Many controversial stories……………………………..
ఇదొక వివాదాస్పద కథనం … మండోదరి మహా పతివ్రత అంటారు. అయిదుగురు పతివ్రతల్లో ఆమె ఒకరంటారు. అందుకు భిన్నంగా ఉన్న కథనమిది . లంకాధిపతి రావణుడి భార్యగా మాత్రమే మండోదరి మనందరికీ తెలుసు. సీతను అపసంహరించుకుని వచ్చినప్పుడు ఆమె తప్పని భర్తను వారించిందట. నీతిగా పరిపాలించాలని నిరంతరం పట్టుబట్టేదట.
ఇక రావణుడు యుద్ధంలో చనిపోయాక మండోదరి ఎవరిని వివాహం చేసుకుంది? విభీషణుడు లంకకు రాజుగా సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత ఏం జరిగింది? మండోదరి జీవితానికి సంబంధించిన ఆసక్తికర కథనాలు కొన్ని ప్రచారం లో ఉన్నాయి. వాల్మీకి రామాయణం లో ఈ విషయాలు లేవు. ఇందులో నిజాలేమిటో ? అబద్ధాలేమిటో ? ఎవరికి తెలియవు.
ఒక పురాణం కథ ప్రకారం.. మధుర అనే అప్సరస ఒకసారి కైలాస పర్వతాన్ని సందర్శించింది. ఆ సమయంలో పార్వతి దేవి లేకపోవటంతో ఆమె శివుని చూసి మైమరచిపోయింది. వివశురాలై శివుడిని ముద్దాడింది. ఆ సమయంలో శివుడి విబూది ఆమెకు అంటింది. పార్వతి వచ్చాక ఆ విషయాన్ని గమనించి 12 సంవత్సరాలు కప్పగా బతకమని మధురకు శాపం పెట్టింది.
ఆ శాపాన్ని తగ్గించమని శివుడు పార్వతిని అభ్యర్ధించాడు. అప్పుడు పార్వతి 12 సంవత్సరాల కఠిన తపస్సు తర్వాత అసలు రూపం వస్తుందని చెప్పింది. మరోవైపు అసుర రాజు మయాసుర కుమార్తె కోసం కఠినమైన తపస్సు చేసి కూతురు కావాలనే వరాన్ని పొందాడు. ఇదే సమయంలో మధుర తపస్సు కాలం ముగిసి అసలు రూపాన్ని పొందింది. మయాసుర తపస్సు వల్ల వారికి మధుర కుమార్తెగా లభించింది. మధురకు అసుర రాజు మండోదరిగా నామకరణం చేశారు.
మాయాసుర రాజ మందిరంలో ఉన్న మండోదరిని చూసి రావణుడు ప్రేమించి పెళ్లాడాడు. రావణుడిని మంచి మార్గంలో నడిపించేందుకు ఆమె ఎంతగానో తాపత్రయపడింది. సీతను అపహరించుకుని వచ్చినప్పుడు కూడా తప్పని చెప్పింది మండోదరి. సీతను రాముని వద్దకు పంపించాలని అభ్యర్థించింది. రాముడితో తన భర్త చేసేది అధర్మ యుద్దం అని తెలిసినా.. తన భర్త గెలవాలని శుభాకాంక్షలు చెప్పి పంపింది మండోదరి.
రావణుణ్ణి చంపాక రాముడు లంకా నగరానికి విభీషణుణ్ణి రాజుగా చేసి న్యాయంగా పాలించమని చెప్పాడు. అంతేకాదు మండోదరిని వివాహం చేసుకుని లంకకు రాణిగా చేయాలని విభీషణుడికి సూచించాడు. విభీషణుడి భార్యగా మండోదరి నీతి మార్గం వైపు లంకా రాజ్యానికి మార్గ నిర్దేశం చేసింది.
సీత, మండోదరి మధ్య సంబందానికీ ఒక కథ ఉంది. గ్రిత్సమడ మహర్షి దర్భ గడ్డి నుండి పాలను తీసి కుండలో నిల్వ చేసి మంత్రాలతో శుద్ది చేశాడు. కఠినమైన తపస్సు తో లక్ష్మీ దేవిని కుమార్తెగా పొందాలనేది ఆ మహర్షి కోరిక. అయితే రావణుడు గ్రిత్సమడ మహర్షిని చంపి అతడి రక్తాన్ని పవిత్రమైన పాల కుండలో కలిపాడు.
ఋషులను చంపి వారి రక్తాన్ని కుండలో నిల్వ చేసుకుని తాగితే అన్ని అద్వితీయ అధికారాలు వస్తాయని రావణుడి నమ్మకం. తన భర్త ఇలా చేయడం మనస్కరించని మండోదరి ఆత్మహత్య చేసుకొవాలనుకుంది. ఈ క్రమంలో విషయం తెలియక కుండలో ఉన్న రక్తాన్ని విషం అనుకుని తాగింది.
అయితే ఆమె చనిపోకపోగా.. గ్రిత్సమడ మహర్షి పాలు, ఋషుల అద్వితీయ శక్తులు అన్నీ కలిపి లక్ష్మీ అవతారంతో ఉన్న ఓ బిడ్డను కన్నది. ఆమె కంగారుగా ఆ బిడ్డను బంజరు భూమిలో పాతి పెట్టింది. ఆ తర్వాత ఆ బిడ్డ మిథిలా రాజు జనక మహారాజుకు దొరికింది. ఇది హిందూ మత పురాణాల్లో అత్యంత వివాదాస్పద కథల్లో ఒకటి. ఆమెయే సీతాదేవి అట. ఇంకా పలు కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి