‘నవత’రం మెచ్చిన నిర్మాత కృష్ణంరాజు !

Sharing is Caring...

కేవలం డబ్బు సంపాదనే కాకుండా…అభిరుచితో చలన చిత్ర ప్రవేశం చేసిన నిర్మాతల్లో నవతా కృష్ణంరాజు ఒకరు. ఆయన నిర్మించిన చిత్రాలకు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఉండేది. దర్శకుడు ఎవరు? హీరో ఎవరు లాంటి వేమీ పట్టించుకునేవారు కాదు ఆడియన్సు. అది నవతా కృష్ణంరాజు తీసిన సినిమా అంతే…డెఫినెట్ గా బాగుంటుందనే నమ్మకం. ఆ నమ్మకాన్ని చివరి వరకు నిలబెట్టుకున్న అరుదైన నిర్మాత నవతా కృష్ణంరాజు. 

సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రాలు మాత్రమే తీసిన నిర్మాత నడింపల్లి కృష్ణంరాజు. అలా చెప్తే ఆయన్ను ఎవరూ గుర్తించరు. ఇంటిపేరుతో కాకుండా సంస్థ పేరుతోనే ‘నవతా కృష్ణంరాజు’గా ఆయన సుప్రసిద్ధులు. సాహిత్యాభిమాని, అభ్యుదయవాది, మంచిమనిషిగా, రాజీపడని నిర్మాతగా, మంచిని ప్రోత్సహించే, ప్రచారం చేసే వ్యక్తిగా, నిబద్ధత గల నిర్మాతగా కృష్ణంరాజు ఎప్పటికీ గుర్తుండి పోతారు.

నవత అనే పేరు ఎంపికలోనే ఆయన ప్రత్యేకత ఏమిటో తెలిసిపోతుంది. కొత్త ఆలోచనలను…కొత్త భావాలను ఆలంబనగా చేసుకుని చిత్రాలు నిర్మించే సంస్ధగా తీర్చిదిద్దాలనే తన బ్యానర్ కు నవతా ఆర్డ్స్ అని పేరు పెట్టారు. తూర్పు గోదావరి జిల్లాలోని వన్నె చింతలపూడిలో పుట్టిన కృష్ణంరాజు చదువు ఏలూరులో సాగింది. ఎరువుల వ్యాపారం చేసినా… సాహిత్యం మీద అభిమానం….ఆసక్తి ఉండేవి. పురాణం సుబ్రహ్మణ్యశర్మ, చలసాని ప్రసాద్, నవోదయా రామ్మోహనరావు తదితరులతో పరిచయం పెరిగింది. అభ్యుదయవాది, చలన చిత్ర దర్శకుడు ప్రత్యగాత్మతో ఏర్పడిన స్నేహం కృష్ణంరాజును సినిమాల్లోకి లాక్కెళ్లింది.

నవతా కృష్ణంరాజు తొలి చిత్రం జమీందారుగారి అమ్మాయి. సాహిత్యం పట్ల అభిరుచి ఉన్న దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఆ సినిమాకు దర్శకత్వం వహించారు. సింగీతం తొలి చిత్రం ” నీతినిజాయితీ” ఫ్లాప్ అయింది. రెండో సినిమా “జమీందారుగారి అమ్మాయి” సక్సస్ సాధించింది. 1975లో రిలీజ్ అయిన ఈ సినిమాలో “మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోనా” పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. కన్నడ అనుకునే తెలుగు సంగీత దర్శకుడు జి.కె.వెంకేశ్ ఈ సినిమాకు స్వరాలనందించారు.
“జమీందారుగారి అమ్మాయి” తర్వాత సింగీతం దర్శకత్వంలోనే రెండో సినిమా నిర్మించారు కృష్ణంరాజు. అదే “అమెరికా అమ్మాయి”. బాలూ మహేంద్ర ఫొటోగ్రఫీ, జి.కె.వెంకటేశ్ సంగీతం, దేవుల పల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం వెరసి “అమెరికా అమ్మాయి” తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ఎలుగెత్తి చాటిన చిత్రంగా చలన చిత్ర చరిత్రలో శాశ్వత స్థానం సాధించింది.

