A wonderful singer………….
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడిన పాటను కేవలం పాటగా కాకుండా ఒక “మధురమైన అనుభూతి”గా అభిమానులు భావిస్తారు. ఆమె గొంతులో ఒక అద్భుతమైన స్వచ్ఛత ఉంటుంది. ప్రతి పదాన్ని చాలా స్పష్టంగా, వినసొంపుగా ఉచ్చరించడం ఆమె ప్రత్యేకత. ఎంత కష్టమైన రాగమైనా ఆమె పాడుతుంటే ఎంతో సులువుగా, ధారాళంగా సాగిపోతున్నట్లు అనిపిస్తుంది.
ఆమె గాత్రంలో ఒక రకమైన సున్నితత్వం,ఆర్ద్రత ఉంటాయి. విచారకరమైన పాటలైనా, ప్రేమ గీతాలైనా శ్రోతల హృదయాలను నేరుగా తాకుతాయి.ఆమె గొంతు మూడు స్థాయిల వరకు ఎంతో అలవోకగా వెళ్లగలదు. హెచ్చు స్థాయిలలో (High Pitch) పాడేటప్పుడు కూడా ఆమె గొంతులో మాధుర్యం తగ్గదు సగటు శ్రోతకు కూడా ఎంతో హాయిగా అనిపిస్తుంది.
లతా మంగేష్కర్ కేవలం పాట పాడరు, ఆ పాటలోని భావానికి ప్రాణం పోస్తారు. ఆమె పాడేటప్పుడు వచ్చే చిన్న చిన్న గమకాలు ఆ పాటకు ఒక ప్రత్యేకమైన అందాన్ని తెస్తాయి.ఆమె గాత్రాన్ని కోకిల గాత్రంతో పోలుస్తారు. అందుకే ఆమెను “గాన కోకిల” అంటారు.
లతాజీ తన సంగీత ప్రయాణంలో గాయనిగా ఎంత గుర్తింపు పొందారో, సంగీత దర్శకురాలిగా కూడా అంతే నైపుణ్యాన్నిప్రదర్శించారు. ఆమె తన సొంత పేరుతో కాకుండా “ఆనంద్ ఘన్” (Anandghan) అనే మారు పేరుతో మరాఠీ చిత్రాలకు సంగీతాన్ని అందించారు.
రామ్ రామ్ పావనే (1960) మరాఠా తితుకా మేల్వావా (1963) మోహిత్యాంచి మంజుల (1963) సాధి మానసే (1965) తాంబడి మాతి (1969)చిత్రాలకు సంగీతాన్నిసమకూర్చారు. ‘సాధి మానసే’ చిత్రానికి గాను ఆమె మహారాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సంగీత దర్శకురాలి అవార్డును అందుకున్నారు. ఆ చిత్రంలోని “ఐరనిచ్యా దేవా తులా” అనే పాట ఇప్పటికీ మరాఠీలో ఎంతో ప్రసిద్ధి.
ఇక నిర్మాతగా లతా మంగేష్కర్ మొత్తం నాలుగు చిత్రాలను నిర్మించారు. ఆమె 2012లో ‘LM మ్యూజిక్’ అనే సొంత మ్యూజిక్ లేబుల్‌ను కూడా ప్రారంభించారు. ‘వాదల్’ ఇది ఆమె నిర్మించిన మొదటి మరాఠీ చిత్రం. ‘ఝాంఝర్’ సి. రామచంద్రతో కలిసి నిర్మించిన హిందీ చిత్రం. ‘కాంచన్ గంగ’ మరొక హిందీ చిత్రం. ‘లేకిన్’… ప్రముఖ రచయిత గుల్జార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలోని “యారా సిలీ సిలీ” పాటకు గాను ఆమె జాతీయ ఉత్తమ గాయని అవార్డును గెలుచుకున్నారు.
ఆమె తన సంగీత దర్శకత్వం గురించి చెబుతూ, ప్రజలు తనను కేవలం గాయనిగానే చూడాలని కోరుకున్నందున ఆనంద్ ఘన్ అనే పేరును ఎంచుకున్నట్లు ఒక సందర్భంలో వివరించారు. ఇవాళ భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా ఆమె పాటలు మనలని అలరిస్తూనే ఉంటాయి.
కేవలం భారత్‌లోనే కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా,కెనడా వంటి దేశాల్లో కూడా ఆమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు.ఆమె 1974లో లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయ గాయనిగా రికార్డు సృష్టించారు, ఆ షో టికెట్లన్నీ క్షణాల్లో అమ్ముడయ్యాయి.
ఆమె మరణించే సమయానికి (2022లో) ఆమెకు ట్విట్టర్లో 1.49 కోట్ల (14.9 మిలియన్) మంది, ఫేస్బుక్లో 1.2 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 7.7 లక్షల మంది ఫాలోవర్లు ఉండేవారు..ఆమెను చాలా మంది కేవలం ఒక సెలబ్రిటీలా కాకుండా ఒక “దేవత”గా భావిస్తారు.
అర్జెంటీనాకు చెందిన ఒక అభిమాని ఆమె గౌరవార్థం తను పెంచిన ఒక గులాబీ రకానికి “లత” అని పేరు పెట్టారు. ఆమె 1940ల నుండి 2020ల వరకు సుమారు 8 దశాబ్దాల పాటు పాడటం వల్ల, ప్రతి తరంలోనూ ఆమెకు వీరాభిమానులు ఉన్నారు, ఇప్పటికి ఆమె పాటలు తప్పనిసరిగా విని మాత్రమే నిద్ర పోయే వాళ్ళున్నారు.

