Historical film ………..
‘విశ్వనాథ నాయకుడు’ భారీ చారిత్రక చిత్రం. 1987లో విడుదలైన ఈ సినిమాకు లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. విజయనగర సామ్రాజ్య కాలంలోని చారిత్రక సంఘటనల ఆధారంగా సినిమాను తీశారు.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో మధురై పాలకుల తిరుగుబాటు,ఆ క్రమంలో తన తండ్రి (నాగమ నాయకుడు) చేసిన తప్పును సరిదిద్ది, చక్రవర్తి పట్ల తన విధేయతను చాటుకున్న విశ్వనాథ నాయకుడి శౌర్యగాథే ఈ చిత్రం.కథను యామినీ సరస్వతి,కొండముది రాశారు..యామిని సరస్వతి,కొండవీటి వెంకట కవి డైలాగ్స్ రాశారు.
సూపర్ స్టార్ కృష్ణ విశ్వనాథ నాయకుడిగా పవర్ఫుల్ పాత్రలో నటించారు.భారీ డైలాగులు కూడా కృష్ణ అవలీలగా చెప్పేసారు. అక్కడక్కడా పద్యాలు కూడా పెట్టారు. శివాజీ గణేషన్ నాగమ నాయకుడిగా తనదైన నటనతో మెప్పించారు.జగ్గయ్య కంచుకంఠం ఆయనకు అదనపు బలం. కృష్ణంరాజు శ్రీకృష్ణదేవరాయలుగా రాజసం ఉట్టిపడేలా కనిపించారు.
ఆస్థాన నర్తకిగా, విశ్వనాథ నాయకుని ప్రియురాలిగా జయప్రద బాగానే చేశారు. ఆమె గురువుగా రామకృష్ణ నటించారు. ఇతర పాత్రల్లో ప్రభ,సుమలత,శరత్ బాబు ,కేఆర్ విజయ, ప్రభాకరరెడ్డి వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు.
దాసరి నారాయణరావు ఈ చారిత్రక కథను భారీ బడ్జెట్తో, దృశ్యకావ్యంగా మలిచారు. అప్పట్లో ఇలాంటి పీరియడ్ డ్రామాలు రావడం అరుదు.శివాజీ,కృష్ణ ,కె ఆర్ విజయల మధ్య వాద సంవాద దృశ్యాలు,జయప్రదను కృష్ణ కాపాడే సన్నివేశాలు, కొండపల్లి పై దండ యాత్ర ..యుద్ధ సన్నివేశాలు బాగా తీశారు.
శివాజీ గణేశన్ మారువేషంలో కొడుకు కృష్ణ వద్దకు వచ్చే సన్నివేశాలు, ఆ సందర్భంగా ఇద్దరి మధ్య వాద సంవాద సన్నివేశాలు దాసరి హృద్యంగా తెరకెక్కించారు. శివాజీ, కృష్ణల నుంచి గరిష్ట స్థాయిలో నటన ను రాబట్టారు. రంగనాథ్ శివాజీల మధ్య సంభాణలు ఆకట్టుకుంటాయి.
తండ్రిని బంధించి తీసుకొస్తానని కృష్ణ ముందుకొచ్చిన సీన్ , విజయోస్తు అని దీవించమని కేఆర్ విజయను కృష్ణ అడిగే సీన్,పతి భిక్ష పెట్టమని ఆమె కృష్ణను అడిగే సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా లో నాటకీయ సన్నివేశాలు ఎక్కువ. వాటికి తగ్గట్టుగానే కొండవీటి వేంకటకవి డైలాగులు కుదిరాయి.
క్లైమాక్స్ చిత్రీకరణ , డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి.జె.వి. రాఘవులు అందించిన సంగీతం, ముఖ్యంగా శాస్త్రీయ నృత్య గీతాలు ప్రేక్షకులను అలరించాయి.సినిమా నిడివి ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేది
‘లలిత కళా అనురాగ’… ఇది శాస్త్రీయ నృత్య నేపథ్యంలో సాగే గొప్ప గీతం. దీనిని వి. రామకృష్ణ, మాధవపెద్ది రమేష్, ప్రకాష్ రావు ఆలపించారు.’మరువనంటోంది మనసు’: కృష్ణ .. జయప్రద మధ్య సాగే ఈ మెలోడీ పాట అప్పట్లో మంచి ఆదరణ పొందింది.‘ఇది నాట్య నీరాజనం’ పి. సుశీల పాడిన ఈ గీతం సినిమాలోని నాట్య ప్రాధాన్యతను చాటుతుంది.‘ఇటు నారి అటు నారి’ ఈ పాటను పి. సుశీల, వాణి జయరాం కలిసి పాడారు.ఈ పాటను కృష్ణంరాజు సుమలత ,ప్రభలపై చిత్రీకరించారు.
బాహుబలి వంటి ఆధునిక చారిత్రక చిత్రాలకు ముందే, తెలుగు తెరపై భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్నచిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది..ముఖ్యంగా వి.ఎస్.ఆర్ .స్వామి సినిమాటోగ్రఫీ ఈ సినిమా కు పెద్ద ప్లస్ పాయింట్. పాటలు, కీలక మైన సన్నివేశాలను అద్భుతంగా తెర కెక్కించారు. యుద్ధ సన్నివేశాలు కూడా బాగుంటాయి. అప్పట్లో ఆధునిక కెమెరాలు, గ్రాఫిక్స్ లేకపోయినా, తన మేధస్సుతో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ సృష్టించారు.
భారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. నిర్మాత వడ్డే రమేష్ కి నిరాశే మిగిలింది.నైజాం ఏరియాలో ఈ సినిమా పంపిణీ హక్కుల విషయంలో ఇద్దరు పంపిణీదారుల మధ్య గందరగోళం నెలకొంది.దీనివల్ల సినిమా విడుదల రోజున అనుకున్నన్ని థియేటర్లలో ఒకేసారి విడుదల కాలేకపోయింది.
దర్శకుడు దాసరి నారాయణ రావు నాగమ నాయకుడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, విశ్వనాథ నాయకుడి పాత్రను కొంతవరకు తగ్గించినట్లు అనిపించడం కూడా అభిమానుల్లో అసంతృప్తికి కారణమైందని అంటారు.
సుశీల కి ఉత్తమ గాయని గా, VSR స్వామి ఉత్తమ ఛాయాగ్రాహకులు గా , భాస్కర రాజు ఉత్తమ కళా దర్శకులుగా నంది అవార్డులు అందుకున్నారు. ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది. చూడని వారు చూడవచ్చు.

