Subramanyam Dogiparthi…… ………………….
గ్లామర్+విషాద పాత్రలకు న్యాయం చేయటంలో సావిత్రి, వాణిశ్రీల తర్వాత తానే అని జయసుధ ఈ సినిమా ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కెరీర్ ప్రారంభంలో జ్యోతి కావచ్చు. తర్వాత కాలంలో ఈ శివరంజని కావచ్చు..పేరు వచ్చాక నటించిన ప్రేమాభిషేకం,మేఘ సందేశం కావచ్చు.. మరి కొన్ని సినిమాలు కావచ్చు నా మాటను కన్ఫర్మ్ చేస్తాయి.
1978 సెప్టెంబర్ 27 న రిలీజ్ అయిన ఈ శివరంజని ద్వారా జయసుధ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.. అసలీ సినిమాకు శివరంజని అనే టైటిల్‌ని ఎంపిక చేసుకున్నందుకు దాసరిని మెచ్చుకోవాలి. సంగీతంలో ఒక రాగమయిన శివరంజని ని మ్యూజికల్ హిట్ సినిమాకు ఎంచుకోవటం గొప్ప విషయం.
ఈ సినిమాను మ్యూజికల్ హిట్ చేసిన పాటల్లో ఒకటి ‘అభినవ తారవో నా అభిమాన తారవో అభినయ రసమయ కాంతి ధారవో’ … నవ రసాలతో ‘శివరంజని’ నటనా కౌశల్యాన్ని ఆమె ఆరాధకుడు అభివర్ణించే పాట.సి నారాయణరెడ్డి గారి అద్భుతమైన సాహిత్యం.సాహిత్య పిపాసులు ఒకటికి రెండు సార్లు విని/చదివి ఆస్వాదించవచ్చు.
సాహిత్యానికి సొబగులు అద్దింది రమేష్ నాయుడు సంగీతం,బాలసుబ్రమణ్యం గాత్రం. వీటికి జత కలిసింది దాసరి చిత్రీకరణ . . ఎంతటి గట్టి గుండెనయినా కదిపేది ‘జోరు మీదున్నావు తుమ్మెదా ఈ జోరెవరి కోసమే తుమ్మెదా… ఇల్లిల్ల తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా’ పాట . సినిమాలో శివరంజనికి జరగబోయేది ముందే హింటిచ్చిన పాట.
ఈ పాటను వింటుంటుంటే గుండె భారంతో నిండిపోతుంది . ఈ పాటలోని సంగీత సాహిత్యాలు అంతటివి . నాకెంతో ఇష్టమైన పాట. ఇంకో గొప్ప పాట వేటూరి వారు వ్రాసిన ‘నవమి నాటి వెన్నెల నేను… దశమి నాటి జాబిలి నీవు కలుసుకున్న ప్రతి రేయీ కార్తీక పున్నమి రేయి’ సుశీలమ్మ , బాలసుబ్రమణ్యంలు పాడారు . మెత్త మెత్తగా మనసును తాకుతుంది ఈ పాట.
ఈ సినిమాలో ఈ మూడు పాటలు కాకుండా ఉన్న మరో నాలుగు పాటల్నీ దాసం గోపాలకృష్ణే వ్రాసారు.
వాటిల్లో చాలా బాగుండేది ‘మా పల్లె వాడలకు కృష్ణమూర్తి నువ్వు కొంటె పనులకొచ్చావా’ కృష్ణమూర్తి పాట. యస్ పి శైలజ , బాలసుబ్రమణ్యంలు పాడారు . మరో పాట కె వి చలం పాత్ర పాడే పాట . బాగానే పాపులర్ అయింది . ‘మీ అమ్మవాడు నాకోసం ఈని ఉంటాడు… మా బాంబువాడు నీకోసం కనీ ఉంటాడు’ పాట.
ఈ పాటలో కాంతారావు తళుక్కుమంటారు. ‘పాలకొల్లు సంతలోన పాపాయమ్మో పాపాయమ్మ , చందమామ వచ్చాడమ్మ తొంగి తొంగి నిను చూసాడమ్మ’ పాటలు కూడా బాగుంటాయి. సంగీత సాహిత్యాల తర్వాత మళ్ళా నటనకు వస్తే మోహన్ బాబుని అభినందించాలి.
