Waterfall and beach in one place …………………………
అప్సర కొండ ..పేరు చిత్రంగా ఉందికదా. ఒకప్పుడు అప్సరసలు సంచరించిన ఈ ప్రాంతానికి ఆపేరే స్థిరపడిపోయింది. ఈ అప్సరకొండ కర్ణాటక లో ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర్ పోర్ట్ పట్టణం నుంచి ఎనిమిది కి.మీ దూరంలో ఉన్నది. కొండ దగ్గరకు వాహనాలను అనుమతించరు. కొంచెం దూరం నడిచి వెళ్ళాలి.
లోపలికి వెళ్ళగానే మనకు సుందర పరిసరాలు .. పచ్చని ప్రకృతి ఆహ్వానం పలుకుతాయి. ముందుగా ఆకు పచ్చని తీగలతో అల్లుకుపోయిన వంతెన కనిపిస్తుంది. వంతన కింద గలగలమని సవ్వడి చేస్తూ పారే సెలయేరు చూపరులను ఆకట్టుకుంటుంది. వంతెన దాటి లోపలికి వెళ్లగానే కొలనులు, జలపాతం కనిపిస్తాయి.
కుటుంబంతో కొంత సమయం గడపడానికి ఇది అద్భుతమైన ప్రదేశం. ఇదొక ఉద్యానవనం లాగా ఉంటుంది. ప్రశాంత వాతావరణం బాగా ఆకట్టుకుంటుంది. పూర్వం అప్సరసలు ఇక్కడి అందాలకు పరవశించి తరచుగా వచ్చి ఈ ప్రకృతిలో మమేకమయ్యేవారట. ఇక్కడ కొండల మధ్య ప్రవహించే సెలయేర్లు, కొండ పై నుండి జాలువారే జలపాతాల చెంత స్నానాలు చేసేవారట.
ఈ ప్రదేశం అప్సరసలకు నిలయం కనుక దీనికి అప్సరకొండ అనే పేరొచ్చిందని ఒక కథనం ప్రచారంలోఉంది. అలాగే సాధువులు,సన్యాసులు ఈ ప్రశాంత వాతావరణం ఇష్టపడి ఇక్కడే ఉండిపోయారట. సమీపంలోఉన్న గుహల్లో ధ్యానం చేసుకుంటూ ఉండేవారట. ఈ ప్రదేశంలోనే ఉమాంబ మహాగణపతి దేవాలయం, ఉగ్ర నరసింహ దేవాలయాలు ఉన్నాయి.

ఈ జలపాతాల కింద స్నానాలు చేయవచ్చు. ఇక్కడకు దగ్గర్లోనే అప్సరకొండ బీచ్ కూడా ఉన్నది. ఇక్కడ పెద్దగా జన సంచారం ఉండదు. దీన్ని ఎకో బీచ్ అనికూడా పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా మారుతుంది. ఉద్యానవనం, జలపాతం, బీచ్ అన్ని ఒకే చోట ఉండటం పర్యాటకానికి పూర్తి అనుకూలం.
సదుపాయాలను కల్పిస్తే వేగంగా డెవలప్ అవుతుంది. బెంగళూరు నుంచి 463 కిలోమీటర్ల దూరంలో ఉన్న హొన్నావర్ పట్టణానికి చేరుకుంటే అక్కడ నుంచి అప్సరకొండకు వెళ్ళవచ్చు. రవాణా సౌకర్యం ఉంది. ‘మురుడేశ్వర్’ క్షేత్రానికి ఇది దగ్గరే .. అక్కడికి వెళ్ళినవారు అప్సర కొండ ని దర్శించవచ్చు.జూన్ — సెప్టెంబర్ మధ్య కాలంలో ఇక్కడ వాతావరణం ఆహ్లదకరం గా ఉంటుంది
———— Theja

