ప్రధాని మోడీ పేరు మీద ఒక కొత్త వెబ్సైట్ (modistory.in) ప్రారంభమైంది. వాలంటీర్ గ్రూప్ ఈ వెబ్సైట్ ను రూపొందించింది. జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి ఈ సైటును ఆవిష్కరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజకీయ జీవితం .. ప్రజా జీవితం లోని కొన్ని ఆసక్తికరమైన కథనాలను ఈ సైట్ లో పొందుపరిచారు.ఇందులో ఉన్న కథనాలు ముందెన్నడూ విన్నవి కాదు. గుజరాత్‌కు చెందిన డాక్టర్ అనిల్ రావల్, 1980 దశకంలో మోడీ అనుభవాలను కూడా ఈ సైటులో పంచుకున్నారు.
అప్పుడప్పుడే మోడీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఓ రోజు గుజరాత్‌కు చెందిన డాక్టర్ అనిల్ రావల్ అనే వ్యక్తి మోడీతో కలసి ప్రయాణం చేశారు. ఆ సమయంలో రాజకీయాల గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా రావల్.. మోడీ ని “సమాజంలో చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతి కోసం మీరు ఎలా కట్టుబడి ఉంటారు..?” అని ప్రశ్నించారు.
ఇందుకు మోడీ సమాధానం ఇలా చెప్పాడు.. ”ఒక సారి నేను ఓ మురికివాడలో ఉన్న స్వయంసేవక్ ఇంటికి వెళ్లాను. అది చాలా చిన్న ఇల్లు. ఆ ఇంట్లో స్వయంసేవక్ తన భార్య, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. నేను వెళ్లగానే అతిధి మర్యాదగా నాకు పళ్లెంలో సగం రొట్టె, చిన్న గిన్నెలో పాలు తీసుకొచ్చి ఇచ్చారు. తల్లి ఒడిలో కూర్చున్నఆ బాలుడు పాలగిన్నె వైపు చూస్తున్నాడు.
నాకు వెంటనే అర్థమైంది ఆ పాలు ఆ పిల్లవాడి కోసం ఉంచినవి అని. నేను ఆ సగం రొట్టెను నీళ్లతో తినేసి పాలు వదిలేశాను. ఆ తర్వాత ఆ తల్లి పాలగిన్నెను ఆ పిల్లోడికి ఇచ్చింది. ఆ చిన్నోడు వాటిని గడగడా తాగేశాడు. అప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే నేను నిర్ణయించుకున్నా. సమాజంలోని చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతి కోసమే నా ఈ జీవితం అంకితం చేయాలని..!”
ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్ అనిల్ రావల్ చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. కేవలం అనిల్ మాత్రమే కాదు.. మోడీ తో అనుబంధం, పరిచయం ఉన్న ఎంతోమంది తమ అనుభవాలను ఈ సైట్ లో పంచుకున్నారు. ఇలాంటి స్ఫూర్తిదాయక అనుభవాలతో కూడిన ఇపుడు మోడీ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.
మోడీ గురించి ఎంతోమందికి తెలియని అరుదైన,ఆసక్తికరమైన ఘట్టాల సమాహారమే ఈ వెబ్సైట్. గుజరాత్‌లోని వాద్నగర్లో మోడీ చదువుకున్న పాఠశాల ప్రిన్సిపాల్ రాస్ బిహారీ మణియార్, 90వ దశకంలో ఆయనకు ఆశ్రయం కల్పించిన శారదా ప్రజాపతి వంటి వారు తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు.
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ వంటి మరికొందరు ప్రముఖులు మోడీ తో తమ అనుబంధం గురించి వివారించారు. ఎన్నికల ప్రచార సమయంలో మోడీ ఆలోచనలు, విద్యార్ధిగా దేశ సేవ,సైన్యంపై ఆయన అభిప్రాయాలను ఇందులో తెలియచేశారు. ఈ వెబ్సైట్ గురించి పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు. పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు ఈ సైట్ పై తమ అభిప్రాయాలను వివరిస్తున్నారు.