Mandhata Giripradakshina …………….
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది తీరాన ఉన్న ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకారేశ్వర్‌లో మాంధాత గిరిప్రదక్షిణ (లేదా ఓంకారేశ్వర పరిక్రమ) ను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఓంకారేశ్వర్ వచ్చిన భక్తుల్లో చాలామంది ఈ పరిక్రమ/ ప్రదక్షిణ చేస్తుంటారు.
నర్మదా నది మధ్యలో ఉన్న ఈ ద్వీపం సహజంగానే ‘ఓం’ (ॐ) ఆకారంలో ఉంటుంది. ఇక్ష్వాకు వంశానికి చెందిన మాంధాత రాజు ఈ కొండపై శివుడి కోసం ఘోర తపస్సు చేసినందున దీనికి ‘మాంధాత గిరి’ అని పేరు వచ్చింది. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
ఈ ప్రదక్షిణ మార్గం సుమారు 7 నుండి 8 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నడక ద్వారా దీనిని పూర్తి చేయడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. ఈ ప్రదక్షిణ నర్మదా నది ఒడ్డున ఉన్న ఘాట్ల నుండి ప్రారంభమవుతుంది. మార్గమధ్యంలో అనేక ఎత్తుపల్లాలు, మెట్లు ఉంటాయి.
ప్రదక్షిణ చేసే సమయంలో భక్తులు ఈ కింది ప్రదేశాలను దర్శించ వచ్చు.
ఋణముక్తేశ్వర ఆలయం: నర్మదా-కావేరి నదుల సంగమ స్థానంలో ఉంటుంది.
గౌరీ సోమనాథ్ ఆలయం: నక్షత్ర ఆకారంలో నిర్మించిన ఈ ఆలయంలో 6 అడుగుల భారీ శివలింగం ఉంటుంది.సిద్ధనాథ్ ఆలయం: పురాతన శిల్పకళా చాతుర్యానికి ఇది ప్రసిద్ధి.
ఆది శంకరాచార్యుల గుహలు, వారి భారీ విగ్రహం కూడా ఈ మార్గంలో చూడవచ్చు. నిదానంగా నడుచుకుంటూ వెళితే అన్ని చూడవచ్చు.గిరిప్రదక్షిణ నడిచి చేయాలనుకుంటే, ఉదయాన్నే వెళ్లడం మంచిది.
నడవలేని వారు పడవ ద్వారా కూడా ఈ ద్వీపం చుట్టూ ప్రదక్షిణ చేయవచ్చు. అందుకు సుమారు 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ గిరిప్రదక్షిణ చేయడానికి అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శ్రావణ మాసం ,మహాశివరాత్రి సమయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రానికి వెళ్లడానికి మీ సౌలభ్యాన్ని బట్టి వివిధ మార్గాలు ఉన్నాయి. మీరు హైదరాబాద్ నుండి బయలు దేరితే విమాన మార్గం అయితే సమీప విమానాశ్రయం దేవీ అహిల్యాబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇండోర్ కి చేరుకోవాలి. అక్కడ నుంచి ఓంకారేశ్వర్ సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్ టాక్సీ సదుపాయాలున్నాయి.
రైలు మార్గం అయితే ఖాండ్వా జంక్షన్ చేరుకోవాలి. అక్కడ నుంచి ఓంకారేశ్వర్ సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఖాండ్వా రైల్వే స్టేషన్ బయట నుండి ఓంకారేశ్వర్‌కు బస్సులు లేదా టాక్సీలు నిరంతరం అందుబాటులో ఉంటాయి.