నవతా చిత్రాలంటేనే అద్భుతమైన సంగీతం…హృద్యమైన సాహిత్యం ఉంటాయని ప్రేక్షకుల్లో ఒక నమ్మకం. జి.కె.వెంకటేశ్, రాజన్ నాగేంద్ర నవతా ఆర్ట్స్ చిత్రాలకు ఎక్కువగా పనిచేసిన సంగీత దర్శకులు. తొలిరోజుల్లో దాశరథి, కృష్ణశాస్త్రి…తర్వాత రోజుల్లో వేటూరి సుందరరామ్మూర్తి నవతా వారి చిత్రాలకు గేయరచయితలుగా పనిచేశారు. మంచి సంగీత సాహిత్యాలకే కాదు…సెన్సిబుల్ హ్యూమర్ కు కూడా నవతా చిత్రాలు పెద్దపీట వేసేవి.

నవతా కృష్ణంరాజు నిర్మించిన మూడో చిత్రం “పంతులమ్మ”. పంతులమ్మ పేరు వినగానే ‘మానసవీణా మధుగీతం’ పాట గుర్తు రాకమానదు. వేటూరి సుందరరామ్మూర్తి కవితాత్మను ఆవిష్కరించిన గీతాల సమాహారం ‘పంతులమ్మ’. సింగిల్ కార్డ్ రైటర్ గా అన్నీ అద్భుతమైన గీతాలే రాశారు వేటూరి. ‘మనసెరిగిన వాడు మా దేవుడు’, ‘సిరిమల్లె నీవే…విరిజల్లు కావే’….ఇలా ప్రతి పాటా గుర్తుండిపోయేదే. ఒక అన్నిట్లోకి కాస్త డిఫరెంటుగా వేటూరి పొయిటిక్ స్పార్క్ కనిపించే పాట ‘పండగంటి వెన్నెలంతా చందరయ్యా…దండగైపోతోంది చందరయ్యా’…నవతా చిత్రాల కథానాయకుడు రంగనాథ్ ‘పంతులమ్మ’ సినిమాలోనూ హీరోగా నటించారు. ఒక సినీనటుడి జీవితం చుట్టూ తిరిగే కథ. అందులో ‘పంతులమ్మ’గా టైటిల్ రోల్ లో లక్ష్మి నటన ఆకట్టుకుంటుంది. 

పంతులమ్మ తర్వాత తన క్లాస్ మేట్ పి.సాంబశివరావు డైరక్షన్ లో ఓ సూపర్ కామెడీ సెన్సేషన్ తీశారు నవతా కృష్ణంరాజు. జంధ్యాల రచన చేసిన ఆ సినిమా పేరు ‘ఇంటింటి రామాయణం’. పెళ్లైన మూడు జంటల మధ్య నడిచే కథ. పెళ్లైన కొత్తలో వచ్చే చిలిపి తగాదాలు, అపార్ధాలు, అర్ధం చేసుకోడాలు, వేడుకోళ్లు, అర్పణలు, కోరికలు, కవ్వింతలు ఇలా ఒకటేమిటి అన్నిటినీ తెరమీద అందంగా ఆవిష్కరించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. రాజన్ నాగేంద్ర మ్యూజిక్ డైరక్షన్ లో’ వీణ వేణువైన సరిగమ విన్నావా’ అంటూ మరోసారి వేటూరి చెలరేగిపోయారు.

జంధ్యాలతో నవతా కృష్ణంరాజుకు పరిచయం అయింది ఇంటింటి రామాయణం స్క్రిప్ట్ దశలోనే. ఆ పరిచయం కూడా సాంబశివరావు ద్వారానే. ‘ఇంటింటి రామాయణం’ తర్వాత దేవదాస్ కనకాల దర్శకత్వంలో నూతన్ ప్రసాద్ కీలక పాత్రగా ‘ఓ ఇంటి భాగోతం’ సినిమా తీశారు. ఇది ఓ పిసినారి జమీందారు ఇంటి కథ. దీని స్క్రిప్ట్ వ్యవహారంలో జంద్యాల కూడా ఓ చేయి వేశారు. ఈ సినిమాతోనే ఈవీవీ సత్యనారాయణ తెరంగేట్రం చేశారు.

