెన్సారు వాళ్ళూ అనుమతించారు. కథలో కులవైషమ్యం ప్రధానమైంది గనక గొడవలు జరక్కుండా వుండడం కోసం సెన్సారు కొంత జాగ్రత్త పడింది. సెన్సార్ కట్లను శేఖర్ కపూర్ గట్టిగా వ్యతిరేకించినా, ఆ కట్ల వల్ల సినిమాకి పెద్దగా వచ్చిన లోటు కనబడదు. నగ్నంగా వూరేగింపు, బెహ్మయ్ ఊచకోత, గ్యాంగ్ రేప్ సన్నివేశాలన్నీ కలిపి ఒక నిమిషం ఇరవై సెకన్ల చిత్రాన్ని మాత్రమే కత్తిరించారు., ఆ బీభత్సం భారతీయ ప్రేక్షకుడి ఆరోగ్యానికి మంచిది కాదని భావించారు.
నగ్న సన్నివేశం మనల్ని షాక్ చేస్తుంది. అంతకంటే ఎక్కువగా బాధిస్తుంది. “ఈ సినిమా మీకు వినోదం కలిగించాలని కాదు, మిమ్మల్ని బాధించాలని అనుకున్నా” నని శేఖర్ కపూర్ చెప్పారు. అది సాధించారు కూడా. యు.పి, మధ్యప్రదేశ్ పల్లెల్లో, పేదజనమూ, బందిపోట్లు మాట్లాడే బూతులు నిండిన భాషనే సినిమాలో వాడారు. దాదాపు అన్ని పాత్రలూ పచ్చి బూతులతో జీవభాషలోనే మాట్లాడతాయి.ఇది అసభ్యమనీ, అశ్లీలమని శివసేన పార్టీవాళ్లు కాకిగోల చేశారు. థియేటర్ల ముందు ధర్నాకి దిగారు.
పెద్ద నటి మాధురీదీక్షిత్ నుంచి, రంగీలా ఊర్మిళ వరకూ, రమ్యకృష్ణ నుంచి ఆమని దాకా హీరోయిన్లంతా పరమ జుగుప్సాకరంగా వూగుతూ, ఒకే ఒక అర్థం వున్న పాటలకు అంతే నీచంగా అడుగులేస్తూ, గెంతుతూ దున్నేస్తూ వుంటే భారతీయ సంస్కృతీ పరిరక్షక భటులకు అశ్లీలం అన్పించక పోవడం ఆశ్చర్యమే..శేఖర్ కపూర్… ప్రయోగం ఏమీ చేయలేదు. ఇపుడు మన మధ్యే వున్న ఒక మహిళ బతుకులో దుర్మార్గాన్ని దుర్మార్గంగా, సాంఘిక క్రౌర్యాన్ని క్రూరంగానే చూపించాడు.
రాంగోపాల్ వర్మ రంగీలా ఎందుకు సూపర్ హిట్ అయిందో, బాండిట్ క్వీన్, ‘ఎందుకంత హిట్ కాలేదో బుద్ధిలేని వాళ్ళకి కూడా అర్థమయ్యే విషయమే. బాండిట్ క్వీన్ పగ, ప్రతీకారం, రేప్ లు , మర్డర్లు అన్నీ వున్న చిత్రమే. వాస్తవానికి కట్టుబడటం ఒక్కటే శేఖర్ కపూర్ నేరం. నికృష్టమయిన జీవిత గాథే అయినా తెరకెక్కించేటపుడు అది కళ కావాలని తపించడమే అతని పాపం! ‘బేసిక్ ఇన్స్టింక్టు’తో ఆడదాని మాంసాన్ని ప్రపంచమంతా అతిచవగ్గా అమ్మారు అమెరికా వాళ్ళు.
మనం కాస్త గర్వపడదాం.. మన శేఖర్ కపూర్ ఒక మంచి సినిమా తీశాడు.రేప్ సన్నివేశాల్లో బ్లడ్ ప్రెషర్ పెరిగే డబడబల సంగీతంలేదు. పాకిస్తాన్ సంగీత దర్శకుడు సుస్రత్ అలీఖాన్ బాధ ఆలాపనై నరాల తీగల్లో ప్రవహిస్తుంది. అశోక్ మెహతా కెమెరా చంబల్ లోయ సౌందర్యాన్నీ, దరిద్రగొట్టు బతుకు దైన్యాన్నీ అద్భుతమైన లాంగ్ షాట్లలో, క్లోజప్పుల్లో చూపిస్తూ కథ చెబుతుంది.
సినీ నటులెవరూ ఈ చిత్రంలో కనిపించరు. ఆ పేద మురికి మనుషులే, ఆ బందిపోటు దొంగలే సాక్షాత్తూ మన కళ్ళ ముందుంటారు. మాలాసేన్ రాసినట్టుగానే ఫూలన్ జీవిత సంఘటనలని తారీఖుల్తో సహా చూపించడంవల్ల సినిమా కొన్నిచోట్ల డాక్యుమెంటరీలా, కొంత పేలవంగా అన్పిస్తుంది.
మామూలు వ్యాపార హింసా చిత్రాలకు అలవాటు పడిపోయిన మనకి ఇందులో సజెస్టివ్ గా చూపిన రేప్ లోని హింస, బీభత్సం పెద్ద విశేషంగా అన్పించకపోవచ్చు..ఫూలన్ దేవిగా రాణించిన సీమా బిశ్వాస్ కి ఇది తొలి సినిమా అంటే నమ్మలేం. బాండిట్ క్వీన్ చూసిన ఫూలన్ దేవి, సినిమా అయిపోగానే సీమా బిశ్వాస్ భుజాలు పట్టుకుని, “నేను జీవితం లోనరకయాతన లాంటి బాధలు అనుభవించాను. నువ్వీ సినిమాలోనే అన్ని బాధలూ పడ్డావు” అని అన్నారు. ఈ అభినందనని తానెన్నటికీ మరిచిపోలేనని సీమ అన్నారు.
మాసూమ్, మిస్టర్ ఇండియా లాంటి అందమైన ప్రేమ నిండిన వినోదాత్మక చిత్రాలు తీసిన శేఖర్ కపూర్ ఇలాంటి షాక్ సినిమా ఇవ్వడం భారత సినీరంగాన్ని ఒక కుదుపు కుదిపింది. శేఖర్ కపూర్ అన్ని సంప్రదాయ పద్ధతుల్ని తుంగలో తొక్కారు. బందిపోట్లని హీరోలని చేశారు అన్న విమర్శ పూర్తిగా అన్యాయమే. రెండు వర్గాల సంఘర్షణలో నలిగిపోయిన యువతి దిక్కుమాలిన బతుకు చిత్రం మాత్రమే ఇది. దర్శకుడు నిరాపేక్ష గానే కాదు, నిర్దయగాకూడా ఈ సినిమా తీశాడు. సీరియస్ సినిమా ప్రేక్షకుడికి ఇదొక మస్ట్.
(1996 ఫిబ్రవరిలో బాండిట్ క్వీన్ సినిమా మీద ఆంధ్రభూమి దినపత్రికలో రాసిన రివ్యూ ఇది.)