షేర్ల కొనుగోలు కు ఇది సరైన సమయం కాదు. ఈ సమయంలో షేర్లు కొనుగోలు చేస్తే రిస్కు ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగి లాభాలు స్వీకరిస్తున్నారు. మార్కెట్ చిన్నగా కరెక్షన్ దిశగా పయనిస్తోంది. ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ముందు మార్కెట్లు ఊగిసలాడుతుంటాయి. గత రెండేళ్లలో ఒకసారి ఆర్ధిక మందగమనం … తర్వాత కరోనా మహమ్మారి దెబ్బతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. అది ఇపుడిపుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి బడ్జెట్ పైనే కేంద్రీకృతమైంది. మరో వారం రోజుల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు.
ఈ బడ్జెట్ మార్కెట్ ను మెప్పించేలా ఉంటుందా అన్న గ్యారంటీ ఏమి లేదు. బడ్జెట్లు మార్కెట్ ను మెప్పించాలన్న రూల్ కూడా లేదు. యేవో కొన్ని అంశాలు మాత్రమే మార్కెట్ వర్గాలకు నచ్చుతాయి. ఒక్కోసారి అసలు నచ్చక పోవచ్చు. అలాంటి పరిస్థితి వస్తే మార్కెట్ పతనం అనివార్యం. గతంలో కూడా ఇలా చాలా సార్లు జరిగిన ఉదాహరణలున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్లు ముఖ్యంగా చిన్న ఇన్వెస్టర్లు కొనుగోళ్ళకు దిగితే నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. నాలుగైదురోజుల క్రిందటి వరకు మార్కెట్ పెరుగుతూనే వచ్చింది. 50 వేల మార్కు ను దాటి కొత్త రికార్డు సృష్టించింది. గత రెండు నెలల కాలంలోనే మార్కెట్ 47 వేలనుంచి 50 వేలకు చేరుకోవడం గొప్ప విషయమే.
ఆర్థికాభివృద్ధి తదితర అంశాలను పట్టించుకోకుండా భవిష్యత్ పై ఆశలతోనే మార్కెట్ పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు చేస్తూ మార్కెట్ ను పెంచారు. మార్కెట్ ఇప్పటికే ఓవర్ బాట్ పొజిషన్ కు చేరుకుంది. కాబట్టి ఏక్షణంలో నైనా ఒక కుదుపు రావచ్చు. అదే జరిగితే మార్కెట్ పతనం అయ్యే అవకాశాలు లేకపోలేదు. నిరుడు కూడా బడ్జెట్ కు ముందు సెన్సెక్స్ రికార్డు స్థాయిలో దూసుకుపోయింది. తర్వాత పతన దిశలో పడింది. కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటె మంచిది. మార్కెట్ లో మదుపు చేయకుండా … ఏయే షేర్ల ధరలు తగ్గితే కొనుగోలు చేయవచ్చో పరిశీలిస్తూ ఉండటం శ్రేయస్కరం. బడ్జెట్ తర్వాత మార్కెట్ గమనం ఎలాఉంటుందో ఇపుడే అంచనా వేయలేం కాబట్టి కొనుగోళ్ల తరుణం కోసం వేచి ఉండటమే మంచిది. లేదా ధరలు పెరిగిన షేర్లు దగ్గర ఉంటే అమ్మేసి లాభాలు జేబులో వేసుకోవడం ఉత్తమం.
—————–KNM