Psychological problems………………………………
సాధారణ వయోవృద్ధులతో పోలిస్తే.. కొవిడ్(Covid) బారిన పడినవారిలో కుంగుబాటు(Depression), ఆందోళన(Anxiety) తదితర మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనం తెలియ జేస్తున్నది.
ఆర్థిక ఇబ్బందులూ చుట్టుముడతాయని అంచనా వేసింది. మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, ఆర్థిక పరిస్థితులపై కరోనా తక్షణ, దీర్ఘకాల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకుగానూ 52- 74 ఏళ్ల మధ్య వయస్సు గల 5,146 మంది వ్యక్తుల నుంచి వివిధ ప్రశ్నలు అడిగి సమాచారాన్నిసేకరించారు.
ఇందులో పాల్గొన్న వారు కరోనాకు ముందు, వైరస్ ఉద్ధృత దశ సమయంలో రెండుసార్లు తమ సమస్యలు ఏమిటో వాటి వివరాలు అందజేశారు.ఈ అధ్యయనం ప్రకారం.. 2020 మధ్యకాలంలో కరోనా సోకని 22 శాతం మందితో పోలిస్తే.. కొవిడ్ సోకినట్లు భావిస్తోన్న వారిలో 49 శాతం మంది కుంగుబాటు లక్షణాలు కలిగి ఉన్నారని తేలింది. మహమ్మారి లేని వారిలో ఆరు శాతంతో పోలిస్తే.. వైరస్ బారిన పడినవారిలో 12 శాతం మందిలో ఆందోళన ఉందని వెల్లడైంది.
అదే ఏడాది చివర్లో నిర్వహించిన కొనసాగింపు సర్వే ప్రకారం.. కరోనా సోకిన వృద్ధుల్లో కుంగుబాటు, ఆందోళన లక్షణాలు.. ఇతరుల్లోని 33 శాతం, 7 శాతంతో పోలిస్తే.. 72 శాతం, 13 శాతంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి సోకనివారిలో 20 శాతంతో పోలిస్తే.. పాజిటివ్‌గా తేలిన వృద్ధుల్లో 40 శాతం మంది కరోనా ముందు కంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వారిలో ఒంటరిగా ఉన్నామన్న భావన సైతం రెండింతలు పెరిగింది.’కొవిడ్ సోకిన వృద్ధులు.. సాధారణ వృద్ధులతో పోలిస్తే.. నిరాశ, ఆందోళన, ఒంటరితనంతో పాటు ఆర్థిక ఇబ్బందులు అనుభవించారు. కరోనా తీవ్ర దశతోపాటు తర్వాత ఆరు నెలల వరకు ఇవి స్పష్టంగా కనిపించాయి. కొవిడ్ నియంత్రణ చర్యలు, వ్యక్తిగత స్వేచ్ఛపై పరిమితులు.. మానసిక సమస్యల పెరుగుదలకు కారణం కావచ్చు’ అని అధ్యయనకర్త లండన్ యూనివర్సిటీ కాలేజ్ కి చెందిన ఎల్లీ ఐయోబ్ తెలియ జేశారు.
వైరస్ ప్రతికూల ప్రభావం.. ప్రజల్లో దీర్ఘకాలం, విస్తృతంగా ఉంది.. ఈ నేపథ్యంలో.. ఎవరైనా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే వైద్యులను సంప్రదించాల’ని ఆయన సూచించారు.అమెరికాకు చెందిన పీఎన్‌ఏఎస్(PNAS) జర్నల్‌లో ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి