Kinnaur Kailash Yatra ……………..
పంచ కైలాస పర్వతాలు అనేవి శివుని నివాసాలుగా పరిగణించబడే ఐదు పవిత్ర హిమాలయ శిఖరాలు. వీటిని కైలాస పర్వతం (టిబెట్), ఆది కైలాస (ఉత్తరాఖండ్), కిన్నౌర్ కైలాస (హిమాచల్ ప్రదేశ్), శ్రీఖండ్ మహాదేవ్ (హిమాచల్ ప్రదేశ్)మణిమహేష్ కైలాస (హిమాచల్ ప్రదేశ్) పేర్లతో పిలుస్తారు. ప్రతి శిఖరం ప్రత్యేకమైన పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.. లోతైన ఆధ్యాత్మిక అనుభవాలను అందిస్తుంది. మోక్షం,అంతర్గత శాంతిని కోరుకునే భక్తులు ఈ ఐదు పర్వతాలను దర్శించి వస్తారు.
కిన్నౌర్ కైలాష్ హిందువులు, బౌద్ధులకు అత్యంత పవిత్రమైన పర్వతం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో, ఇండో-టిబెటన్ సరిహద్దుకు సమీపంలో ఉంది.ఇక్కడ శివుడు,పార్వతీ దేవి నివసిస్తారని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఇక్కడ యాత్ర జరుగుతుంది.ఈ పర్వతంపై 79 అడుగుల (సుమారు 24 మీటర్లు) సహజ శివలింగం ఆకారంలో ఉన్న రాతి స్తంభం ప్రధాన ఆకర్షణ.
సూర్యుడు కదులుతున్న కొద్దీ ఈ శివలింగం రంగులు మారుతుందని చెబుతారు – తెల్లవారుజామున తెలుపు, పగటిపూట పసుపు, సాయంత్రం ఎరుపు,రాత్రి నలుపు రంగులోకి మారుతుంది.ఈ పర్వత శిఖరం సముద్ర మట్టానికి సుమారు 6,050 మీటర్ల (19,849 అడుగులు) ఎత్తులో ఉంది. కిన్నౌర్ కైలాష్ యాత్ర భారతదేశంలోని అత్యంత కఠినమైన ఆధ్యాత్మిక ట్రెక్కింగ్‌లలో ఒకటి.
ఈ యాత్ర సాధారణంగా తంగ్లింగ్ లేదా చరాంగ్ గ్రామం నుండి మొదలై చరాంగ్ లా పాస్ మీదుగా సాగుతుంది.కిన్నౌర్ కైలాష్‌కు వెళ్లడానికి ప్రధాన మార్గం హిమాచల్ ప్రదేశ్‌లోని రికాంగ్ పియో (Reckong Peo) మీదుగా ఉంటుంది. ఈ యాత్ర సాధారణంగా ఈ జిల్లా ప్రధాన కార్యాలయం సమీపం నుండే మొదలవుతుంది. వాతావరణ పరిస్థితులపై ఆధారపడి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం యాత్ర అధికారిక తేదీలను ప్రకటిస్తుంది.
యాత్ర సుమారు 14 నుండి 16 కిలోమీటర్ల కఠినమైన ట్రెక్కింగ్. అధిక ఎత్తులో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. కాబట్టి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.వాతావరణం అకస్మాత్తుగా మారుతుంది కాబట్టి వెచ్చని దుస్తులు, రెయిన్‌కోట్ వెంట ఉంచుకోవడం అవసరం. నిటారుగా ఉండే కొండలు,మంచు మార్గాల గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది శారీరకంగా చాలా శ్రమపడాలి.
సాధారణంగా ఈ యాత్ర 5 నుండి 7 రోజులు పడుతుంది.ప్రధాన ట్రెక్కింగ్ (టాంగ్లింగ్ గ్రామం నుండి శివలింగం చేరుకుని తిరిగి రావడానికి) 2 నుండి 3 రోజులు పడుతుంది. వాతావరణం,నడక వేగంపై ఆధారపడి ఇది మారవచ్చు. యాత్ర మార్గంలో ఆధునిక హోటళ్లు ఉండవు. రాత్రి బస సాధారణంగా ఉంటుంది.. రిక్యాంగ్ పియో / కల్పాలో యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ హోటళ్లు లేదా హోమ్‌స్టేలలో స్టే చేయవచ్చు.
ప్రధాన బేస్ క్యాంప్ అయిన గణేష్ బాగ్ / గణేష్ పార్క్ లో యాత్రికులు టెంట్లు (Camps) వేసుకుని ఉండాలి.శివలింగానికి దగ్గరగా ఉండే గుహ (Gufa) ప్రాంతంలో కొందరు రాత్రి బస చేస్తారు.కానీ ఇక్కడ వసతులు చాలా పరిమితం.గణేష్ బాగ్ వంటి ప్రదేశాలలో స్థానిక స్వచ్ఛంద సంస్థలు లేదా టూర్ ఆర్గనైజర్లు సాధారణ శాఖాహార భోజనం (దాల్, రైస్, రోటీ) అందిస్తారు.
దారిలో ఒకటి లేదా రెండు చిన్న ధాబాలు ఉండవచ్చు, అక్కడ టీ లేదా నూడుల్స్ వంటివి దొరుకుతాయి. ట్రెక్కింగ్ సమయంలో శక్తి కోసం ఎనర్జీ బార్స్, డ్రై ఫ్రూట్స్, తగినంత మంచినీరు వెంట ఉంచుకోవడం తప్పనిసరి.
యాత్రకు వెళ్లే ముందు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం లేదా కిన్నౌర్ జిల్లా అధికారిక వెబ్‌సైట్లో అప్ డేట్స్ చూసుకోవడం మంచిది.. ఎందుకంటే వాతావరణ పరిస్థితుల వల్ల యాత్ర తేదీల్లో మార్పులు ఉండవచ్చు.. గత ఏడాది యాత్రకు వెళ్లిన వారు భారీ వర్షాల వలన అక్కడ ఇరుక్కుపోయారు. ప్రభుత్వ అధికారులు వారిని రక్షించి సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
యాత్రికులు ముందుగా కిన్నౌర్ జిల్లా అధికారిక వెబ్‌సైట్లో ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వైద్య ధృవీకరణ పత్రం తప్పనిసరి. విమాన మార్గం ద్వారా వెళ్ళాలి అనుకుంటే సిమ్లాలోని జుబ్బర్‌హట్టి విమానాశ్రయానికి చేరుకోవాలి. అక్కడ నుండి బస్సు లేదా టాక్సీ ద్వారా కిన్నౌర్ చేరుకోవచ్చు.
రైలు మార్గం అయితే సిమ్లా వరకు రైలులో, అక్కడ నుండి బస్సు లేదా టాక్సీ ద్వారా కిన్నౌర్ చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం అయితే చండీగఢ్ లేదా ఢిల్లీ నుండి సిమ్లా మీదుగా రికాంగ్ పియోకు బస్సు సౌకర్యం ఉంది.
రికాంగ్ పియోకు చేరుకున్నాక అక్కడ లేదా కల్ప లో ఒక రాత్రి బస చేసి, మరుసటి రోజు ఉదయం ట్రెక్కింగ్ ప్రారంభ స్థలానికి (బేస్ క్యాంప్) చేరుకోవాలి. స్థానిక గైడ్‌లు,పోర్టర్‌ల సహాయం తీసుకోవడం తప్పనిసరి.
Pl. Read it also ………………….చోటా కైలాష్ యాత్ర


