మందు పుచ్చుకొవడం కూడా ఓ కళే !!

Sharing is Caring...

Mangu Rajagopal…………………          Akkineni’s experience 

కొన్నేళ్ల క్రితం సుప్రసిద్ధ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పిన ఓ సరదా సంగతి మీతో పంచుకోవాలని ఇది రాస్తున్నాను.జర్నలిస్టుగా నా జీవితం 1975 లో ‘సినీ హెరాల్డ్’ అనే సినిమా పేపరుతో ప్రారంభమైంది. అప్పుడు మా మేనమామ పన్యాల రంగనాథరావు గారు దానికి సంపాదకులుగా ఉండేవారు.

జర్నలిజం మీద నా ఆసక్తి ఆయన కనిపెట్టి అక్కడ కూర్చోపెట్టారు. సినీ జర్నలిజంలో ఉద్దండులైన రామాచారి గారు, పీఎస్ఆర్ ఆంజనేయశాస్త్రి గారు డెస్కులో ఉండేవారు. వాళ్ల మధ్య బచ్చాగాణ్ణి. నేను కూర్చుని ఏదో ఒకటి గిలుకుతూ ఉండేవాణ్ణి.

‘అత్తారింటికి దారేది’ లో రావు రమేష్ ఇంటికి కారు డ్రయివర్ గా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఒకావిడ ఎగాదిగా చూసి ‘ఇతను డ్రైవర్ లా లేడే’ అంటుంది. వెంటనే మరొకావిడ ‘అయితే అన్ని పనులకీ వాడేసుకుందాం’ అని సలహా ఇస్తుంది. అలా అక్కడ నన్ను డెస్కు, సర్క్యులేషన్ పనులకి కూడా వాడేసుకునేవారు.

కుర్రాణ్ణి కదా, ఎవరే పని చెప్పినా మహోత్సాహంగా చేసుకుపోయేవాణ్ణి.సరే, అదలా ఉంచుదాం. డెస్కులో నేనూ, ఆంజనేయ శాస్త్రి గారూ ఒకరికొకరు బాగా కనెక్ట్ అయిపోయాం. (మా అనుబంధం ‘సినీ హెరాల్డ్’ తర్వాత కూడా కొనసాగింది) ‘సినీ హెరాల్డ్’ పేపరు దినపత్రిక సైజులో ఉండే వారపత్రిక. అందులో యాభై శాతం మేటరు శాస్త్రి గారే రాసేవారు.

ఆ మేటర్ సేకరణకి తరుచూ ఆయన ఇంటర్వ్యూలకీ, సారథీ స్టూడియోకీ వెళ్తుండేవారు. ఎక్కడికి వెళ్లినా నన్ను కూడా వెంటపెట్టుకుని వెళ్లి అందరికీ పరిచయం చేసేవారు.ఇప్పుడు అసలు విషయానికి వస్తాను.“ నాగేశ్వరరావు గారి బర్త్ డే వస్తోంది. ఆయన్ని ఇంటర్వ్యూ చేద్దామనుకుంటున్నాను. ఇవాళ సాయంత్రం ఇంటికి రమ్మన్నారు. నాతోపాటు నువ్వు కూడా వస్తున్నావు “ అన్నారు శాస్త్రిగారు ఓ రోజు.

ఎగిరి గంతేశాను. భరత నాట్యం, కూచిపూడి, డిస్కో వగైరా డాన్సులన్నీ ఆడేశాను. ‘భలే మంచి రోజు, పసందైన రోజు’ అని పాట కూడా పాడేశాను. అయితే ఈ విన్యాసాలన్నీ‘రేసు గుర్రం’ సినిమాలో శృతి హాసన్ లా ‘ఇన్ సైడ్, ఇన్ సైడ్’ మాత్రమే. బయటికి మాత్రం “అలాగే సార్, తప్పకుండా ..” అన్నాను వినయ విధేయతలతో.

చిన్నప్పటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారిని సినిమాల్లో చూడడమే తప్ప బయట ఎప్పుడూ చూడలేదు. అలాంటిది ఆయన్ని ఏకంగా ముఖాముఖీ కలుసుకుని ఇంటర్ వ్యూ చెయ్యబోతున్నామంటే ఇక నా సంతోషానికి పట్టపగ్గాల్లేవు. ఎప్పుడెప్పుడు సాయంత్రమవుతుందా అని నిముషాలు లెక్కపెడుతూ కూర్చున్నాను.

