దడ పుట్టిస్తున్న మల్లన్న!

Sharing is Caring...

తెలంగాణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఇపుడు అందరిని ఆకర్షిస్తున్నది తీన్మార్ మల్లన్న. ఒక యాంకర్ గా .. జర్నలిస్టుగా కొంత పాపులారిటీ ఉన్నప్పటికీ  రెండో స్థానంలోకి దూసుకుపోయి అందరికి ముచ్చెమటలు పట్టిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఏదో పోటీ చేశాడులే .. పదో లేక పదిహేనో స్థానంలో ఉంటాడని లెక్కలేసుకున్నారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ అనూహ్యంగా  ద్వితీయ స్థానంలో నిలిచి సంచలనం సృష్టిస్తున్నాడు. ఏ రాజకీయ పార్టీ అండ లేకుండా , ఏ యూనియన్ మద్దతు లేకుండా, డబ్బు ఖర్చుపెట్టకుండా ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగి కోట్లు ఖర్చుపెట్టిన అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు.

మీడియా పర్సన్ గా తనదైన శైలిలో ఈ మల్లన్న తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడేవాడు. ప్రభుత్వ నిర్ణయాలను తూర్పారా పట్టేవాడు.తన భావాలను వీడియోల్లో కెక్కించి  ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా  ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ఆ వీడియోలకు సోషల్ మీడియా లో స్పందన బాగుండేది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు ఒకడున్నాడని ప్రేక్షకులు గుర్తించారు. ఆ గుర్తింపు ఈ ఎన్నికల్లో మల్లన్నకు  ప్లస్ అయింది.ఓ సాధారణ మధ్య తరగతి మనిషి .. తాను నమ్మిన అంశాన్ని బలంగా వినిపించగల సత్తా, సబ్జెక్టు ఉన్న జర్నలిస్ట్ మల్లన్న 83వేల 290 ఓట్లు  సంపాదించడం అంటే తమాషా కాదు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. కోదండరాం బరిలో లేకపోతే మల్లన్న గెలుపు బాటలో ఉండేవాడన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. బ్యాలట్ పేపర్ లో మల్లన్న 39  వ నంబర్ లో ఉన్నప్పటికీ ఓటర్లు వెతికి మరీ ఓట్లు వేయడం విశేషం.  కాంగ్రెస్ .. బీజేపీ అభ్యర్థులను వెనక్కి నెట్టేశారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు కోదండరాం ను అధిగమించి  అధికారపార్టీ అభ్యర్థి తో తలపడుతున్నారు.

మల్లన్న గెలుస్తాడా లేదా అన్న విషయం పక్కన బెడితే  అతను ఆస్థాయిలో ఓట్లు సంపాదించడం నిజంగా సంచలనమే. గతం లో ఒకసారి కాంగ్రెస్ తరపున మల్లన్న ఎన్నికల బరిలోకి దిగాడు. అపుడు జనాలు అంతగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ తరపున పోటీ చేయడం మైనస్ కూడా అయి ఉండొచ్చు. దీంతో అప్పట్లో అతని పోటీ నామ మాత్రం అయింది. అయితే ఈ సారి సీన్ మారింది. ముందస్తు వ్యూహంతో పాదయాత్ర చేసాడు. జనంలోకి వెళ్ళాడు. తన భావాలను ఓటర్లకు వినిపించాడు. ఇవన్నీ ఈ ఎన్నికల్లో అతని పట్ల సానుకూలత పెంచాయి. 39 ఏళ్ళ ఈ తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్ . భువనగిరి దగ్గరి మాదాపూర్ గ్రామం లో పుట్టాడు. ఎంబీఏ వరకు చదువుకున్న మల్లన్న 2002 నుంచి జర్నలిజం లో వివిధ హోదాల్లో పనిచేశాడు. v 6 న్యూస్ ఛానల్లో ప్రసారమైన తీన్మార్ వార్తలతో బాగా పాపులర్ అయ్యాడు. 

————KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!