Puzhu…………………………………………
ఈ మలయాళ స్టార్ హీరోలు భలే సినీ జీవులు. ఒక సినిమా తరువాత మరొక సినిమాకు కలెక్షన్స్ గ్రాఫ్ పెంచుకోవడం మీద దృష్టి పెట్టకుండా, అవసరమైతే ప్రభుత్వ పెద్దల్ని కలిసి టికెట్ల రేట్లు పెంచుకునే ములాఖత్ ల కోసం ప్రయత్నించకుండా, తమ లోపలి నటుని ఆకలి తీర్చే కథల కోసం పాత్రల కోసం స్టార్డం దేవతా వస్త్రాలను విడిచి పెట్టెయ్యడానికి కూడా సిద్ధమవుతుంటారు.
ఈ మమ్ముట్టిని చూడండి… 32 యేళ్ళ కింద మలయాళ సినిమా మెగాస్టార్ గా వున్నపుడే వైకం మహమ్మద్ బషీర్ కథ ‘మతిలుకల్’ ను ఆదూర్ గోపాల క్రిష్ణన్ సినిమాగా తీస్తే పెద్ద స్టార్ ని అన్న జంకు లేకుండా అందులో నటించి జాతీయ అవార్డు కొట్టేసాడు … ఇప్పుడు, 70 యేళ్ళ వయసులో హాయిగా ‘అమ్మడూ కుమ్ముడూ’ అని స్టెప్పులేస్తూ విజిల్స్ వేయించుకోకుండా, ఎవరో కొత్త దర్శకుడొచ్చి ‘పుజు’ (పురుగు) అని స్క్రిప్టు వినిపిస్తే కాదనకుండా ప్రాణం పెట్టి నటించాడు.
ఈ మలయాళ హీరోయిన్లక్కూడా కొంచెం తిక్క ఉంది కాబోలు.ఆ పార్వతి తిరువోత్తు ని చూడండి.
మన బాలీవుడ్ హీరోయిన్స్ లా బోల్డుగా నటించేసి .. రెమ్యునిరేషన్ పెంచుకునే పనులు చేయకుండా, సినిమా రంగంలో పనిచేసే మహిళల కోసం ‘విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ ని మొదలుపెట్టింది. సినిమాల్లో స్త్రీలను కించపరిచే డైలాగులు ఉన్నాయని.. బోల్డుగా మమ్ముటినే విమర్శించి, అతడి ఫ్యాన్స్ నుండి దాడిని ఎదుర్కొన్నది.
అయినా సరే, మంచి కథ.. పాత్రలు తలుపు తట్టగానే ఇద్దరూ పాత గొడవలు మర్చిపోయి, ఈ ‘పుజు’ లో నటించారు.. కథ విషయానికొస్తే …… టెర్రరిస్టు కేసులను ఛేదించి డిపార్ట్మెంట్ లో పేరు సంపాదించిన పోలీసు ఉన్నతాధికారి కుట్టన్, భార్య చనిపోవడంతో కొడుకుతో కలిసి పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తుంటారు. వృత్తిలో భాగంగా డీల్ చేసిన కేసులు పీడ కలల్లా వెంటాడుతుంటాయి.
కుట్టన్ అతి క్రమశిక్షణ కొడుకును దూరం చేస్తుంది. రాత్రి వేళలో సరిగా శ్వాస తీసుకోలేని సమస్యలతో కుట్టన్ ఇబ్బంది పడుతుంటాడు. ఈ క్రమంలోనే కొంత కాలం క్రితం ఒక ఆర్టిస్ట్ ను కులాంతర వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయిన చిన్నచెల్లెలు అదే అపార్ట్ మెంట్స్ లోని ఒక ఫ్లాట్ లో అద్దెకు దిగుతుంది.
ఆమె ‘ ఇకనైనా మా అన్నయ్య మారతాడు’ అన్నఆశతో వుంటుంది. ‘అబ్బే ! మనవాళ్ళు అయ్యేస్ ఐ పి ఎస్ అయినా మారరు. రోబోలక్కూడా కులాలు తగిలించగల ఘనులు’ అని ఆ అమ్మాయి సహచరుని మాట. మరి, కుట్టన్ మారిపోయాడా ?
ట్రీట్‌మెంట్ పరంగా ఇది విభిన్నమైన చిత్రం. డైరెక్టర్ రథీనా చిత్రాన్నిడీల్ చేసిన విధానం చాలా బాగుంది. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ, వివిధ సంఘటనల వల్ల మానవ సంబంధాలు ఎలా మారుతాయో చెప్పడానికి డైరెక్టర్ ప్రయత్నించారు. సినిమా కొంచెం స్లో అనిపిస్తుంది. మమ్ముట్టి ని ఎవరు చంపడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం చివరి వరకు సస్పెన్స్ గా ఉంచారు.
మమ్ముట్టి ఏలాంటి పాత్ర అయినా అవలీలగా పోషించగలడు. ఇందులో కూడా సహజంగా చేసాడు. డిఫెరెంట్ షేడ్స్ ఉన్న కుట్టన్ పాత్ర కు మమ్ముట్టి కరెక్ట్ గా సూట్ అయ్యాడు. బాల నటుడు వాసుదేవ్ సజీత్ కూడా చక్కగా నటించాడు. మసాలా సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చదు. సోనీ లైవ్ లో ఉంది ,, తెలుగు వెర్షన్ లో చూడొచ్చు. అన్నట్టు, పుజు అంటే పురుగు అని అర్థమట.
—————– కోడూరి విజయ్ కుమార్