ఒక చిత్రం…. వేయి భావాలను పలికిస్తుంది. ఒక చిత్రం… వేల ఊహలకు ఊపిరి పోస్తుంది.
ఒక చిత్రం… కొన్ని వేల హృదయాలను తాకుతుంది. ఒక చిత్రం….. కొన్ని వేల మస్తకాలకు పదును పెడుతుంది. ఒక చిత్రం…… ప్రకృతి గురించి ఆలోచించమని ప్రాధేయపడుతుంది. ఒక చిత్రం…… ప్రకృతి లోని ప్రాణులను రక్షించమని వేడుకొంటుంది.
మన చుట్టూ ఉండే పరిసరాలలో, ప్రకృతి లో మనతో పాటే సంచరించే పిచ్చుక…. ప్రపంచీకరణ నేపథ్యంలో, సాంకేతిక అడ్డంకులతో తన ప్రాణం పోగొట్టుకుంటున్న సందర్భంలో రామునికి ఉడుత సాయంగా ప్రకృతిలో కిచకిచమంటూ తిరిగే ఈ చిరు ప్రాణిని మనమంతా అరచేతిలో పెట్టుకొని కాపాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఒకప్పుడు పిచ్చుకల కోసం మన పూర్వీకులు ఎంతో తపన పడేవారు. వాటికోసం ఇంటి ముంగిట వరండాలో జొన్న కంకులు, వరికంకులు, సద్ధకంకులు వేలాడదీసేవారు. వాటిమీద వాలి పిచ్చుకలు తమ ఆహారాన్ని సంపాదించుకొని, ఇటూ అటూ ఎగురుతూ, తమ కిచకిచలతో ఈ ప్రకృతిని అందమైన ప్రపంచంగా మార్చేవి. రైతులకు సహాయపడేవి. వివిధ పంటలకు హాని చేసే క్రిమికీటకాదులను తమ ఆహారంగా తిని, వ్యవసాయానికి ఎంతో సాయం చేసేవి. పర్యావరణ సమతుల్యాన్ని, జీవవైవిధ్యాన్ని, సమగ్రతను కాపాడేవి.
అలాగే వివిధ రకాల ధాన్యపు గింజలు పిచ్చుకల కోసం చల్లేవారు.అవి ఆనందంగా పంచలో వాలి మన పంచనే ఉండేవి. ఆధునికత పెరిగిన తర్వాత సెల్ టవర్ రేడియేషన్, గాలి కాలుష్యం, వలన వాటి సంతాన ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. గాలిపటాల దారాలకు చిక్కుకొని చనిపోతున్నాయి.
అపార్ట్మెంట్ కల్చర్ పెరగడం వల్ల, నివాసాన్ని కోల్పోతున్నాయి.
పిచ్చుకల జాతి అంతరించే స్థాయికి చేరుకుంది. ఈ పిచ్చి పనులన్నీ పిచ్చుకపై బ్రహ్మాస్త్రాలయ్యాయి. ఇవే కాకుండా పండ్ల ఉత్పత్తిలో రసాయనాలు ఉపయోగించడం, చెట్లను కొట్టి వేయటం, ఆహారధాన్యాలలో అనేక కృత్రిమ ఎరువులు వాడటం వల్ల పిచ్చుక జాతి అంతరించి పోతుందని పరిశోధనల్లో తేలింది.
(మార్చి 20 న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భం గా)
———– “స్ఫూర్తి” శ్రీనివాస్