ఇండియా లో అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)కి మార్కెట్లో వరుసగా ఐదో సెషన్‌లోనూ ఎదురు దెబ్బతగిలింది. అమ్మకాల సెగ తాకి షేర్ ధర తగ్గింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఇవాళ ఎల్ ఐ సి షేర్ ధర తగ్గుముఖం పట్టి ఆల్ టైం కనిష్టానికి చేరింది.
దీంతో సంస్థ మార్కెట్ క్యాప్ 5 లక్షల కోట్ల రూపాయల దిగువకు పడిపోయింది. షేర్ లిస్టింగ్ నాటికి మార్కెట్ క్యాప్ 6 లక్షల కోట్లకు పైగా ఉంది. ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి.ఇవాళ్టి అమ్మకాలతో ఎల్‌ఐసీ షేరు 2.86 శాతం క్షీణించి.. రూ.777.40 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ ఇండెక్స్‌లో ఈ స్టాక్ ఆల్-టైమ్ ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ. 775.40ని తాకింది.
ఫలితంగా మార్కెట్ విలువ 4.97 లక్షల కోట్లకు చేరింది. భవిష్యత్తులో మరింత అమ్మకాల ఒత్తిడి కి గురి కావచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మే 17 న ఎల్‌ఐసీ షేరు రూ. 949 వద్ద లిస్ట్ అయింది. ఎఫ్‌ఐఐల భాగస్వామ్యం లేకపోవడం… లాక్ ఇన్ పీరియడ్ ముగియనుండటంతోపాటు, 4వ క్వార్టర్ ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోవడంతో ఈ షేర్ ధర మరింత దిగజారే అవకాశాలున్నాయి.
అయితే కొన్ని బ్రోకరేజీ సంస్థలు ఎల్ఐసీ షేర్ల విషయంలో సానుకూలంగానే ఉన్నాయి. ‘హోల్డ్’ సిఫారసును ఇస్తున్నాయి. ఎల్ఐసీ షేర్లు స్వల్పకాలంలోనే ప్రస్తుత స్థాయి నుంచి 11 శాతం మేర వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాయి. ఇందుకు పలు సానుకూల అంశాలున్నాయని చెబుతున్నాయి. ఎల్ఐసీ లీడర్‌షిప్, వ్యాల్యూయేషన్లు సౌలభ్యంగా ఉండడం సానుకూలమంటున్నాయి.
మార్కెట్‌లో సహచర కంపెనీలతో పోల్చితే మెరుగైన వృద్ధి సాధించేందుకు ఎల్ఐసీకే ఎక్కువ అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నాయి. కాగా మార్చి 2022 త్రైమాసికంలో సంస్థ వార్షిక ప్రాతిపదికన ఏకీకృత నికర లాభం 17 శాతం క్షీణించి 2,410 కోట్లు రూపాయలుగా ఉంది. అయితే నికర ఆదాయం 17.9 శాతం పెరిగి రూ.1.4 లక్షల కోట్లకు చేరింది, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోరూ.1.2 లక్షల కోట్లుగా ఉంది. దీర్ఘకాలిక లక్ష్యంతో కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు వేచి చూడవచ్చు.