ఒడిశా బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ చంద్ర పాణిగ్రాహి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఒడిశా అసెంబ్లీలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పాణి గ్రాహి శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో తోటి సభ్యులు అడ్డుకున్నారు. దీంతో సభలోఉద్రిక్తత నెలకొంది. సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పాణిగ్రాహి ఆరోపించారు. రాష్ట్రంలో వరిధాన్యం సేకరణ పై మంత్రి రణేంద్ర ప్రతాప్ స్వైన్ ప్రకటన చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. పాణిగ్రాహి శానిటైజర్ బాటిల్‌ను తీసుకుని అందులో ఉన్న ద్రవాన్ని త్రాగడానికి ప్రయత్నించాడు. అది గమనించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి బిక్రమ్ కేషరి అరుఖా, మరికొందరు ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు.
ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను పెడ చెవిన పెడుతోందని.. వరి సేకరణలో విఫలమైందని పాణిగ్రాహి విమర్శించారు “రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే . మీరు ఏమి చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారికి జవాబు చెప్పలేం .. కాబట్టి, చనిపోవడమే మంచిది ” అని ఎమ్మల్యే తన ప్రయత్నాన్ని సమర్ధించుకున్నారు. కాంగ్రెస్ సభ్యులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించి వెల్ లోకి దూసుకుపోయారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.ఆ తర్వాత మంత్రి సమాధానం ఇచ్చారు. రైతులకు న్యాయం చేస్తామని..ధాన్యం సేకరణలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒక సమస్యపై ఎమ్మెల్యే ఆత్మహత్య యత్నం చేయడం అది అసెంబ్లీ లో కావడం విశేషం. తనకు ఏదైనా జరిగి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించేదని ఆ బిజెపి ఎమ్మెల్యే సభ వెలుపల మీడియాకు చెప్పారు.