Spiritual worship………………………………..
యూపీలోని సంగమ నగరం ప్రయాగ్‌రాజ్ లో జనవరి 6 నుంచి మాఘమేళా ప్రారంభం కానుంది. ఈ మాఘ మేళా ప్రతి సంవత్సరం పుష్య పూర్ణిమ ప్రారంభమై మాఘ పూర్ణిమతో ముగుస్తుంది.ఈ మేళా సందర్భంగా గంగ, యమున, సరస్వతి సంగమం ఒడ్డున నెల రోజులపాటు కల్పవాసం చేస్తారు. మాఘ మేళా తీర్థయాత్రలో చేసే స్నానం, దానం, తపస్సు ఎంతో ముఖ్యమైనవిగా హిందువులు పరిగణిస్తారు.
ఉత్తరాదిన మాఘ మాసం జనవరి 7 శనివారం నుండి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 5 మాఘ పూర్ణిమ నాడు ముగుస్తుంది. పురాణాల ప్రకారం, మాఘ మాసానికి శ్రీ కృష్ణుని రూపమైన “మాధ్” అంటే “మాధవ్”తో సంబంధం ఉంది. మాఘమాసంలో కల్పవాసం, కృష్ణ పూజలకు భక్తులు ప్రాధాన్యత ఇస్తారు.
గంగా, యమున, సరస్వతి పవిత్ర నదుల ఒడ్డున మాఘమేళా సందర్భంగా చేసే తపస్సు, పాటించే మౌనానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కల్పవాసం అంటే సంగమం ఒడ్డున నిర్దిష్ట కాలం ఉండి సత్సంగం చేయడం, నదీ స్నానం, కృష్ణ పూజలు చేయడం పూర్వకాలం నుంచి ఉన్న సాంప్రదాయం. మన ఋషులు, గృహస్థులు,భక్తులు కల్పవాసం చేసే వారు.
క్రమం తప్పకుండా కల్పవాసం చేసే వ్యక్తులకు జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెబుతారు. కల్పవాసం ద్వారా సాధకుడు మనస్సు, ఇంద్రియాలను నియంత్రించే శక్తిని పొందుతాడు. ఈ వ్రతం మనిషికి ఉన్న అన్ని ప్రాపంచిక వ్యామోహాలను తొలగిస్తుంది. మరణానంతరం మోక్షాన్ని పొందుతాడని చెబుతారు. ఈ మాఘ మేళాకు ఎక్కువగా ఉత్తరాది వారు వెళుతుంటారు.
ఇదిలా ఉంటే ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించే మాఘమేళా యాత్రికుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సదుపాయాలు కల్పిస్తోంది. ప్రయాగ్‌రాజ్ రైల్వే జంక్షన్లో మెగా ప్యాసింజర్ షెల్టర్లను రైల్వే శాఖ సిద్ధం చేసింది. “ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు అన్ని షెల్టర్లలో విచారణ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు, రైలు సమయ ప్రదర్శన బోర్డులు, అనౌన్స్మెంట్ సిస్టమ్‌లు, తాగునీరు, లైటింగ్,టాయిలెట్ లు ఏర్పాటు చేశారు. కాగా యాత్రీకులు కరోనా కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిఉంటుంది.