Bharadwaja Rangavajhala …………………… A love story suppressed by adults
సరిగ్గా 215 ఏళ్ళ క్రితం జరిగిన విషాద ప్రేమగాధ ఇది. ఎందుకో ఇంతటి గొప్ప ప్రేమగాధ చరిత్రలో సరిగా వెలుగు చూడలేదు. బందరు వారికి కూడా ఈ ప్రేమగాధ గురించి అంతగా తెలీదు. చారిత్రక ఆధారాలు ఉన్నప్పటికీ చాలామందికి తెలియని కన్నీటి గాధ ఇది.
కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన బందరులో సెయింట్ మేరీస్ పేరిట ఒక చర్చి ఉంది. దేశంలోని పురాతన చర్చలలో ఈ చర్చి ఒకటి. క్రీస్తుశకం 1800 మొదట్లో బ్రిటిష్ దళాలు బందరు కోట ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాయి. మచిలీపట్నం రేవు పట్టణం కావడంతో ఎగుమతులు దిగుమతులు జరిగేవి.
ఈ క్రమంలోనే బందరులో ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ కాలనీలు వెలిశాయి. వారి సైనిక స్థావరాలు ఏర్పడ్డాయి. సైనికాధికారులు కుటుంబాలతో అక్కడే నివసించేవారు. అక్కడ ఉన్న క్రైస్తవుల కోసం సెయింట్ జాన్ ది డివైన్ పేరిట ఒక చర్చి ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ కు చెందిన సైనికాధికారులు, ఉద్యోగులు ఆచర్చికి వెళ్లి ఏసుక్రీస్తుని ప్రార్ధన చేసుకునే వారు.
అలా వెళ్లే వ్యక్తులలో కెప్టెన్ రాబిన్ సన్ ఒకరు. ఆయనకు అరబెల్లా అనే ఒక అందమైన కూతురు ఉంది. ఆ కాలంలో బందరు పోర్ట్ కు మేజర్ జనరల్ గా జాన్ పీటర్ ని బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది.అప్పట్లో బ్రిటిష్ ఉన్నతాధికారుల కుటుంబాల మధ్య తరచూ ఆత్మీయ కలయికలు జరిగేవి.. ఒకసారి ఓ విందు సమావేశంలో అరబెల్లా- జాన్ పీటర్ ఒకరినొకరు చూసుకున్నారు . తొలిచూపులోనే వారికి ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగింది. అది క్రమంగా బలపడింది.
చివరికి అరబెల్లా పీటర్ లకు మాత్రం అంతులేని వేదనే మిగిలింది. ఎందుకో నాటి మత పెద్దలకు పెద్ద మనసు కరువైంది. సలీం అనార్కలి ప్రేమ గాథలో మాదిరిగా అరబెల్లా తండ్రి కెప్టెన్ రాబిన్‌సన్ అక్బర్ పాత్ర పోషించాడు. సలీం అనార్కలి ప్రేమను చిదిమేయడానికి మొఘల్ పాదుషా అక్బర్ నిరంకుశంగా వ్యవహరించినట్లే అరబెల్లా తండ్రి రాబిన్‌సన్ కూడా అలాగే వ్యవహరించాడు. ఆరబెల్లాను ఇంగ్లాండ్ కు బలవంతాన పంపించాడు. కాల గమనంలో 4 ఏళ్ళు గడిచాయి.
అక్కడ వేదనతో అరబెల్లా కుంగి పోయింది. ఆమెకు జాన్ పీటర్ మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. పీటర్‌కూ అంతే అరబెల్లాపై ప్రేమ తగ్గలేదు. ఏళ్లు గడుస్తున్నా కెప్టెన్ రాబిన్ సన్ మనసు మెత్తబడలేదు. ఈ క్రమంలోనే పీటర్ లో జీవితంపై నిరాసక్తత పెరిగింది. కాలం గడిచే కొద్దీ యాంత్రికంగా మారాడు.
తండ్రి కెప్టెన్ రాబిన్ సన్ తమ పెళ్ళికి ఒప్పుకోడని ..తండ్రి మనస్సు ఎన్నటికీ కరగదని భావించి .. ఆలోచించి ఆలోచించి అరబెల్లా ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. జాన్ పీటర్ ను పెళ్లి చేసుకోవడానికే నిశ్చయించుకుంది.
ఓ రోజు…అరబెల్లా ఇంగ్లాండ్ నుంచి ఓడ ఎక్కి జాన్ పీటర్ వద్దకు దైర్యంగా కట్టుబట్టలతో వచ్చింది.
ఆనాడు బందరులో ఈ ఇద్దరి ప్రేమ ఒక సంచలనం..అందరూ వీరి ప్రేమ గురించే మాట్లాడుకున్నారు.జాన్ పీటర్ ఊహించని పరిణామానికి సంతోషపడ్డాడు. పెళ్లి గురించి అందరి ఆడపిల్లల మాదిరిగానే ఆరబెల్లా ఎన్నో కలలు కన్నది. పీటర్ జరగబోయే పెళ్ళి కోసం అరబెల్లా కోరిక మేరకు వజ్రపు తునకలు పొదిగిన వెడ్డింగ్ గౌన్, డైమండ్ రింగ్ లండన్ నుంచి తెప్పించాడు.
మరో వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం .. . ఎప్పటి లాగా బ్రిటిష్ అధికారుల ఆత్మీయ కలయికలో ‘ తాము ఇక పెళ్లి చేసుకోబోతున్నట్లు ‘ జాన్ పీటర్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. పెద్దల సమక్షంలో న్యాయబద్ధంగా తాము ఇరువురం వివాహం చేసుకుంటున్నట్లు పీటర్ చెప్పారు.
కొద్ది రోజులు గడిచేసరికి అరబెల్లా ఎందుకో నీరసపడిపోయింది. అంతకు ముందు సరిగ్గా తిండి,నిద్ర లేకపోవడం ఒక కారణం కావచ్చు. కానీ అది మలేరియా లక్షణాలు జ్వరం తెచ్చిన నీరసం అని గమనించలేదు. అలా మంచం పట్టిన అరబెల్లా అకస్మాత్తుగా 1809, నవంబర్ 6 వ తేదీ తుదిశ్వాస విడిచింది.తన కోసం అందరినీ వదిలి వచ్చిన అరబెల్లాకు ఏమీ చేయలేకపోయానని జాన్ పీటర్ కృంగిపోయాడు.
అరబెల్లా పార్ధీవ దేహానికి చెక్కుచెదరని విధంగా రసాయనాలు పూయించారు. వెడ్డింగ్‌గౌన్ ని ఆమె నిర్జీవ దేహానికి తొడిగి పెళ్లి కూతురి మాదిరిగా అలంకరించాడు. తాను సూటు ధరించి ఆమె నిర్జీవ దేహం చేతి వేలికి ఉంగరాన్ని తొడిగాడు. ఆమె చల్లని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. జాన్ పీటర్ కనుల నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. అరబెల్లాను రెండు చేతుల్తో లేపి గాజు పెట్టెలో భద్రపరిచాడు.
రోజులు .. పూటలు గడుస్తున్నాయి .. ఇక ఆమె దేహాన్నిఖననం చేయాలి. అయితే వారి ప్రేమను నాటి కాథలిక్ మత పెద్దలు ఏమాత్రం అంగీకరించలేదు. పట్టణంలో ఉన్న ఏ శ్మశానవాటికలో ఆరబెల్లా మృతదేహాన్ని ఖననం చేయడానికి అనుమతివ్వలేదు.
పీటర్ ఓ నిర్ణయానికి వచ్చాడు. బందరు లో ప్రస్తుతం ఆనందపేటగా పిలుస్తున్న చోట డచ్ వారి ఆధీనంలో ఉన్న ఖాళీస్థలం ఉంది. ఆంగ్లేయులకు నాడు బద్ధ శత్రువులైన డచ్ వారి మనస్సు వీరి విషాద ప్రేమకు చలించింది. తమ ఆధీనంలో ఉన్న పన్నెండెకరాలకు పైగా స్థలాన్ని జాన్ పీటర్ కు విక్రయించారు.
రవ్వంత సానుభూతి చూపని మతపెద్దలు ఏ ఒక్కరు అక్కడకు రాకపోవడంతో ప్రార్థనలేవీ లేకుండానే అరబెల్లాను (ప్రస్తుతం ఉన్న సెయింట్ మేరీస్ చర్చిలోపల) ఖననం చేశాడు. ఆరబెల్లా కోసం ఇంకా ఏదయినా చేయాలని జాన్ పీటర్ మనసు తీవ్రంగా తపించింది. ఉద్యోగానికి సెలవు పెట్టి లండన్‌కు వెళ్లాడు. అక్కడ తన విలువైన ఆస్తులను అమ్మేసి ఆ డబ్బుతో ఇండియాకి వచ్చాడు. బందరులో ఆమెను ఖననం చేసిన ప్రదేశంలో 18 వేల రూపాయలను వెచ్చించి అరబెల్లా స్మారకార్థం ఒక చర్చిని నిర్మించాడు.
జాన్ పీటర్ అరబెల్లాని ఏమాత్రం మరవలేకపోతున్నాడు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఆనందపేట చర్చ్‌కి వచ్చి అరబెల్లాను చూసేవాడు, చర్చి ని నిర్మించేటప్పుడే భూమి నుంచి ఎప్పుడు కావాలంలే అప్పుడు గాజు పెట్టె పైకి వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు. అది ఎలా ఉండేదంటే… పది అడుగుల ఎత్తులో గోడకు ఒక చెక్కతో తయారుచేసిన ఒక పావురం బొమ్మని అమర్చారు. ఆ చెక్క పావురాన్ని పట్టుకుని తిప్పితే నేలపై ఉన్న సమాధి లో నుంచి గాజు శవపేటిక అమరిక మొత్తం పైకి లేస్తుంది.
జాన్ పీటర్ చెన్నైకి బదిలీ అయ్యే వరకు ఇదే వ్యాపకంగా కొనసాగింది. చెన్నైలో ఉద్యోగం చేస్తూ నెలకోసారి బందరు వచ్చి అరబెల్లాను తనివితీరా చూసుకుని గుండెలవిసేలా రోదించేవాడు. అయితే అరబెల్లా కనిపించని చెన్నై నగరంలో పీటర్ ఎక్కువ కాలం జీవించలేకపోయాడు.1817లో తుదిశ్వాస వదిలాడు.
అరబెల్లా జ్ఞాపకాలతోనే జీవించిన జాన్ పీటర్ ను చెన్నై నగరం తన గుండెల్లో జ్ఞాపకంగా దాచుకుంది. చెన్నైలో నేటికీ ఉన్న ఆయన పేరున ఒక పార్కు, ఒక రోడ్డు ఉన్నాయి. మచిలీపట్నం – చెన్నపట్నం ఈ అమర ప్రేమికుల ప్రేమకు మౌనసాక్ష్యాలు.
అరబెల్లా మరణించిన తర్వాత జాన్ పీటర్ ఎవరితోనూ పెద్దగా మాట్లాడే వాడు కాదు. జాన్ పీటర్ చెన్నైకి బదిలీ అయి వెళ్లేటప్పుడు. ఆ చర్చిను ఈస్ట్ ఇండియా కంపెనీకి స్వాధీనం చేసాడు. 1842లో ఆ చర్చ్‌కు సెయింట్ మేరీస్ చర్చ్‌గా పేరు మార్చారు. ఆ నిర్మాణమే అరబెల్లా, పీటర్ లను చిరంజీవులను చేసింది. వీరి ప్రేమను దారుణంగా అణిచివేసిన నాటి మతపెద్దల వారసులు జాన్ పీటర్ నిర్మించిన చర్చిని మాత్రం స్వాధీనం చేసుకొన్నారు.
మచిలీపట్నం వెళ్లిన వాళ్లకు అరబెల్లా చర్చి (సెయింట్ మేరీస్ చర్చి) కనిపిస్తుంది.. అరబెల్లా కనిపించదు. ఎందుకంటే 1960 దశకంలో ఒకసారి చర్చిలో సున్నాలు వేస్తున్నారు. పనివాళ్లలో ఒకరు ఆసరా కోసం చెక్క పావురాన్ని పట్టుకొని ఆ పావురాన్ని అటూ ఇటూ తిప్పారు. ఆ పావురాన్ని తిప్పితే శవపేటిక పైకి వస్తుందనే సంగతి ఆ కార్మికునికి తెలియదు. అనుకోకుండా పావురం బొమ్మను తిప్పగానే అరబెల్లా ఉన్న గాజు పెట్టె సమాధి విచ్చుకొని ఒక్కసారిగా పైకి లేచింది. ఇది చూసిన సున్నం వేసే కార్మికుడు భయంతో అక్కడికక్కడే గుండె ఆగి చనిపోయాడు. దాంతో స్పందించిన అప్పటి కలెక్టర్ ఆ ఫలకాన్ని శాశ్వతంగా మూయించారు.
చివరిగా ఈ చారిత్రాత్మక ప్రేమ కధనంలో ఆరబెల్లా తండ్రి రాబిన్‌సన్ అరబెల్లా జాన్ పీటర్ ల ప్రేమని నిరాకరించడానికి ముఖ్య కారణం ఏమిటంటే అరబెల్లా కంటే జాన్ పీటర్ వయస్సులో పెద్దవాడని.. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకొన్నాడని.. ఇవి పైకి కనిపించిన కారణాలు. అయితే అసలు కారణం నాడు క్రిస్టియానిటీలో ఉన్న విభేదాలు. జాన్ పీటర్ క్యాథలిక్ కాదు. ప్రొటెస్టెంట్ కావడంతో రాబిన్‌సన్ ప్రేమని దారుణంగా మతపెద్దలు అణిచివేశారు.