Many movies with mafia story line
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హీరోగా నిర్మితమైన డాన్ సినిమా దేశీయ చిత్ర పరిశ్రమపై చాలా ప్రభావం చూపింది. ఈ డాన్ సినిమా కథ ఆధారంగా పలు భాషల్లో సినిమాలు వచ్చాయి. ఈ కథ స్పూర్తితో మాఫియా డాన్ పాత్రలతో ఎన్నో సినిమాలు వచ్చాయి.
డాన్ సినిమా గోల్డెన్ జూబ్లీ హిట్. 1978లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా చరిత్ర కెక్కింది. ఈ సినిమాను అప్పట్లో 70 లక్షల బడ్జెట్‌తో నిర్మించారు. బాక్స్ ఆఫీస్ వద్ద 7 కోట్ల మేరకు వసూలు చేసి రికార్డు సృష్టించింది.
ఇందులో అమితాబ్ .. జీనత్ అమన్ జంటగా నటించారు. అమితాబ్ కు అప్పుడు వయసు 35 సంవత్సరాలు మాత్రమే. అందుకే ఆ పాత్రకు అమితాబ్ కరెక్టుగా సూట్ అయ్యారు.ఈ సినిమాకు దర్శకుడు: చంద్ర బారోట్.. నిర్మాత నారిమన్ ఇరానీ.
రచయితలు సలీం ఖాన్,జావేద్ అక్తర్. సలీం–జావేద్ గా వీరు పాపులర్ అయ్యారు.యాదోన్ కీ బారాత్, జంజీర్, దీవార్, షోలే వంటి సినిమాలకు కథలు అందించారు. సినిమాకు 20 లక్షల వరకు పారితోషకం తీసుకునే వారు.
ఇక డాన్ తొలిసారిగా 1979లో తెలుగులో యుగంధర్‌గా రీమేక్ అయింది. ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటించారు. అప్పటికి ఆయన వయస్సు 56 సంవత్సరాలు. అప్పట్లో ఎన్టీఆర్ కి అదొక వెరైటీ పాత్ర. ఆయన తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీఆర్ కి జంటగా జయసుధ నటించారు. అమితాబ్ నటనా శైలి వేరు .. ఎన్టీఆర్ నటనా శైలి వేరు. కాబట్టి ఆ ఇద్దరినీ కంపేర్ చేయలేము.
ఇక డాన్ చిత్రం 1980లో తమిళంలో ‘బిల్లా’ పేరిట తీశారు. అప్పటికి రజనీకాంత్ వయసు ముప్పైయేళ్లు మాత్రమే.రజనీ డాన్ పాత్రను తనదైన ప్రత్యేక శైలిలో నటించిప్రేక్షకుల మెప్పుపొందారు. ఆ తర్వాత కూడా రజనీ మాఫియా డాన్ పాత్రల్లో నటించారు. ‘బిల్లా’ లో రజనీ సరసన శ్రీప్రియ హీరోయిన్ గా నటించింది. బిల్లా 26 జనవరి 1980న విడుదలైంది. 25 వారాలకుపైగా ఆడి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బిల్లా విజయం రజనీకాంత్‌ను టాప్ స్టార్ ను చేసింది.
ఆ తర్వాత 1986లో ఈ డాన్ మలయాళంలో ‘శోభరాజ్’గా నిర్మితమైంది. ఇందులో హీరో పాత్రను 26 ఏళ్ల మోహన్‌లాల్ పోషించారు.డాన్ పాత్రను చేసిన ఇతర భాషా నటులతో పోలిస్తే మోహన్ లాల్ వయసులో చిన్నవాడు. తెలుగు నటి మాధవి ఇందులో హీరోయిన్ గా చేశారు. కథను కొంచెం మార్చుకున్నారు.. విజయన్ కరోటే మూల కథకు మార్పులు చేర్పులు చేశారు.జె శశి కుమార్ డైరెక్ట్ చేశారు.
ఈ చిత్రాన్ని 2006లో మళ్లీ హిందీలో ఫర్హాన్ అక్తర్ రీమేక్ చేసారు. Don: The Chase Begins Again పేరిట రిలీజ్ చేశారు. ఇందులో డాన్ పాత్రను 41 ఏళ్ల షారుక్ ఖాన్ పోషించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేసారు. కథను సలీం జావీద్ లతో కలసి ఫర్హాన్ అఖ్తర్ తయారు చేసుకుని, అతనే డైరెక్ట్ చేశారు. ప్రధాన కథాంశాన్నిమార్చారు. ఈ ఫర్హాన్ అక్తర్ ఎవరో కాదు జావేద్ కుమారుడే. Don: The Chase Begins Again కలెక్షన్ల వర్షం కురిపించింది. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
2011లో డాన్ 2 The King Is back పేరిట సీక్వెల్ తీశారు. షారుక్ మళ్ళీ హీరో … ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 200 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమా కథను ఫర్హాన్ అక్తర్, అమీత్ మెహతా రూపొందించారు.ఈ రెండు విజయాల తర్వాత ఫర్హాన్ అక్తర్ డాన్ 3 తీస్తున్నారు. రాబోయే డాన్ 3 లో 38 ఏళ్ల రణవీర్ సింగ్ డాన్ గా చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. పుష్కర్, గాయత్రీలతో కలసి ఫర్హాన్ అక్తర్ కథ రాసుకున్నారు.
2006లో వచ్చిన డాన్ ఆధారంగా తమిళంలో బిల్లా చిత్రం తీశారు.ఇందులో 36 ఏళ్ల అజిత్ ప్రధాన పాత్ర పోషించారు.ఈ సినిమాను అదేపేరుతో తెలుగులో కూడా రీమేక్ చేశారు. యంగ్ హీరో ప్రభాస్ డాన్ గా చేశారు.తమిళ వెర్షన్ తరువాత బిల్లా II పేరుతో ప్రీక్వెల్ కూడా తీశారు.ఈ విధంగా 1978 నుంచి ‘డాన్’ కథతో రకరకాల సినిమాలు వచ్చాయి.ఇంకా వస్తున్నాయి. ఇవన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందాయి.
కొసమెరుపు ఏమిటంటే ... అమితాబ్ బచ్చన్ నటించిన డాన్ చిత్రానికి స్ఫూర్తి శక్తి సమంతా తీసిన ‘చైనా టౌన్’. షమ్మీకపూర్ ఇందులో హీరో.. దీన్నే భలేతమ్ముడు గా తెలుగులో తీశారు .. ఎన్టీఆర్ హీరో. సూపర్ హిట్ మూవీ ఇది.
——-KNMURTHY