ఈ పాత్రలో మోహన్ బాబు కన్నా మరెవరూ బాగా నటించలేరు అన్నంత గొప్పగా నటించారు మోహన్ బాబు. లేచి తన్నాలని అనిపిస్తుంది అతని నటన . అంత సాఫ్ట్ క్రౌర్యంతో నటించారు . ఇతర పాత్రల్లో గోకిన రామారావు, మాడా,నిర్మలమ్మలు నటించారు.
ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఈ సినిమా ద్వారా హరిప్రసాద్ , జయసుధ చెల్లెలు సుభాషిణి అరంగేట్రం చేశారు. మొదటి సినిమా అయినా బాగా చేసారు.సినిమా తారలకు పిచ్చిఅభిమానులు ఎలా ఉంటారో దాసరి ఈ సినిమాలో బాగా చూపించారు. చాలామంది తారల్ని చూపించారు దాసరి. శివరంజనికి సన్మాన సభ పేరుతో సావిత్రి , జయంతి , జానకి , ఫటాటప్ జయలక్ష్మి , ప్రభలను చూపించారు.
వాళ్ళతో పాటు ANR , నగేష్ , ప్రభాకరరెడ్డి , శరత్ బాబు , రమాప్రభ , సి యస్ రావులు కూడా తళుక్కుమంటారు . ఈ సినిమాకు కధ , మాటలు , స్క్రీన్ ప్లే , నిర్మాణం , దర్శకత్వం అన్నీ దాసరే . ఎన్నయినా భరించగల పర్సనాలిటీ కదా !
తూర్పుగోదావరి జిల్లాలోని కట్టమూరు గ్రామంలో ఔట్ డోర్ షూటింగ్ చేసారు. మూడు కేంద్రాలలో వంద రోజులు ఆడింది. బెంగుళూరు కావేరి థియేటర్లో 52 వారాలు ఆడింది . తమిళంలోకి నచ్ఛిత్రం అనే టైటిలుతో రీమేక్ అయింది . జయసుధ పాత్రను శ్రీప్రియ నటించగా , హరిప్రసాద్ , మోహన్ బాబులు తమ పాత్రలను రిపీట్ చేసారు. దాసరే దర్శకత్వం వహించారు . తమిళంలో కూడా హిట్టయింది.
ప్రధాన పాత్ర శివరంజని చనిపోయినా సినిమా హిట్టయిందంటే ఎంత గొప్ప సినిమాయో చెప్పాల్సిన అవసరం లేదు.దాసరి ఈ సినిమా కథ రాయడానికి ప్రేరణ మహా నటి సావిత్రి జీవితమే అంటారు.శివరంజని సినిమాలోని కొన్ని సన్నివేశాలు సావిత్రి నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. సావిత్రి తన జీవితంలో జరిగిన ఎన్నో ఘటనలను తీరిక దొరికినప్పుడల్లా దాసరికి చెప్పేవారట. వాటిల్లో ఒక ఘటన దాసరిని బాగా కదిలించింది.
అదే శివరంజని సినిమా తీయడానికి ఆయన్ని ప్రేరేపించింది. ఈ సినిమాకు హీరో గా తొలుత చిరంజీవి ని అనుకున్నారు. తర్వాత ఆ ఛాన్స్ ఆయన రూమ్మేట్ హరిప్రసాద్‌కు దక్కింది. దాసరి కి ఈ టైటిల్ అంటే చాలా ఇష్టం..తర్వాత రోజుల్లో అదే పేరుతో సినిమా వీక్లి ని తీసుకొచ్చారు. అదొక కొత్త ట్రెండ్ సృష్టించింది.
పాత తరంలో బహుశా ఈ సినిమాను చూడనివారు ఉండరు . నేనయితే ఎన్ని సార్లు చూసి ఉంటానో ! టివిలో వస్తే కాసేపయినా చూడాల్సిందే . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . చూడనివారు అర్జెంటుగా చూసేయండి . An unmissable , emotion-filled , musical movie.