ప్రయోగాలు చేయడం నవతా కృష్ణంరాజుకు కొత్తేం కాదు. కొత్తగా ఆలోచించడం అంతకన్నా కొత్త కాదు. ఈ నవ్యత కోరుకునే ధోరణే బాపు రమణలతో ‘త్యాగయ్య’ మళ్లీ తీయిస్తే అనే ఆలోచనకు నాంది పలికింది. జంధ్యాలతో ప్రేమ సెంటిమెంట్ కామెడీ కలబోసిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘నాలుగు స్ధంభాలాట’ తీయించింది.

భైరప్ప కన్నడ నవల ‘వంశవృక్షం’ ను బాపు దర్శకత్వంలో తెలుగులో తీశారు. శంకరాభరణం సోమయాజులు, అనిల్ కపూర్, జ్యోతి ప్రధానపాత్రధారులుగా రూపొందిన ఈ సినిమా పెద్దగా సక్సస్ కాకపోయినా…అవార్టులు తెచ్చిపెట్టింది. ఈనాడు గ్రూప్ సినిమా పత్రిక సితార తరపున ఆ ఏడాది ప్రకటించిన అన్ని ఉత్తమ అవార్టులూ వంశవృక్షమే కొట్టేసింది. సితార ప్రకటన వెలువడిన రోజే పేపర్లలో బాపు రమణలకు అభినందనలు తెలుపుతూ నవతా కృష్ణంరాజు ఇచ్చిన ప్రకటనలో ‘త్యాగయ్య’ తీయబోతున్నట్టు స్పష్టం చేశారు.

బాపు మాటల్లో చెప్పాలంటే ’త్యాగయ్య’. నలభై ఐదు పైగా స్వామి వారి కీర్తనల మకుటాల ఆధారంగా రమణగారు అద్భుతమైన సీన్లు కల్పించారు. కె.ఆర్.విజయ త్యాగయ్య భార్యగా నటించింది. ఎంతో గొప్పగా నటించినా సోమయాజులుగారిని ప్రొటీన్ రిచ్ త్యాగయ్య అనేశారు జనం. సినిమా భారీగా దెబ్బతీసింది.త్యాగయ్య కొట్టిన దెబ్బకు మరో నిర్మాతైతే ఏమైపోయి ఉండేవాడో. నవతా కృష్ణంరాజు కాబట్టి తట్టుకుని నిలబడగలిగాడు. ఆ వెంటనే జంధ్యాల దర్శకత్వంలో ‘నాలుగు స్ధంభాలాట’ ప్రకటించారు రాజుగారు. మళ్లీ రాజుగారి సంగీత ధ్వయం రాజన్ నాగేంద్ర…రైటర్ వేటూరి ప్రత్యక్షమై అద్భుతమైన పాటలను అల్లి సినిమాను సగం హిట్ చేసేశారు.

‘ఓ ఇంటి భాగోతం’ తర్వాత దేవదాస్ కనకాలతో ‘నాగమల్లి’ లాంటి ఒకటి రెండు సినిమాలకు పనిచేసిన ఈవీవీ మళ్లీ ‘నాలుగు స్థంభాలాట’తో రాజుగారి కాంపౌండుకి షిఫ్ట్ అయ్యాడు. అలా అనేకన్నా జంధ్యాల ఆస్దానంలోకి ప్రవేశించాడు అనడం సబబు.’ నాలుగు స్థంబాలాట’లో టైటిల్స్ పడేప్పుడు సముద్రం ఒడ్డున సినిమాలోని రెండు జంటలు ‘నాలుగు స్థంభాలాట’ ఆడుతూ ఉంటాయి. మధ్యలో విధి అనే బోర్డు  వేసుకుని ఓ దొంగ ఉంటాడు. ఆ విధి  బోర్డు   వేసుకుంది ఎవరో కాదు…ఈవీవీ సత్యనారాయణే. ఇందులో జంధ్యాల రాసిన సుత్తి డైలాగులు అద్భుతంగా పేలి సినిమాను రజతోత్సవ స్థాయి విజయం పొందేలా చేశాయి.
‘నాలుగు స్థంభాలాట’ నవతా బ్యానర్ లో వచ్చిన చివరి సూపర్ హిట్ చిత్రం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నవతా వారు చేసిన ప్రయోగాలేవీ కలసి రాలేదు. అయితే ఎదురు దెబ్బలు తగిలినా తను నమ్మిన సిద్దాంతం నుంచి మాత్రం డీవియేట్ కాలేదు రాజుగారు. 
నవతా కృష్ణంరాజు సాహిత్యజీవి. సాహితీ పరిశోధకుడు వేల్చేరు నారాయణరావు రాసిన పువ్వు కాగితపు పువ్వు కథను తీసుకుని సినిమా తీయాలనుకున్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తీసిన ఆ సినిమా పేరు ‘రాజు రాణి జాకి’. రాధిక చంద్రమోహన్ గొల్లపూడి మారుతీరావు కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా ఓపెనింగ్స్ ను రాబట్టడం విశేషం. మళ్లీ రాజన్ నాగేంద్ర సంగీతంలో వేటూరి రచనలో అద్భుతమైన గీతాలు…ఆకాశ వీధులలోనా వినిపించె ఓ స్వప్నగీతం లాంటి మెలోడీ సాంగ్స్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి.

