కేరళలోని కొట్టాయంలో ఉన్న కృష్ణుడి దేవాలయానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆలయం కేవలం రెండు నిమిషాలు మాత్రమే మూసి ఉంచుతారు. అర్ధరాత్రి 11. 58 నిమిషాలకు మూసి మరల రెండు నిమిషాల్లో తెరుస్తారు. తెల్లవారుజామున రెండు గంటలనుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సూర్య గ్రహణం .. చంద్ర గ్రహణం వచ్చిన రోజుల్లో కూడా గ్రహణం వేళల్లో ఆలయం తెరిచే ఉంటుంది.
అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా ఈ గుళ్లో దీపారాధన చేస్తారు. ఇక్కడ అర్చకులు కృష్ణమూర్తికి రోజుకి 7 సార్లు మహా నైవేద్యం సమర్పిస్తారు. స్వామి ఎపుడూ ఆకలితో ఉంటారని … అందుకే 7 సార్లు నైవేద్యం పెడుతుంటారని స్థానికులు చెబుతుంటారు.
నైవేద్యం పెట్టిన పిదప దాని పరిమాణం కొంచెం కొంచెం తగ్గుతుందని చెబుతుంటారు. అర్చకులు ఈ విషయాన్నీ ఎన్నోసార్లు గమనించారట. భక్తులు కూడా ఈ విషయాన్నినమ్ముతారు. ఇందుకు సంబంధించి పురాణ కథానాలు ప్రచారంలో ఉన్నాయి.
మామూలుగా అన్నిఆలయాలలో అభిషేకం, అలంకరణ పూర్తి అయ్యాక స్వామివారికి నైవేద్యం పెట్టడం ఒక ఆచారం. కానీ అందుకు భిన్నంగా ఈ కృష్ణుడికి మాత్రం నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం, అలంకరణ చేస్తారు. నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైనా, ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారు జామున తెరవక పోయినా దాన్ని దోషంగా పరిగణిస్తారు.
ఇక్కడ ప్రసాదం చాలా రుచికరంగా ఉంటుంది. స్వామి వారికి నైవేద్యం పెట్టిన తర్వాత మిగిలిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. భక్తులు తప్పనిసరిగా ఆ ప్రసాదం పంపిణీ వరకు వేచి ఉండి .. దాన్ని స్వీకరించి కానీ వెళ్లరని అంటారు.
అందుకే హిందూ దేవాలయాల్లో ఇదొక అరుదైన ఆలయంగా గుర్తింపు పొందింది. ఈ కృష్ణుడిని దర్శిస్తే గ్రహ దోషాలు, గ్రహణ దోషాలు, సంతాన దోషాలు, సర్పదోషాలు, ఇతర దోషాలన్ని తొలగిపోతాయని చెబుతుంటారు.
ఈ తిరువరపు కృష్ణాలయం 1500 సంవత్సరాల పురాతనమైనది. కొట్టాయం రైల్వే స్టేషన్ నుండి 8 కి.మీ దూరంలోనే ఆలయం ఉంది. అక్కడ నుంచి బస్సులు .. ఆటోలు లభిస్తాయి.