సాయంత్రం ఆటోలో శాస్రిగారు, నేను అక్కినేని గారి ఇంటికి బయల్దేరాం. “ నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. నువ్వు అన్ని పాయింట్లు నోట్ చేసుకో, ఏ ఒక్కటీ మిస్సవకూడదు” హెచ్చరించారు శాస్త్రి గారు. బుద్ధిగా తలూపాను.అప్పట్లో అక్కినేని గారు బంజారాహిల్స్ లో ఉండేవారు. పక్కనే సుబ్బరామిరెడ్డి గారిల్లు. మేం వెళ్లగానే ఆయన సెక్రెటరీనో, ఎవరో మమ్మల్ని ఇంటి ఎదురుగా ఉన్న లాన్స్ లో కూర్చోపెట్టారు.

బరువైన, నగిషీలు చెక్కిన గాజు మగ్గుల్లో చిక్కటి మామిడిపళ్ల రసం తెచ్చి ఇచ్చారు. (దాని టేస్టు ఇప్పటికీ మర్చిపోలేను). అది తాగుతుండగానే అక్కినేని గారు వచ్చారు. తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు , మెడ చుట్టూ మఫ్లరుతో చకచకా నడుచుకుంటూ వచ్చిన ఆయన్ని కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాను.అక్కినేని గారితో మా ఇంటర్వ్యూ దాదాపు రెండు గంటల పైనే జరిగింది.

మా పేపరులో ఒక ఫుల్ పేజీ కి సరిపడా మేటరు దొరికేసింది. అయితే ఆ ఇంటర్వ్యూ లో అక్కినేని గారు ఇష్టాగోష్టిగా మాట్లాడిన కొన్ని విషయాలు అప్పుడు మేము ప్రచురించలేదు. అలా ప్రచురించని వాటిలో ఓ సరదా విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను.

అక్కినేని తో ఇంటర్వ్యూ అనగానే సహజంగానే ఆయన వేసిన తాగుబోతు పాత్రల ప్రస్తావన వచ్చింది. వాటి గురించి మాట్లాడుతూ ఆయన “నేను తాగుబోతుని కాను గానీ డాక్టర్ సలహా మీద రోజూ రాత్రి పడుకునేముందు రెండు పెగ్గులు బ్రాందీ తీసుకుంటాను” అని చెప్పారు. అది ప్రత్యేకంగా తెప్పించుకున్న ఇంపోర్టెడ్ బ్రాందీ అని కూడా చెప్పారు. (బ్రాండు పేరు కోనాకో, ఏదో చెప్పారు గానీ గుర్తు లేదు.)

అలా డ్రింకు గురించి ఆయన మాట్లాడుతూ సడెన్ గా “అసలు మందు కొట్టడం ఒక ఆర్టండీ” అన్నారు. అదేమిటో ఆయనే వివరించారు.“చాలామంది గటగటా తాగేస్తారు. మరి కొంతమంది చప్పరిస్తూ తాగుతారు. అసలు మాంచి కిక్కు రావాలంటే ఇలా తాగాలి. నోట్లో లిక్కరు పడగానే వెంటనే మింగేయకూడదు. ఆ ద్రవాన్ని కాసేపు నాలిక కింద భాగంలో ఉంచుకోవాలి.

(అక్కినేని గారు నోరు తెరిచి, నాలిక ఎత్తి ఆ భాగాన్ని చూపించారు). మన నోట్లో ఆ భాగం చాలా సెన్సిటివ్ గా ఉంటుందండీ… మందుని అక్కడ అలా కాసేపు ఉంచుకుంటే జివ్వుమని తొందరగా కిక్కు కొడుతుంది. రెండు పెగ్గులకే  నాలుగు పెగ్గుల ఎఫెక్టు వస్తుంది.” అన్నారు ఆయన.

ఇప్పుడైతే పుష్కర కాలంగా మందు కొట్టడం లేదు గానీ అప్పట్లో నాకు మందు అలవాటు ఉండేది. అక్కినేని గారు చెప్పిన ‘మందు ఆర్టు’ని ప్రాక్టీస్ చెయ్యడానికి ఒకటి రెండు సార్లు ట్రై చేశాను గానీ అది నాకు వర్కౌట్ అవలేదు.

నోట్లో పోసుకోగానే గుటుక్కుగుటుక్కుమని మింగే కక్కుర్తి ఉన్ననాకు మందుని కాసేపు తాపీగా నాలిక కింద ఉంచుకునే ఓపిక అస్సలు లేకపోయింది.అక్కినేని గారు 45 ఏళ్ల కిందట మాకిచ్చిన ఇంటర్వ్యూలో మిగతా విషయాలేవీ ఇప్పుడు గుర్తులేవు గానీ ఇది మాత్రం బాగా గుర్తుండిపోయింది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!