‘ రాజు రాణి జాకి’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని తీసిన సినిమా ‘జడగంటలు’. కె.ఎస్ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన జడగంటల్లో సురేష్, విజయశాంతి జంటగా నటించారు. మహదేవన్ సహాయకుడు పుహళేంది సంగీతం అందించిన మూడు సినిమాల్లో ‘జడగంటలు’ ఒకటి. నవతా ఆర్ట్స్ లో మరో సారి వేటూరి సుందరరామ్మూర్తి చెలరేగిన సినిమా ఇది. జడగంటలు మనసిస్తుంటే…గుడిగంటలు మంత్రిస్తుంటే…ముడి విడిపోయిన ముద్దును చూసి కుంగిపోవాల లాంటి అద్భుత పదబంధాలతో సాగుతుందీ ఈ చిత్రంలో వేటూరి కలం. పున్నమిలాగ వచ్చి పొమ్మని జాబిల్లడిగింది. పుష్కరమల్లె వచ్చిపొమ్మని గోదారడిగింది. ఎప్పటికీ గుర్తుండిపోయే గీతం.
‘జడగంటలు’ తర్వాత నవతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన చివరి చిత్రం ‘సంసారం ఓ సంగీతం’. రేలంగి నరసింహారావు డైరక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ విషయంలో నవతా కృష్ణంరాజు చాలా కష్టపడాల్సి వచ్చింది. చంద్రమోహన్, విజయశాంతి, శరత్ బాబు నటించిన ఈ సినిమాకూ పుహళేందే సంగీతం అందించారు. మరో విశేషం ఈ సినిమాలో నవతా కృష్ణంరాజే స్వయంగా ఓ పాట రాయడం. నిను తలుస్తూ ఉంటే అంటూ సాగే ఈ పాట చాలా గొప్పగా ఉంటుంది.

నవతా కృష్ణంరాజు కన్నుమూయడానికి కొద్ది రోజుల ముందు ఓ పత్రికకు ఇంటర్యూ ఇచ్చారు. ఇండస్ట్రీలోకి రావడం మీకు ఎలా అనిపిస్తోందని అడిగారా జర్నలిస్ట్. అయ్యా…మతిలేక వచ్చాను…గతిలేక కొనసాగుతున్నాను…ఇప్పుడా విషయాలు ఎందుకు లెండి అనేశారాయన. కష్టాలు నష్టాలు ఎదురైనా నమ్మిన ఆదర్శాల నుంచి అంగుళం కూడా కదలని నిబద్దత కలిగిన నిర్మాత నవతా కృష్ణంరాజు
త్యాగయ్య సినిమా షూటింగు తిరువయ్యూరులో జరిగింది. రెండు నెలల షెడ్యూలు. ఈ 2 నెలలు సినీ టెక్నీషియన్లు తమతోనే ఉండిపోతే, వారి కుటుంబాలు చెన్నైలో ఇబ్బంది పడకుండా… అందరి ఇళ్ళకు అడ్వాన్సులు పంపించారు ఆయన.  నవత కృష్ణంరాజులాంటి నిర్మాతలు బహు అరుదు  అని చెప్పుకోవాలి. 

 

Read also  >>>>   దుర్యోధనుడికి డ్యూయెట్ ? ఎన్టీఆర్ కే సాధ్యం!

——-  Bharadwaja Rangavajhala

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!