Savings Scheme for Woman ————–
మహిళా సమ్మాన్ పొదుపు పథకం.. పోస్టాఫీసుల్లో అందుబాటులోకి వచ్చింది. మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా ఈ కొత్త చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (Mahila Samman Savings Certificates ) పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం దేశవ్యాప్తంగా 1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటుల ఉంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లను మహిళలు లేదా బాలికల పేరుపై మాత్రమే తీసుకునే వీలుంది. 2023 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు రెండేళ్లపాటు అందుబాటులో ఉంటుంది.
ఈ పథకానికి 7.50% స్థిర వడ్డీ రేటును ప్రభుత్వం ప్రకటించింది. డిపాజిట్ పై రూ.2 లక్షల గరిష్ఠ పరిమితి ఉంది. ప్రస్తుతానికి ఈ పథకం పోస్టాఫీసుల్లో అందుబాటులోకి రాగా.. త్వరలో బ్యాంకుల్లో కూడా అందుబాటులోకి వస్తుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఎలా తెరవాలి అంటే ?మీ సమీపంలోని పోస్టాఫీసును సందర్శించి మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన ఫారంను తీసుకోవాలి.
వ్యక్తిగత, ఆర్థిక, నామినేషన్ వివరాలను అందించి దరఖాస్తు పూర్తి చేయాలి.గుర్తింపు, చిరునామా రుజువు కోసం అవసరమైన పత్రాలను (ఆధార్, పాన్) దరఖాస్తు ఫారంతో పాటు సమర్పించాలి. డిపాజిట్ మొత్తాన్ని ఎంచుకుని, నగదు లేదా చెక్కు ద్వారా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.పెట్టుబడికి రుజువుగా సర్టిఫికెట్ ను ఇస్తారు. దీన్ని తీసుకోవాలి.
ఏడాది తర్వాత పాక్షికంగా నగదు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. డిపాజిట్ మొత్తంలో 40శాతం వెనక్కి ఇస్తారు.గడువు తీరకముందే ఖాతాను మూసివేయడానికి అనుమతించరు. కానీ, ఖాతాదారు చనిపోయినా, తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నా, ముందస్తుగా ఖాతాను రద్దు చేసుకోవచ్చు. అయితే, ఖాతాను ప్రారంభించి ఆరు నెలలు పూర్తవ్వాలి.
డిపాజిట్లపై పరిమితి పెంపు..మహిళల పథకంతో పాటు పలు పొదుపు పథకాల్లోనూ మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇంతకు ముందు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో ఒక్కో వ్యక్తి రూ.15 లక్షల వరకు గరిష్ఠంగా డిపాజిట్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడా ఆ పరిమితిని రూ. 30లక్షలకు పెంచారు. దీంతో పాటు మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ (MIS) పరిమితిని కూడా పెంచారు.
ఇంతకు ముందు సింగిల్ అకౌంట్ కలిగిన వ్యక్తి నెలకు కేవలం రూ.4.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేసే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ డిపాజిట్ ను రూ. 9లక్షలకు పెంచారు. ఇక జాయింట్ అకౌంట్లో రూ.7.5 లక్షలుగా ఉన్న పరిమితిని రూ. 15 లక్షల వరకు పెంచారు. దీంతో పాటు పలు చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కూడా సవరించారు. ఈ కొత్త వడ్డీ రేట్లు కూడా అమలు లోకి వచ్చాయి.